చిన్న చిత్రాలు నిలబడాలంటే..
చిన్న బడ్జెట్ చిత్రాలు బతికి బట్ట కట్టాలంటే ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలన్నారు తమిళ దర్శకుల సంఘం కార్యదర్శి ఆర్‌కే.సెల్వమణి. నాన్‌కడవుల్ రాజేంద్రన్, లొల్లుసభ స్వామినాథన్,అర్చనాసింగ్, కృష్ణమూర్తి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం యానై మేల్ కుదిరై సవారి. బెట్లర్స్ సినిమా పతాకంపై కథ,మాటలు, పాటలు దర్శకత్వం, నిర్మాణం బాధ్యతలను కరుప్పయ్య మురుగన్ నిర్వహించారు.
హిమాలయన్ సంగీత బాణీలు సమకూర్చిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. సీనియర్ దర్శకుడు, నటుడు కే.భాగ్యరాజ్ ఆడియోను ఆవిష్కరించగా తొలి సీడీని దర్శకుడు పేరరసు అందుకున్నారు. ఆర్‌కే.సెల్వమణి మాట్లాడుతూ మహానగరాల్లో థియేటర్లు ఐదు నక్షత్రాల స్థాయికి మారిపోతున్నాయన్నారు. చాలా వరకు మల్టీఫ్లెక్స్ థియేటర్లుగా రూపాంతరం చెందుతున్నాయన్నారు. ఆ థియేటర్లలో సినిమా చూడాలంటే టికెట్ ధర, ఇతర తినుబండారాలకంటూ ఒక మనిషికి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. సాధారణ ప్రేక్షకులు అంత ఖర్చు పెట్టి సినిమాలు చూడలేరని అన్నారు.
అంతే కాకుండా మల్టీఫ్లెక్స్ థియేటర్లలో భారీ బడ్జెట్ చిత్రాలను చూడడానికే ప్రేక్షకులు ఆసక్తి చూపుతారని పేర్కొన్నారు.అందువల్ల థియేటర్ల యాజమాన్యం అలాంటి చిత్రాలనే ప్రదర్శిస్తారని అన్నారు. అందువల్ల చిన్న బడ్జెట్ చిత్రాలు మల్టీఫ్లెక్స్ థియేటర్లలో ప్రదర్శనకు నోచుకునే అవకాశం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి చిన్న చిన్న నగరాలు, గ్రామాల్లో రూ.50 ధరగా 100 మంది కూర్చుని చూసేలా థియేటర్లను ప్రభుత్వం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.అప్పుడే పైరసీ బాధ తప్పుతుందని, చిన్న నిర్మాతలు బతికి బట్టకట్టగలుగుతారని ఆర్‌కే.సెల్వమణి అన్నారు.