ఆత్రేయ అంటే బాగా ఇష్టం!
సినిమా
మామూలుగా మార్కెట్లోకి ఓ ప్రచార చిత్రం వచ్చిందంటూ, దాని చుట్టూ ఓ కథ అల్లేసుకుని, ‘ఈ సినిమా కథ ఇలా ఉంటుంది’ అని ఫిక్స్ అవుతారు. ఇప్పుడు ‘24’ చిత్రం గురించి అలా అల్లిన కథలు బోల్డన్ని ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ చూసి, ‘‘అతనికీ, కాలానికి ఏదో అవినాభావ సంబంధం ఉంది. అందుకే అతని ఆలోచనలన్నీ టైమ్ చుట్టూ తిరుగుతాయి. వాచ్ మెకానిక్‌గా పనిచేసే ఆ యువకుణ్ని కొన్ని జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటాయి. ఆ తర్వాతి కథ ఏమై ఉంటుందా?’’ అని కొంతమంది చర్చించుకుంటున్నారు. ఈ సినిమా తాలూకు పోస్టర్లలో మూడు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించి, సినిమా మీద అంచనాలు పెంచేశారు సూర్య. ఇంతకీ ఈ సినిమా కథేంటని హీరో సూర్యను అడిగితే రిలీజ్ డేట్ వరకూ ఆగాల్సిందే అంటున్నారు. గ్లోబల్ సినిమాస్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్త నిర్మాణంలో, జ్ఞానవేల్ రాజా సమర్పణలో రూపొందిన చిత్రం ‘24’. విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో సూర్య, సమంత, నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సైన్స్‌ఫిక్షన్ మూవీ వచ్చే నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ -‘‘ఈ చిత్ర కథ బాగా నచ్చడంతో నేనే నిర్మాతగా మారా.
ఏఆర్ రెహమాన్‌గారు సంగీతం అందించడానికి ఒప్పుకున్న తర్వాత షూటింగ్ మొదలు పెట్టాం. కథపరంగా బాగా బలమున్న చిత్రమిది. ఈ చిత్రంలో నేను చేసిన మూడు పాత్రల్లో ఆత్రేయ పాత్ర అంటే ఇష్టం. ‘శంకరాభరణం’, ‘అన్నమయ్య’, ‘బాహుబలి’ వంటి చిత్రాలు రావడానికి కారణం తెలుగు ప్రేక్షకులే. ఇటీవల వచ్చిన ‘మనం’, ‘ఊపిరి’ చిత్రాలు కూడా బాగా ఆడాయి. తెలుగువారు విభిన్న చిత్రాలను ఆదరిస్తుంటారు. ‘24’ చిత్రం కూడా తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకోవడంతో పాటు కొత్త ప్రెజెంటేషన్‌తో తెరకెక్కించిన చిత్రమిది. సినిమాలోని ప్రతి ఫేం ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటుంది. సూర్యగారి కెరీర్‌లో టాప్ ఫైవ్ చిత్రాల్లో ఇదొకటిగా నిలుస్తుంది. తన సంగీతంతో రెహమాన్‌గారు ఈ చిత్రాన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లారు’’ అని దర్శకుడు పేర్కొన్నారు. కె.ఇ జ్ఞానవేల్ రాజా, పాటల రచయిత శశాంక్ వెన్నెలకంటి తదితరులు మాట్లాడారు.