‘ఆటోనగర్ సూర్య’కు లైన్ క్లియర్
* పిటిషన్ ఉపసంహరించుకున్న నిర్మాత అచ్చిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: నాగ చైతన్య హీరోగా నటించిన ఆటోనగర్ సూర్య సినిమా విడుదల విషయంలో గుంటూరు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆ చిత్ర నిర్మాత, మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ అధినేత అచ్చిరెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. గుంటూరు కోర్టు ఇచ్చిన ఆదేశాలు కేవలం ఆర్.ఆర్.మూవీ మేకర్‌కు మాత్రమేనని తెలిపారు.
సదరు ఉత్తర్వుల వల్ల సినిమా విడుదలకు గానీ, తమకు గానీ ఎటువంటి నష్టం లేదని తెలిపారు. అందువల్ల ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ అవసరం లేదని అచ్చిరెడ్డి కోర్టుకు నివేదించారు. దీంతో అచ్చిరెడ్డి చెప్పిన విషయాలను రికార్డ్ చేసుకున్న హైకోర్టు, పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సూరి అప్పారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆటోనగర్ సూర్య సినిమా నేడు విడుదల కానుంది.