విష్ణు బ్రేవ్ యాటిట్యూడ్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుంది! | Attitude Brave Vishnu will give the audience a good kick! | Sakshi
Sakshi News home page

విష్ణు బ్రేవ్ యాటిట్యూడ్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుంది!

Published Mon, Aug 31 2015 11:53 PM | Last Updated on Wed, Apr 3 2019 9:01 PM

విష్ణు బ్రేవ్ యాటిట్యూడ్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుంది! - Sakshi

విష్ణు బ్రేవ్ యాటిట్యూడ్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుంది!

- దేవా కట్టా
యూఎస్‌లో పదిహేనేళ్లు ఇంజినీరింగ్ లైఫ్.. యూఎస్ సిటిజన్‌షిప్. నో టెన్షన్. హ్యాపీ లైఫ్. కానీ, సినిమాల మీద ఉన్న ప్యాషన్‌తో దేవా కట్టా హైదరాబాద్ వచ్చేశారు. సక్సెస్, ఫ్లాప్... ఏదైనా సరే ఇక్కడే ఉంటానంటున్నారు. మంచు విష్ణు హీరోగా ఆయన దర్శకత్వం వహించిన ‘డైనమైట్’ ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా దేవా కట్టాతో జరిపిన ఇంటర్వ్యూ...
 
‘డైనమైట్’ ఏ తరహా చిత్రం?
హాలీవుడ్ చిత్రాలు ‘ఎనిమీ ఆఫ్ ది స్టేట్’, ‘మిషనల్ ఇంపాజిబుల్’ వంటి వాటిల్లో కథలో అసలు ప్లాట్ మొదలయ్యాక పరుగు మొదలువుతుంది. ‘డైనమైట్’ అలాంటి పరుగుతో సాగే ప్లాట్‌తో ఉంటుంది. హై టెంపోతో సాగే మంచి థ్రిల్లర్ మూవీ.
 
తమిళ చిత్రం ‘అరిమా నంబికి’ ఇది రీమేక్ కదా. మరి, రీమేక్ సినిమా చేయడం ఎలా అనిపించింది?
యాక్చువల్‌గా వేరే రైటర్ రాసిన కథతో సినిమా తీసినప్పుడు ఎలా ఉంటుందో... రీమేక్ చేసినప్పుడు కూడా అలానే అనిపిస్తుంది. తమిళ చిత్రంలోని కథావస్తువును మాత్రమే తీసుకుని చాలా మార్పులు చేసి, ఈ సినిమా చేశాం. వాస్తవానికి నేను రీమేక్ సినిమా చేద్దామనుకోలేదు. కానీ, విష్ణు ‘అరిమా నంబి’ చూడమంటే, కొంచెం అనిష్టంగానే చూశాను. నేనెలాంటి ఫార్మట్‌తో అయితే సినిమా చేద్దామనుకుని కథ రెడీ చేస్తున్నానో, అచ్చంగా అదే ఫార్మట్‌లానే ఆ సినిమా ఉంది. రైటర్ ఒక కథ ఇచ్చినప్పుడు, దాన్ని మనకు కావల్సినట్టుగా ఎలా మార్చుకుంటామో అలా మార్చి, తీశాం.
 
ఈ కథలో మీకు బాగా నచ్చిన అంశం?
హీరో క్యారెక్టర్ నాకు పర్సనల్‌గా బాగా కనెక్ట్ అయ్యింది. అందుకే ఈ సినిమా చేయాలనుకున్నాను. సినిమాలోని పాయింట్ చాలా కొత్తగా ఉంది. మన కరెంట్ లైఫ్‌స్టయిల్‌ని ప్రతిబింబించే విధంగా ఈ చిత్రం ఉంటుంది.
 
విష్ణు క్యారెక్టర్ గురించి...?
కాలేజీ పూర్తి చేశాక, ఓ రెండు, మూడేళ్లు జాబ్ చేసుకుంటూ ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపే కుర్రాడి జీవితంలోకి ఒక అమ్మాయి వస్తుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి సమస్యను తన సమస్యగా భావించి, ముందుకు వెళ్లే పాత్ర ఇది. విష్ణు ‘బ్రేవ్ యాటిట్యూడ్’ ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుంది. ఈ క్యారెక్టర్ ఇన్‌స్పయిరింగ్‌గా ఉంటుంది.
 
ఈ సినిమా కోసం విష్ణు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. టాటూలు వేయించుకున్నారు. ఆయన కెరీర్‌కి ఈ సినిమా ఏ మేరకు ఉపయోగపడుతుంది?
ఇది మంచి యాక్షన్ మూవీ. అందుకే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. క్యారెక్టరైజేషన్ చాలా స్టయిలిష్‌గా ఉంటుంది కాబట్టి, టాటూ వేయించాం. గడ్డం మెయిన్‌టైన్ చేయించాం. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో విష్ణు చేసిన పాత్రలతో పోలిస్తే ఎక్కువ నటనకు అవకాశం ఉన్న పాత్రను ఇందులో చేశారు. ఫిజికల్‌గా తనను చాలా శ్రమపెట్టిన సినిమా ఇది. సో... కచ్చితంగా విష్ణుకి ఎప్రీసియేషన్ లభిస్తుంది. యాక్చువల్‌గా ‘ఆటోనగర్ సూర్య’ 1990లకు సంబంధించిన సినిమా. దాన్ని ప్రాపర్‌గా తీయకపోవడంతో పాత లుక్‌లో వచ్చింది. ‘ప్రస్థానం’ సినిమా అంత స్టయిలిష్‌గా ఆ సినిమా ఉండదు. కంటెంట్ బాగునప్పటికీ, ఓ పాత సినిమా చేశాం అనే ఫీలింగ్‌లో ఉన్నాను. అందుకే, ‘డైనమైట్’ స్టయిలిష్‌గా ఉండాలనుకున్నాను.
 
తమిళంలో విక్రమ్‌ప్రభు, తెలుగులో విష్ణు- ఇద్దరిలో ఎవరు బాగా చేశారు?
తమిళ కథకు తగ్గట్టు విక్రమ్ ప్రభు నటించారు. ఆ కథలో మార్పులు చూసి, టెంపో పెంచాం. ఈ కథకు విష్ణు పూర్తి న్యాయం చేశాడు. ఆ సినిమాకు అతను కరెక్ట్. ఈ సినిమాకి విష్ణు కరెక్ట్.
 
జేడీ చక్రవర్తి గురించి చెబుతారా?
తమిళ వెర్షన్‌లో విలన్‌గా జేడీయే చేశాడు. తెలుగులో కూడా తనే చేస్తే బాగుంటుందనుకున్నాను. విష్ణు కూడా జేడీనే సజెస్ట్ చేశాడు. సెకండాఫ్‌లో హీరో, విలన్ మధ్య సాగే మైండ్ గేమ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
 
ఇది పూర్తి స్థాయి యాక్షన్ మూవీయా?
యాక్షన్ ఉంటుంది. ఈ చిత్రం నిడివి రెండు గంటల ఎనిమిది నిమిషాలు ఉంటుంది. అందులో యాక్షన్ నిడివి పదిహేను నుంచి పద్ధెనిమిది నిమిషాలు ఉంటుంది. ఎందుకంటే, రెండు గంటలూ యాక్షన్ చూపిస్తే, బోర్ కొట్టేస్తుంది. ఈ చిత్రంలో క్యూట్ లవ్‌స్టోరీ కూడా ఉంటుంది. జీవితంలో మనకు కనిపించే అన్ని కోణాలూ ఈ చిత్రంలో కనిపిస్తాయి.
 
‘ఆటోనగర్ సూర్య’ ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా ‘వెన్నెల’, ‘ప్రస్థానం’ మంచి సినిమాలే. కానీ, అనుకున్న స్థాయికి చేరుకోకపోవడంపై ఏమైనా బాధ ఉందా?
నాకసలు ఎలాంటి పశ్చాత్తాపాలూ లేవు. ఎందుకంటే, ఏ సినిమా అయినా నేను మనసు పెట్టే చేశాను. ‘ఆటోనగర్ సూర్య’ తర్వాత యూఎస్ వెళ్లి, కథలు రాసుకోవడం మొదలుపెట్టాను. ఇప్పటికి మూడు, నాలుగు కథలు రెడీ అయ్యాయి. నేను సినిమాలను వదులుకునే ప్రసక్తే లేదు.
 
అది అసత్య ప్రచారం
ఆర్.ఆర్. మూవీ మేకర్స్ వారు ‘ఆటోనగర్ సూర్య’కు 25 కోట్లు బడ్జెట్ అయ్యిందని అసత్య ప్రచారం చేశారు. తొమ్మిదిన్నర కోట్లలోనే ఆ సినిమా పూర్తి చేశాను. ఒక దర్శకుడికి హిట్ ఎంత ముఖ్యమో, బడ్జెట్‌పరంగా ఎఫిషియంట్ అనిపించుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆ సినిమా విడుదల సమయంలో నా కళ్ల ముందే ఎక్కువ బడ్జెట్ చెప్పినా, బిజినెస్ స్ట్రాటజీలో భాగమని ఊరుకున్నాను. కానీ, దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని ఎక్కువ ప్రచారం చేయడం మొదలుపెట్టారు.

ఇలా లేనిపోనివి ప్రచారం చేయడం వల్ల డెరైక్టర్ ఎఫర్ట్‌ని లూఠీ చేసినట్లు అవుతుంది. ‘వెన్నెల’ను 60 రోజులు, ‘ప్రస్థానం’ను 68 రోజుల్లో, ఇప్పుడు ‘డైనమైట్’ని 56 రోజుల్లో తీశాను. నా ఏ సినిమాకీ ఎక్కువ రోజులు తీసుకున్నది లేదు. ఆ విధంగా దర్శకుడిగా నా ఎఫిషియన్సీని నిరూపించుకున్నాను. నావైపు ఉన్న నిజాన్ని బయటపెట్టాలనుకుని ఇప్పుడీ అసత్య ప్రచారం గురించి స్పందించాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement