చిన్నారి జేజెమ్మ | Arundathi Bommali Divya INTERVIEW | Sakshi
Sakshi News home page

చిన్నారి జేజెమ్మ

Published Thu, Sep 10 2015 2:32 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

చిన్నారి జేజెమ్మ - Sakshi

చిన్నారి జేజెమ్మ

అరుంధతి చిత్రంలో చిన్నారి జేజెమ్మగా గుర్తింపు సంపాదించుకుంది.
 అపరిచితుడు చిత్రంలో సైతం మంచి పాత్ర పోషించింది.  
 తమిళదేశంలో ఉంటున్న అచ్చ తెలుగు అమ్మాయి దివ్య.
 చదువును నిర్లక్ష్యం చేయకుండా..  
 సినిమా అవకాశాలను వదులుకోకుండా...
 తన ప్రతిభను ప్రదర్శిస్తోంది...
 కథానాయిక స్థాయికి ఎదిగింది... ప్రముఖ నేపథ్యగాయకుడు
 మనో కుమారుడు షకీర్‌తో జత కట్టింది.
 తెలుగు పత్రికకు ఇచ్చిన మొట్టమొదటి ఇంటర్వ్యూ...
 ఫీచర్స్ ప్రతినిధి, సాక్షి, చెన్నై

 
  1. నటిగా మీ కెరీర్ ఎలా మొదలైంది?
 నా కెరీర్ ప్రకటనలతో మొదలైంది. ఆ తరవాత సీరియల్స్, సినిమాలు. బాలనటిగా మొదటి సినిమా ఉయిర్ ఒసై. కమర్షియల్‌గా మొదటి చిత్రం బోస్. ఇందులో శ్రీకాంత్, స్నేహ ప్రధాన పాత్రలు. ప్రస్తుతం డా. ఎంజీఆర్ విశ్వవిద్యాలయంలో బీబీఏ సెకండియర్ చదువుతున్నాను.
 
 2. చదువుని నటనని  ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు?
 చిన్నప్పటి నుంచి నా గురువులు నా చదువుకి సహకరించడమే కాకుండా, నా నటన విజయవంతం కావడానికి ఎంతో సహాయపడ్డారు. ఒక్కోసారి రాత్రి హైదరాబాద్‌లో బయలుదేరి, ఉదయాన్నే చెన్నై వచ్చి, పొద్దున్నే చదువుకుని, మధ్యాహ్నం పరీక్షలు రాయవలసి వచ్చేది. నా స్నేహితులు నాకు నోట్స్ రాసిపెట్టి ఎంతగానో సహకరించారు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని.
 
 3. మీరు తెలుగు అమ్మాయి కదా. తమిళంలో ఎక్కువ అవకాశాలు వస్తున్నాయా? తెలుగులో కూడా వస్తున్నాయా?
 నేను అచ్చ తెలుగు అమ్మాయిని. మా నాన్నగారిది ఆంధ్రాలోని రాజమండ్రి. అయితే అక్కడ చాలా తక్కువ రోజులు ఉన్నారు. అక్కడ నుంచి ముంబై, ఆ తరవాత చెన్నై. నా చిన్నతనం నుంచి చెన్నైలోనే ఉండడం వల్ల తమిళంలోనే నా నటన ప్రారంభించాను. తెలుగులో నటించడం నాకు చాలా ఇష్టం. నన్ను మంచి నటిగా నిలబెట్టే అవకాశాలు వస్తే తప్పక చేస్తాను.
 
 4. ఇప్పటివరకు ఎన్ని చిత్రాల్లో నటించారు?
 బాలనటిగాా ఇప్పటివరకు సుమారు 35 చిత్రాల్లో నటించాను. ఇవి కూడా శంకర్, బాలూమహేంద్ర, బాలచందర్, కోడి రామకృష్ణ, ప్రభుదేవా, ఎంఎస్‌రాజు, గుణశేఖర్...వంటి పెద్ద పెద్ద దర్శకుల దగ్గర పనిచేశాను. ఇంత చిన్న వయసులో అంత పెద్ద పెద్ద దర్శకులతో పనిచేయడం నా అదృష్టం. హీరోయిన్‌గా ఇప్పటివరకు నాలుగు చిత్రాల్లో మాత్రమే నటించాను. మూడు తమిళ ం, ఒకటి తెలుగు.
 
 5. ఏయే సీరియల్స్‌లో నటించారు?
 ఇప్పటివరకు సుమారు 25 సీరియల్స్‌లో బాలతారగా నటించాను. మధుమాసం, కా కా కీ కీ (బాలాజీ టెలిఫిల్మ్స్), గోదావరి, ఇంటింటి రామాయణం... ముఖ్యంగా అమ్మవారికి సంబంధించిన కనకదుర్గ, పాతాళభైరవి సీరి యల్స్‌లో నటించాను. ఇవే కాకుండా... జయ, చుట్టీ, రాజ్ టీవీల్లో ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా పనిచేశాను.
 
 6. త ల్లిదండ్రుల ప్రోత్సాహం...
 బాలతారగా నటించే రోజుల నుంచి వాళ్లే నా కెరీర్‌కి సపోర్ట్‌గా నిలిచారు. పరీక్షల సమయంలో అమ్మ నిద్రపోకుండా పక్కనే కూర్చుని నన్ను చదివించేది. మా టీచర్లు, మా పేరెంట్స్ నాకు వెన్నెముక వంటివారు. అన్నియన్ (అపరిచితుడు), అరుంధతి చిత్రాల్లో నటించేటప్పుడు నాకు ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. ‘నువ్వు బాగా చేస్తే అందరూ నిన్ను గుర్తుంచుకుంటారు’ అన్నారు. నిజంగానే ఇప్పటికీ అంద రూ నన్ను ఆ రెండు చిత్రాల గురించే అడుగుతుంటారు.
 
 7. మనో గారి అబ్బాయితో సినిమా గురించి...
 మనోగారి అబ్బాయి షకీర్‌తో ఒక తమిళ సినిమా చేస్తున్నాను. ఇందులో నాది బబ్లీ రోల్. ఇంతవరకు నేను చేసిన వాటన్నింటి కంటే ఈ పాత్ర భిన్నంగా ఉంటుంది. ఈ చిత్రానికి సుందర్‌గారు దర్శకత్వం వహించారు. హీరో కూడా తెలుగు ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు కావడంతో ఈ షూటింగ్ చాలా సంతోషంగా చేస్తున్నాను.
 
 8. సంగీతం, డ్యాన్స్, స్విమ్మింగ్... ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు?
 నాకు సంగీతమంటే ప్రాణం. ఎప్పుడైనా మనసు బాగుండకపోతే సంగీతమే న న్ను ఉత్తేజపరుస్తుంది. వీలు చిక్కినప్పుడల్లా సంగీతం వింటూనే ఉంటాను. డాన్స్ అనేది ప్రతి నటికి తప్పనిసరి. నేను ప్రభుదేవా దగ్గర భరతనాట్యం నేర్చుకున్నాను. ప్రస్తుతం సినిమాలకు సంబంధించిన డ్యాన్సులు నేర్చుకుంటున్నాను. ఆరో తరగతి చదివేటప్పుడే స్విమ్మింగ్ నేర్చుకోవడం ప్రారంభించాను.
 
 9. అరుంధతి చిత్రానికి నంది అవార్డు అందుకున్నప్పుడు ఏమనిపించింది? ఇంకా వచ్చిన ఇతర అవార్డుల గురించి...
 ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం నిజంగా నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. ఈ పాత్రకు నాకు నంది అవార్డు వచ్చింది. ఈ చిత్రం చేసేటప్పుడు ఎన్నో సరదా సంఘటనలు జరిగాయి. మేకప్ చేయడానికి చాలా టైమ్ పట్టేది. నేను వేసుకున్న నగలు, డ్రెసెస్ అంత సులువుగా మార్చుకోవడం కుదిరేవి కావు. ఉదయం ప్రారంభమైన షూటింగ్ అర్ధరాత్రి రెండు గంటలకు పూర్తయ్యేది. అప్పటివరకు ఆ బట్టలు, నగలు మోయలేకపోయేదాన్ని. అరుంధతి చిత్రం నా జీవితంలో మర్చిపోలేను. ప్రేక్షకులు కూడా నన్ను మర్చిపోరు. ఈ చిత్రం వచ్చి ఎనిమిది సంవత్సరాలైనా, ఇప్పటికీ నన్ను చిన్న అరుంధతిగానే గుర్తుపెట్టుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకు కారణం నా కళ్లు. ఇలాంటి పాత్ర రావాలని ప్రతి ఒక్క నటీ కల కంటుంది. నాకు ఆ కల నిజమైంది.
 
 10. ఏ భాషలో చేయాలని ఉంది.
 ఒక భాషలో చేయాలని నేను గోడ కట్టుకోవట్లేదు. మంచి కథ ఉండి, నటించడానికి అనువుగా ఉన్న కథ ఏ భాషలో వచ్చినా నటిస్తాను. ఇప్పటికే తెలుగు తమిళ భాషల్లో నటించాను కాబట్టి, హిందీ, మళయాళ చిత్రాల్లో నటించాలనుంది.
 
 11. హీరోయిన్‌గా మీరు నటించిన మొట్టమొదటి చిత్రం ఏది? మీ మొదటి హీరో ఎవరు?
 నేను హీరోయిన్‌గా నటించిన మొదటి చిత్రం పసకర నాన్‌బర్గల్. సత్తైఫేమ్ యువన్‌తో నటించాను. ఈ చిత్రం బాక్సింగ్ కథ నేపథ్యంతో ఉంటుంది. ఆ చిత్రం చేసే సమయానికి నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను. కథ కూడా ఇంచుమించు ఆ వయసు అమ్మాయి చుట్టూనే నడుస్తుంది. తెలుగులో నేను హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘నేను నాన్న అబద్ధం’. ఇందులో నందుతో కలిసి నటించాను.
 
 12. నచ్చిన హీరో హీరోయిన్లు...
 సినీరంగంలో ఉన్నవారికి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం. నాకు చాలామంది అంటే చాలా చాలా ఇష్టం. ప్రసుత్తం నటిస్తున్న వారిలో కాజల్ అగర్వాల్, దీపికా పదుకోనే... ముందు తరం వారిలో శ్రీదేవి, జ్యోతిక నా అభిమాన తారలు.
 
 13. డ్రీమ్‌రోల్...
 డ్రీమ్ రోల్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూంటుంది. నాకు మాత్రం అరుంధతి లాంటి చిత్రంలో నటించాలని కోరికగా ఉంది.  బ్లాక్ చిత్రంలో రాణీ ముఖర్జీ చేసిన పాత్ర, జెనీలియా చేసే బబ్లీ పాత్రల వంటివి చేయడం ఇష్టం.  
 
 14. ఎంతవరకు చదువుకోవాలనుకుంటున్నారు?
 ఎంబీఏ చేయాలనుంది. చదువును మాత్రం నిర్లక్ష్యం చేయను. ఎప్పటికైనా చదువు ఉపయోగపడుతుంది.
 
 15. మీ కుటుంబం గురించి...
 నేను అన్నయ్య, అమ్మ, నాన్న. మా నానమ్మ ఇటీవలే చనిపోయారు. ఆవిడతో నేను స్నేహంగా ఉండేదాన్ని. ఆవిడ నన్ను ఎంతో ప్రోత్సహించారు. మా నాన్నగారు ‘ఇండియా ట్రస్ట్ యాన్ స్పెల్‌బీ’ ఇంటర్నేషనల్ సంస్థకి సీఈవోగా పనిచేస్తున్నారు. అమ్మ ఇంటి దగ్గరే ఉంటుంది. అన్నయ్య అక్షయ్ కూడా చిన్నప్పడు నటించాడు. కాని ‘లా’ చదువుతుండడం వల్ల నటన మానేశాడు. ఇంతమంచి కుటుంబంలో పుట్టినందుకు సంతోషంగా ఉంది. మా వాళ్లు, టీచర్లు నన్ను ప్రోత్సహించడం  నా అదృష్టం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement