రెండు కోట్లు ఇస్తే బాగానే ఉంటుంది కానీ...
ఈ తరం కథానాయికల్లో అగ్రస్థానం సమంతదే.అందాలతారగా కెరీర్ ఆరంభించి, అభినయ తారగా ఒదిగి, ప్రేక్షకుల అభిమాన తారగా ఎదిగిన సమంత... అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ బిజీగా ఉన్నారు. ఇటీవలే ‘ఆటోనగర్ సూర్య’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సమంత పత్రికలవారితో ముచ్చటించారు.
‘ఆటోనగర్ సూర్య’ అనుభవం ఎలా ఉంది?
‘బృందావనం’ తర్వాత ఒప్పుకున్న సినిమా ఇది. నిర్మాణానికి, విడుదలకు మూడేళ్లు పట్టింది. ఫలితం ఎలా ఉన్నా ముందు విడుదలైంది... అదీ ఆనందం. ఈ సినిమా విషయంలో నిర్మాతలు అనుభవించిన కష్టాన్ని కళ్లారా చూశాను. చాలా బాధ అనిపించింది. చైతూ కూడా చాలా కష్టపడి ఇందులోని సూర్య పాత్ర చేశారు. నా పాత్ర అయితే... పక్కింటి అమ్మాయిలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాగుందని అభినందిస్తున్నారు.
ఇందులో మీకు నచ్చిన డైలాగ్?
ఇప్పటివరకూ నేను చెప్పిన ఏ డైలాగూ నాకు గుర్తుండదు. కానీ... ఇందులో ఓ డైలాగ్ మాత్రం లైఫ్‌లో మరిచిపోలేను. ‘పెళ్లి ఎవర్ని చేసుకున్నా... పిల్లల పోలికలు మాత్రం అతనివే వస్తాయ్’ అంటాను ఓ సందర్భంలో. నాకు తెగ నచ్చేసిన డైలాగ్ ఇది(నవ్వుతూ).
‘ఏమాయ చేశావె’ నాటికీ నేటికీ నాగచైతన్యలో ఏమైనా తేడా గమనించారా?
చాలా. ముఖ్యంగా అతని డైలాగ్ డిక్షన్‌లో చాలా తేడా వచ్చింది. సినిమా సినిమాకు ఇంప్రూవ్ అవుతున్నాడు. తెలుగులో నా కెరీర్‌లో చైతూతోనే మొదలైంది. ఇది తనతో నేను చేసిన మూడో సినిమా. ముఖ్యంగా స్క్రీన్‌పై మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది.
ఈ మధ్య అభినయానికి పెద్ద పీట వేస్తున్నట్లున్నారు?
అవును... ఎప్పుడూ గ్లామర్ పాత్రలే అయితే ఎలా. ఎక్కువకాలం ప్రేక్షకుల హృదయాల్లో నిలవాలంటే.. నటనకు ఆస్కారమున్న పాత్రలు చేయాలి. నా కెరీర్‌లో నటన పరంగా బెస్ట్ కేరక్టర్ అంటే ‘మనం’లోని పాత్రనే చెప్పుకోవాలి. ఆ పాత్ర మంచి గుర్తింపునిచ్చింది.
టాప్‌స్టార్‌గా వెలుగొందుతున్న మీరు.. ‘అల్లుడు శీను’లో ఓ కొత్త హీరోతో నటించారు. దానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? ఆ సినిమాకు రెండు కోట్ల రూపాయలు తీసుకున్నారట కదా?
రెండు కోట్లు ఇస్తే బాగానే ఉంటుందండీ(నవ్వుతూ). కానీ ఇవ్వలేదు. మిగిలిన సినిమాలకు ఎంత ఇచ్చారో ‘అల్లుడు శీను’కీ అంతే ఇచ్చారు. నేను హీరోలను బట్టి సినిమాలను అంగీకరించను. దర్శకుడు, కథ, పాత్ర... ఈ మూడింటిని బట్టే సినిమాను ‘ఓకే’ చేస్తాను. ‘అల్లుడు శీను’ని వి.వి.వినాయక్ అద్భుతంగా మలిచారు. అందరితో కూల్‌గా వర్క్ చేయించుకున్నారు. తొలి సినిమాలా పనిచేశారు. కచ్చితంగా ఆ సినిమా పెద్ద హిట్.
మరి ‘రభస’ ఎలా ఉండబోతోంది?
ఆ సినిమా ఫుల్‌మీల్స్. తారక్‌తో నేను చేస్తున్న మూడో సినిమా ఇది. అభిమానులు పండగ చేసుకునేలా ఈ సినిమా ఉంటుంది.
ప్రస్తుతం ఏ ఏ సినిమాలు చేస్తున్నారు?
ఈ ఏడాది ఏడు సినిమాల్లో నటిస్తున్నాను. తమిళంలో విజయ్, విక్రమ్, సూర్య చిత్రాల్లో నటిస్తున్నా. తెలుగు, తమిళ భాషల్లో ఇంత మంది స్టార్‌హీరోలతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాల వల్ల ఈ ఏడాది చాలా ఈవెంట్‌లకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అందుకే ఫ్యాషన్‌పై దృష్టి పెట్టాను.
‘క్వీన్’ రీమేక్‌లో నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నిజమేనా?
లేదు. నేను చేయట్లేదు. ‘క్వీన్’ బాలీవుడ్‌లో ప్రూవ్ చేసుకున్న సినిమా. గొప్ప సినిమా. దాన్ని దక్షిణాదిన రీమేక్ చేయాలంటే.. ఇక్కడకు తగ్గట్టు కొన్ని మార్పులు అవసరం. సదరు దర్శక, నిర్మాతలు చేసిన మార్పులు నాకు నచ్చలేదు. అందుకే వద్దనుకున్నా.
మహేశ్‌బాబు ‘1’ సినిమా పోస్టర్ విషయంలో సీరియస్‌గా ట్విట్టర్లో స్పందించారు. మరి ఇప్పుడు మీ ‘ఆంజాన్’ చిత్రం స్టిల్ కూడా దుమారం లేపుతోంది. దానికి మీ సమాధానం?
నో కామెంట్.