
ఆ ఆలోచన నుంచి వచ్చిందే అర్జున్‌రెడ్డి
చాలా మందికి నిజ జీవితంలో బ్రేకప్ లవ్ స్టోరీ ఉంటుంది.
‘‘చాలా మందికి నిజ జీవితంలో బ్రేకప్ లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీలో ఉండే డార్క్ మూడ్ మీద సినిమా తీయాలనుకున్నాను. ఆ ఆలోచన నుంచి వచ్చిందే ‘అర్జున్‌రెడ్డి’ సినిమా’’ అని దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా అన్నారు. విజయ్ దేవరకొండ, షాలిని జంటగా ఆయన దర్శకత్వంలో ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మించిన ‘అర్జున్‌రెడ్డి’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. సందీప్‌రెడ్డి వంగా మాట్లాడుతూ– ‘‘నాది వరంగల్. ఫిజియోథెరపీ చేశాక, ఆస్ట్రేలియాలో ఫిల్మ్ మేకింగ్‌లో పీజీ చేశా. నాగార్జునగారి ‘కేడి’ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేశా.
‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’కు స్క్రిప్ట్‌వర్క్ చేశా. నా జీవితంలో నా చుట్టూ జరిగిన సంఘటనలు, వ్యక్తుల ఆధారంగా స్ఫూర్తి పొంది ‘అర్జున్‌రెడ్డి’ కథ రాసుకున్నా. నాది కూడా లవ్ ఫెయిల్యూరే. ఇందులో నా అనుభవాలు కూడా కొన్ని ఉన్నాయి. వారం రోజులు వర్క్ షాప్ చేసిన తర్వాత విజయ్‌ని ఎంచుకున్నా. లిప్‌లాక్ పోస్టర్‌లో హీరో హీరోయిన్ కళ్లు మూసుకునే ఉంటారు. ఆ ఫిలింగ్‌ను క్యాచ్ చేస్తారనుకున్నా, కానీ కొందరు అందులో అశ్లీలతను వెతికారు. సెన్సార్ బోర్డు సూచనతో కొన్ని పదాల్ని మ్యూట్ చేశాం. రెండు కథలు రెడీగా ఉన్నాయి. ఒక పెద్ద హీరో నుంచి కాల్స్ వస్తున్నాయి.‘అర్జున్‌రెడ్డి’ సక్సెస్ అయితే నెక్ట్స్ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తా’’ అన్నారు.