
నచ్చింది.. కొనుగోలు చేశాను
సంగీత దర్శకులు చిత్ర నిర్మాణంపై ఆసక్తి చూపడం అన్నది కొత్తేమీ కాదు. దివంగత ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎంఎస్.విశ్వనాథన్, ఇళయరాజాల నుంచి విజయ్‌ఆంటోని వరకు పలువురు చిత్ర నిర్మాణ అనుభవాన్ని చవిచూపిన వారే. తాజాగా యువ సంగీత దర్శకుడు సుందర్.సీ.బాబు ఆ పట్టికలోకి చేరడం విశేషం.చిత్రరం పేసుదడి, అంజాదే, నాడోడిగళ్ వంటి విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించి తనకంటూ ఒక గుర్తిం పును పొందిన సుందర్.సీ.బాబు తాజాగా బాణీలు కట్టిన చిత్రం అట్టీ. బుల్లి తెరపై వ్యాఖ్యాతగా ప్రాచుర్యం పొందిన పాకామా.
ఆనంద్ కథానాయకుడిగా నటించిన చిత్రం అట్టీ. నవ నటి అస్మిత కథానాయకిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఈ5 ఎంటర్‌టెయిన్‌మెంట్,ఇమేజనరీ మిషన్స్ సంస్థలపై జయక్రిష్టన్, కార్తికేయన్ సంయుక్తంగా నిర్మించారు.దీనికి కథ,కథనం,దర్శకత్వం బాధ్యతల్ని విజయభాస్కర్ నిర్వహించారు.
ఈయన దర్శకుడు సూరజ్ వద్ద మాప్పిళ్లై, అలెక్స్‌పాండియన్ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశారన్నది గమనార్హం. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్ ఘనంగా నిర్వహించారు.గ్రామీణ వాయిద్యాల హోరుల మధ్య ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సందడి వాతావరణంలో జరిగింది. సినీ పాత్రికేయులు అట్టీ చిత్ర ఆడియోను ఆవిష్కరించగా చిత్ర యూనిట్ తొలి ప్రతిని అందుకున్నారు.
చిత్ర దర్శకుడు విజయభాస్కర్ మాట్లాడుతూ అట్టీ చెన్నైలోని రాయపురం, ఐస్‌హౌస్, కాశీమేడు ప్రాంతాల యువత జీవన విధానాన్ని ఆవిష్కరించే చిత్రం అన్నారు. చిత్ర సంగీత దర్శకుడు సుందర్.సీ.బాబు మాట్లాడుతూ సహజత్వానికి దగ్గరగా తెరకెక్కిన చిత్రం అట్టీ అన్నారు. చిత్రంలోని పాటలకు ఇప్పటికే పరిశ్రమ వర్గాల్లో మంచి స్పందన వచ్చిందని, చిత్రం తనను బాగా ఆకట్టుకోవడంతో విడుదల హక్కుల్ని తానే పొందినట్లు వెల్లడించారు.