Autonagar Surya
-
అమ్మో.. మాస్ సినిమానా ?!
-
దేవకట్టాపై రాజమౌళి ప్రశంసలు
యూనియన్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఓ వ్యక్తిని అద్భుతంగా చిత్రీకరించిన దేవకట్టా ధైర్యానికి అభినందనలు అంటూ హిట్ చిత్రాల దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రశంసలు కురిపించారు. ఆటోనగర్ సూర్య చిత్రంలో ఆయన డైలాగుల్లో పంచ్ అదిరిపోయిందని, ముఖ్యంగా సమంతతో 'పిల్లలు మాత్రం వాడి పోలికతోనే పుడతారు' అని చెప్పించిన డైలాగు తనకు ఎంతగానో నచ్చిందన్నారు. ఆ తరహా ట్రిమ్మింగ్ చాలా అవసరమని, గతంలో కొంతమంది దర్శకులు కూడా అలాగే చేసేవారని గుర్తు చేశారు. అయితే.. అల్లుడుశ్రీను చిత్రం ఆడియో విడుదల సందర్భంగా తాను ఠాగూర్ సినిమాకు బదులు స్టాలిన్ అని చెప్పానంటూ అందుకు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు కూడా చెప్పారు. దటీజ్ రాజమౌళి!! Appreciate @devakatta for his guts for glorifying an Individual who fights against the union. His dialogues pack a punch.Samantha's "pillalu — rajamouli ss (@ssrajamouli) June 29, 2014 Mathram vaadi polikatho pudathaaru" is my personal favourite. The trimming was essential and good the makers did it early on.. — rajamouli ss (@ssrajamouli) June 29, 2014 -
రెండు కోట్లు ఇస్తే బాగానే ఉంటుంది కానీ...
ఈ తరం కథానాయికల్లో అగ్రస్థానం సమంతదే.అందాలతారగా కెరీర్ ఆరంభించి, అభినయ తారగా ఒదిగి, ప్రేక్షకుల అభిమాన తారగా ఎదిగిన సమంత... అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ బిజీగా ఉన్నారు. ఇటీవలే ‘ఆటోనగర్ సూర్య’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సమంత పత్రికలవారితో ముచ్చటించారు. ‘ఆటోనగర్ సూర్య’ అనుభవం ఎలా ఉంది? ‘బృందావనం’ తర్వాత ఒప్పుకున్న సినిమా ఇది. నిర్మాణానికి, విడుదలకు మూడేళ్లు పట్టింది. ఫలితం ఎలా ఉన్నా ముందు విడుదలైంది... అదీ ఆనందం. ఈ సినిమా విషయంలో నిర్మాతలు అనుభవించిన కష్టాన్ని కళ్లారా చూశాను. చాలా బాధ అనిపించింది. చైతూ కూడా చాలా కష్టపడి ఇందులోని సూర్య పాత్ర చేశారు. నా పాత్ర అయితే... పక్కింటి అమ్మాయిలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాగుందని అభినందిస్తున్నారు. ఇందులో మీకు నచ్చిన డైలాగ్? ఇప్పటివరకూ నేను చెప్పిన ఏ డైలాగూ నాకు గుర్తుండదు. కానీ... ఇందులో ఓ డైలాగ్ మాత్రం లైఫ్‌లో మరిచిపోలేను. ‘పెళ్లి ఎవర్ని చేసుకున్నా... పిల్లల పోలికలు మాత్రం అతనివే వస్తాయ్’ అంటాను ఓ సందర్భంలో. నాకు తెగ నచ్చేసిన డైలాగ్ ఇది(నవ్వుతూ). ‘ఏమాయ చేశావె’ నాటికీ నేటికీ నాగచైతన్యలో ఏమైనా తేడా గమనించారా? చాలా. ముఖ్యంగా అతని డైలాగ్ డిక్షన్లో చాలా తేడా వచ్చింది. సినిమా సినిమాకు ఇంప్రూవ్ అవుతున్నాడు. తెలుగులో నా కెరీర్లో చైతూతోనే మొదలైంది. ఇది తనతో నేను చేసిన మూడో సినిమా. ముఖ్యంగా స్క్రీన్‌పై మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. ఈ మధ్య అభినయానికి పెద్ద పీట వేస్తున్నట్లున్నారు? అవును... ఎప్పుడూ గ్లామర్ పాత్రలే అయితే ఎలా. ఎక్కువకాలం ప్రేక్షకుల హృదయాల్లో నిలవాలంటే.. నటనకు ఆస్కారమున్న పాత్రలు చేయాలి. నా కెరీర్లో నటన పరంగా బెస్ట్ కేరక్టర్ అంటే ‘మనం’లోని పాత్రనే చెప్పుకోవాలి. ఆ పాత్ర మంచి గుర్తింపునిచ్చింది. టాప్‌స్టార్‌గా వెలుగొందుతున్న మీరు.. ‘అల్లుడు శీను’లో ఓ కొత్త హీరోతో నటించారు. దానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? ఆ సినిమాకు రెండు కోట్ల రూపాయలు తీసుకున్నారట కదా? రెండు కోట్లు ఇస్తే బాగానే ఉంటుందండీ(నవ్వుతూ). కానీ ఇవ్వలేదు. మిగిలిన సినిమాలకు ఎంత ఇచ్చారో ‘అల్లుడు శీను’కీ అంతే ఇచ్చారు. నేను హీరోలను బట్టి సినిమాలను అంగీకరించను. దర్శకుడు, కథ, పాత్ర... ఈ మూడింటిని బట్టే సినిమాను ‘ఓకే’ చేస్తాను. ‘అల్లుడు శీను’ని వి.వి.వినాయక్ అద్భుతంగా మలిచారు. అందరితో కూల్‌గా వర్క్ చేయించుకున్నారు. తొలి సినిమాలా పనిచేశారు. కచ్చితంగా ఆ సినిమా పెద్ద హిట్. మరి ‘రభస’ ఎలా ఉండబోతోంది? ఆ సినిమా ఫుల్‌మీల్స్. తారక్‌తో నేను చేస్తున్న మూడో సినిమా ఇది. అభిమానులు పండగ చేసుకునేలా ఈ సినిమా ఉంటుంది. ప్రస్తుతం ఏ ఏ సినిమాలు చేస్తున్నారు? ఈ ఏడాది ఏడు సినిమాల్లో నటిస్తున్నాను. తమిళంలో విజయ్, విక్రమ్, సూర్య చిత్రాల్లో నటిస్తున్నా. తెలుగు, తమిళ భాషల్లో ఇంత మంది స్టార్హీరోలతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాల వల్ల ఈ ఏడాది చాలా ఈవెంట్లకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అందుకే ఫ్యాషన్‌పై దృష్టి పెట్టాను. ‘క్వీన్’ రీమేక్‌లో నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నిజమేనా? లేదు. నేను చేయట్లేదు. ‘క్వీన్’ బాలీవుడ్లో ప్రూవ్ చేసుకున్న సినిమా. గొప్ప సినిమా. దాన్ని దక్షిణాదిన రీమేక్ చేయాలంటే.. ఇక్కడకు తగ్గట్టు కొన్ని మార్పులు అవసరం. సదరు దర్శక, నిర్మాతలు చేసిన మార్పులు నాకు నచ్చలేదు. అందుకే వద్దనుకున్నా. మహేశ్‌బాబు ‘1’ సినిమా పోస్టర్ విషయంలో సీరియస్‌గా ట్విట్టర్లో స్పందించారు. మరి ఇప్పుడు మీ ‘ఆంజాన్’ చిత్రం స్టిల్ కూడా దుమారం లేపుతోంది. దానికి మీ సమాధానం? నో కామెంట్. -
'ఆటోనగర్ సూర్య'ను పవన్ కాదన్నాడు!
-
ఆటోనగర్ సూర్యతో చిట్‌చాట్
-
సినిమా రివ్యూ: ఆటోనగర్ సూర్య
నటీనటులు: అక్కినేని నాగచైతన్య, సమంత, సాయికుమార్, జయప్రకాశ్ రెడ్డి, తనికెళ్ల భరణి, జీవా, బ్రహ్మానందం, వేణుమాధవ్, అజయ్, రఘుబాబు, ఆహుతి ప్రసాద్ సంగీతం: అనూప్ రూబెన్స్ కెమెరా: శ్రీకాంత్ నారోజ్ నిర్మాత: కె. అచ్చిరెడ్డి మాటలు, దర్శకత్వం: దేవా కట్టా పాజిటివ్ పాయింట్స్: నాగ చైతన్య ఫెర్ఫార్మెన్స్ మాటలు నెగిటివ్ పాయింట్స్: కథ, కథనం వయెలెన్స్ మ్యూజిక్ 'మనం' చిత్రం తర్వాత నాగచైతన్య, సమంతల క్రేజి కాంబినేషన్ లో వచ్చిన 'ఆటోనగర్ సూర్య' విడుదలకు అనేక అడ్డంకులు ఎదుర్కోంది. గత కొద్ది రోజులుగా వాయిదాల మీద వాయిదాలు పడిన ఈ చిత్రం జూన్ 27 తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెన్నెల, ప్రస్ధానం చిత్రాలతో ఆకట్టుకున్న దేవ కట్టా దర్శకత్వంలో తాజాగా 'ఆటోనగర్ సూర్య' చిత్రం తెలుగు ప్రేక్షకులను సంతృప్తి పరిచిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథేంటో తెలుసుకుందాం. చిన్నతనంలోనే ఓ రైలు ప్రయాణంలో తల్లి, తండ్రులను కోల్పోయిన సూర్య.. విజయవాడలో తన మేనమామ (సాయి కుమార్) వద్దకు చేరుకుంటారు. అయితే తన మేనమామ కూడా ఆదరించకపోవడంతో ఓ అనాధగా మారిన సూర్యను ఆటోనగర్ లో ఓ మెకానిక్ పెంచి పెద్ద చేస్తాడు. కథ ఇలా కొనసాగుతుండగా.. తన తల్లితండ్రుల మరణానికి కారణం మేయర్ అని తెలుసుకుంటాడు. ఆటోనగర్ లోని అన్యాయాలను, అక్రమాలను ఎదురించే క్రమంలో 16 ఏళ్లకే సూర్య జైలు కెళుతాడు. జైలు నుంచి విడుదలైన సూర్య జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? ఆటోనగర్ అన్యాయాలను, అక్రమాలను ఏవిధంగా ఎదుర్కొన్నాడు. ఆటో నగర్ లో ఎలాంటి మాఫియా కార్యక్రమాలు జరుగుతున్నాయి? తన మేనమామ ఆదరణకు సూర్య నోచుకోకపోవడానికి కారణమేంటి? తన తల్లి తండ్రుల మరణానికి మేయర్ ఎలా కారణమయ్యాడు అనే ప్రశ్నలకు సమాధానమే 'ఆటో నగర్ సూర్య'. నటీనటుల ఫెర్ఫార్మెన్స్: నాగచైతన్య యాంగ్రీ యంగ్ మ్యాన్ గా సూర్య పాత్రలో నాగచైతన్య కనిపించాడు. పలు సన్నివేశాల్లో పాత్ర పరిధి మేరకు ఎమోషన్స్ పలికించడంలో సఫలమయ్యాడు. మనం చిత్రంలో క్లాస్ ఫెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న నాగచైతన్య.. సూర్య పాత్ర ద్వారా మాస్ హీరోగా మెప్పించగల స్టార్ గా ప్రేక్షకుల్లో తనదైన ముద్రను వేసుకున్నాడు. కథ, కథనంలో ఉన్న లోపాలను మరుగున పరిచే విధంగా నాగచైతన్య తన వంతు న్యాయం చేశాడు. మాస్ ఆడియెన్స్ గుర్తుంచుకునే విధంగా నాగ చైతన్య కనిపించాడు. సమంత సూర్య మరదలిగా సిరి పాత్రలో సమంత కనిపించింది. కథలో పలు క్యారెక్టర్ల డామినేషన్ కారణంగా సిరి పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోయింది. అయితే తనకు లభించిన కొన్ని సన్నివేశాల్లో సమంత మెప్పించింది. తండ్రి (సాయి కుమార్)నుద్దేశించే 'నాన్నా నీ ముఖం చూస్తే అసహ్యం వేస్తుంది' అనే ఓ సీన్ తోపాటు మరికొన్ని సీన్లలో ఒకే అనిపించడంతోపాటు.. 'సురా..సురా' అనే పాటలో గ్లామర్ తో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సమంతకు తండ్రిగా, నాగచైతన్యకు మేనమామగా, యూనియన్ లీడర్ గా పలు షేడ్స్ ఉన్న కార్యెక్టర్ ను సాయి కుమార్ పోషించాడు. ఇలాంటి పాత్రలు సాయి కుమార్ కెరీర్ లో కొత్తేమి కాదు.. తనకు లభించిన పాత్రను అవలీలగా పోషించడంలో సాయి కుమార్ సఫలమయ్యాడు. విలన్ పాత్రల్లో 'చక్రవాకం' మధు, జయప్రకాశ్, అజయ్ లకు రొటిన్ పాత్రలే. బ్రహ్మనందం, వేణుమాధవ్, మాస్టర్ భరత్ ల కామెడీ అంతగా మెప్పించలేకపోయింది. సంగీతం: అనూప్ రూబెన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతంతగానే ఉంది. 'సురా సురా' పాట తప్ప గుర్తుండిపోతుంది. మిగితా పాటలు అంతాగా ఆకట్టుకునేలా లేవు. దర్శకత్వం: వెన్నెల, ప్రస్థానం చిత్రాలతో విమర్శకుల మెప్పు పొందిన దేవా కట్టా బెజవాడ ఆటోనగర్ నేపథ్యంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే కథలో పట్టు లేకపోవడం, కథనం కూడా సరైన పంథాలో సాగకపోవడం కొంత నిరాశ కలిగించే విషయం. కథ, కథనంలో లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. అయితే ఈచిత్రంలో మాటల్ని తూటాల్ల పేల్చడంలో దేవా కట్టా సఫలమయ్యారని చెప్పవచ్చు. యాక్షన్ సీన్లు మితీ మిరడం కారణంగా కథ అదుపు తప్పిందనే భావన కలుగుతుంది. సెకాండాఫ్ లో కథపై క్లారిటీ లేకపోవడం కారణంగా చాలా గందరగోళం నెలకొంది. భారీ అంచనాతో ఈచిత్రానికి వెళ్లే ప్రేక్షకుడికి హింసే ప్రధాన అంశంగా ఎదురుపడటంతో నిరాశే మిగిలుతుందని చెప్పవచ్చు. ట్యాగ్: విడుదల కాకపోతే ఓ మంచి జ్ఞాపకం! Follow @sakshinews -
‘ఆటోనగర్ సూర్య’కు లైన్ క్లియర్
* పిటిషన్ ఉపసంహరించుకున్న నిర్మాత అచ్చిరెడ్డి సాక్షి, హైదరాబాద్: నాగ చైతన్య హీరోగా నటించిన ఆటోనగర్ సూర్య సినిమా విడుదల విషయంలో గుంటూరు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆ చిత్ర నిర్మాత, మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ అధినేత అచ్చిరెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. గుంటూరు కోర్టు ఇచ్చిన ఆదేశాలు కేవలం ఆర్.ఆర్.మూవీ మేకర్‌కు మాత్రమేనని తెలిపారు. సదరు ఉత్తర్వుల వల్ల సినిమా విడుదలకు గానీ, తమకు గానీ ఎటువంటి నష్టం లేదని తెలిపారు. అందువల్ల ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ అవసరం లేదని అచ్చిరెడ్డి కోర్టుకు నివేదించారు. దీంతో అచ్చిరెడ్డి చెప్పిన విషయాలను రికార్డ్ చేసుకున్న హైకోర్టు, పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సూరి అప్పారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆటోనగర్ సూర్య సినిమా నేడు విడుదల కానుంది. -
ఆటోనగర్ సూర్య మూవీ స్టిల్స్, పోస్టర్స్
-
అన్ని కష్టాలూ అధిగమించి...
‘‘సినిమా కష్టాలంటారు కదా. ఈ సినిమాకి నిజంగానే సినిమా కష్టాలొచ్చాయి. అన్ని కష్టాలనూ అధిగమించి విడుదల కాబోతోంది’’ అని ‘దిల్’ రాజు చెప్పారు. నాగచైతన్య, సమంత జంటగా ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై దేవా కట్టా దర్శకత్వంలో కె. అచ్చిరెడ్డి నిర్మించిన చిత్రం ‘ఆటోనగర్ సూర్య’. ఈ 27న విడుదల కానున్న ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో ‘దిల్’ రాజు విడుదల చేయనున్నారు. దేవా కట్టా మాట్లాడుతూ - ‘‘చైతూలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే చిత్రం ఇది. పరిపూర్ణమైన నటుడు అని ప్రేక్షకులు కచ్చితంగా ప్రశంసిస్తారు. అలాగే, దర్శకునిగా నా కెరీర్‌కి కూడా ఉపయోగపడే చిత్రమిది. మేమంతా కలిసి ఓ మంచి సినిమా చేయడానికి శాయశక్తులా కృషి చేశాం. వాణిజ్యపరంగా ఏ స్థాయి సినిమా అవుతుందనేది మొదటి ఆటకే తెలిసిపోతుంది’’ అన్నారు. అచ్చిరెడ్డి మాట్లాడుతూ - ‘‘ఓ సరికొత్త కథాంశంతో తీసిన సినిమా ఇది. ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఎంతగా ప్రయత్నించినా మావల్ల కాలేదు. చివరికి అలంకార్ ప్రసాద్, ఉషా పిక్చర్స్ బాలకృష్ణారావులాంటివారిని సంప్రదించాం. మంచి సినిమా అవుతుందనే నమ్మకంతో విడుదల చేయడానికి ముందుకొచ్చారు. ‘మనం’తో ప్రతి ఇంటికీ దగ్గరయ్యాడు చైతన్య. ఈ చిత్రంలో తన పాత్ర కన్నులపండువగా ఉంటుంది’’ అని తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో పంపిణీదారులు అలంకార్ ప్రసాద్, సుదర్శన్ పాల్గొన్నారు. -
ఎన్నికలలో... ఎన్ని కలలో!
ువేసవి వచ్చేస్తోంది. ‘వేసవి’ అంటే సినిమా టైటిల్ కాదు. సినిమా వాళ్లకు అతి పెద్ద సీజన్ ఇది. స్టార్ హీరోలతో పాటు చిన్నా పెద్దా అంతా ఈ సీజన్లో తమ సినిమాలు విడుదల చేసి బాక్సాఫీస్‌ని కొల్లగొడదామని ప్రయత్నిస్తుంటారు. ఇది ప్రతి ఏటా జరిగేదే. అయితే... ఈ సమ్మర్ సీజన్ మాత్రం తెలుగు సినిమాకు చాలా కీలకం కాబోతోంది. ఎందుకంటే.. 2014 ఎంటరై ఇప్పటికి 71 రోజులైంది. బాక్సాఫీస్ దాహార్తిని తీర్చే సరైన బ్లాక్‌బస్టర్ రాలేదు. సంక్రాంతి సీజన్ కూడా మునుపటి స్థాయిలో పెద్ద ఊపు తేలేదు. అందుకే అందరూ ఆశలన్నీ సమ్మర్ సీజన్‌పైనే పెట్టుకున్నారు. ఈ సమ్మర్లో వచ్చే సినిమాల ఫలితాలు ఈ ఏడాది మొత్తం మీద ప్రభావం చూపిస్తాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. ఓ వైపు టెన్త్, ఇంటర్ పరీక్షలు మొదలవుతున్నాయి. మరో వైపు క్రికెట్ హంగామా. ఈ నెల 16 నుంచి టి-20 వరల్డ్ కప్ మొదలవుతోంది. ఈ హడావిడి సద్దుమణిగేలోపే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల రూపంలో ఏప్రిల్‌లో మరో హంగామా. ఇది నెల పై చిలుకే సాగుతుంది. అసలు ఈ రెండూ కాకుండా అసలైన పెద్ద ఉపద్రవం ఏంటంటే... ఎలక్షన్ హడావిడి. ఈ రెండు నెలలూ రాష్ట్రమంతటా ఎన్నికలే ఎన్నికలు. తొలుత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు. వీటి పుణ్యమా అని పల్లెటూళ్లు బిజీ బిజీ. ఆ వెంటనే... ‘మునిసిపల్ ఎలక్షన్స్’. ఇక మునిసిపాలిటీల కోలాహలం అలాఇలా ఉండదు. చివరాఖరుగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్. వీటి గురించి సరేసరి. ఇవన్నీ అయ్యాక... ఇక కౌంటింగ్. సినిమాలను మించిన ఉత్కంఠ. ఇక థియేటర్లకు జనాలు ఎప్పుడొచ్చేట్లు? ఈ ఉపద్రవాలన్నింటినీ తెలుగు సినిమా ఎలా తట్టుకునేట్లు? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. బాలకృష్ణ, మోహన్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగచైతన్య వంటి స్టార్ హీరోలు ఈ సమ్మర్లోనే అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సమ్మర్ హడావిడికి ‘లెజెండ్’తో శ్రీకారం చుట్టనున్నారు బాలకృష్ణ. ‘సింహా’ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు అమితంగా ఉన్నాయి. ఈ నెల 28న ఈ చిత్రం విడుదల కానుంది. ఇక ‘లెజెండ్’తో పాటే రాబోతున్న మరో స్టార్ హీరో సినిమా ‘రౌడీ’. మోహన్‌బాబు, రామ్‌గోపాల్‌వర్మ తొలిసారి కలిసి పనిచేసిన సినిమా ఇది. ఇటీవల విడుదల చేసిన ‘రౌడీ’ ఫస్ట్ లుక్‌కి విపరీతమైన అప్లాజ్ వచ్చింది. ఈ సినిమాపై అంచనాలు కూడా ఆకాశమంత ఎత్తులో ఉన్నాయి. అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ కూడా ఈ సమ్మర్లోనే దుమ్మురేపనుంది. ఏప్రిల్ ప్రథమార్ధంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) కె.వెంకటేశ్వరరావు సన్నాహాలు చేస్తున్నారు. సురేందర్‌రెడ్డి హాలీవుడ్ సినిమాలను తలపించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. విజయవాడ నేపథ్యంలో, నాగచైతన్య హీరోగా దేవ కట్టా తెరకెక్కించిన ‘ఆటోనగర్ సూర్య’ సమ్మర్లో విడుదల కావడం ఖాయం అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అక్కినేని కుటుంబ చిత్రం ‘మనం’ కూడా తెరపైకొచ్చేది సమ్మర్లోనే. స్వర్గీయ మహానటుడు అక్కినేని నటించిన చివరి సినిమా ఇదే కావడంతో... అన్ని వర్గాలవారూ, అన్నీ వయసులవారూ ఆ సినిమాకోసం ఎదురుచూస్తున్నారు. ‘ఇష్క్’ఫేం విక్రమ్‌కుమార్ ఫీల్‌గుడ్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు సమాచారం. సమ్మర్లో రాబోతున్న మరో ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రభస’. ‘ఆది’ తర్వాత ఎన్టీఆర్ హీరోగా బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం ఇది. ‘కందిరీగ’ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు. ఎన్టీఆర్ ఇమేజ్‌కి తగ్గట్టు పక్కా మాస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం. ఇక స్ట్రయిట్ చిత్రాలకు సవాల్ విసురుతూ... సూపర్‌స్టార్ రజనీకాంత్ రూపం ‘విక్రమసింహ’గా ఈ సమ్మర్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్ ‘అవతార్’ చిత్రాన్ని తెరకెక్కిన త్రీడీ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందిన ఈ చిత్రంలో రజనీ వీరుడుగా కనిపించబోతున్నారు. ఆయనకు జోడీ దీపికా పదుకొనే. ఏఆర్ రెహమాన్ సంగీతం. రజనీ తనయ ఐశ్వర్య దర్శకురాలు. ఏప్రిల్‌లో సినిమా ఉంటుందని వినికిడి. ఈ సినిమాలు కాక, నాని ‘జెండాపై కపిరాజు’, శేఖర్‌కమ్ముల ‘అనామిక’, మారుతీ ‘కొత్తజంట’, అల్లరి నరేష్ ‘జంప్ జిలాని’, ప్రకాశ్‌రాజ్ ‘ఉలవచారు బిర్యాని’, సాయి ధరమ్‌తేజ్ తొలి సినిమా ‘రేయ్’, మలి సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’, ఎమ్మెస్ రాజు ‘జపం’తో పాటు మరికొన్ని చిత్రాలు కూడా సమ్మర్ బరిలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. -
సినీ ప్రస్ధానం
-
అందాల నటీ సమంతా
-
‘ఆటోనగర్ సూర్య’ఆడియో వేడుక
-
ఇదొక ఎమోషనల్ జర్నీ - నాగచైతన్య
‘‘ఈ ట్రైలర్స్ చాలా విభిన్నంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. నాగచైతన్య, సమంతది హిట్ కాంబినేషన్. తప్పకుండా ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు డా. డి. రామానాయుడు. నాగచైతన్య, సమంత జంటగా దేవా కట్టా దర్శకత్వంలో ఆర్.ఆర్. మూవీ మేకర్స్ వెంకట్ సమర్పణలో మాక్స్ ఇండియా పతాకంపై కె. అచ్చిరెడ్డి నిర్మించిన చిత్రం ‘ఆటోనగర్ సూర్య’. అనూప్ రూబెన్స్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను రామానాయుడు ఆవిష్కరించి, రానాకి అందజేశారు. ‘‘ఈ సినిమా ఎలా ఉంటుందో ఫిబ్రవరి 7న చూస్తారు. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటుంది’’ అని ఈ సందర్భంగా అచ్చిరెడ్డి అన్నారు. దేవా కట్టా మాట్లాడుతూ -‘‘ఈ సినిమా కథలో ఉన్న ఆత్మని పరిపూర్ణంగా నమ్మి చేశారు చైతన్య, సమంత. వాళ్ల నమ్మకం, బలం లేకపోతే ఈ సినిమా బాగా వచ్చి ఉండేది కాదు. నిర్మాణంలో ఎన్నో ఒడిదుడుకులనుఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ కథని నమ్మడమే కాకుండా, ఎంతో స్వేచ్ఛనిచ్చిన నిర్మాతలకు నా కృతజ్ఞతలు. ఈ సినిమా థియేటర్ నుంచి మీ ఇంటివరకు మిమ్మల్ని వెంటాడుతుంది’’ అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ -‘‘ఈరోజు కోసం ఎదురు చూశారు. నా కల నిజమైంది. ఈ సినిమా చేయడం అనేది చాలా ఎమోషనల్ జర్నీ. నాతో పాటు ప్రయాణం చేసిన యూనిట్ సభ్యులందరికీ ధన్యవాదాలు. నా అభిమానులు ఎప్పుడు కలిసినా, ‘ఆటోనగర్ సూర్య’ గురించే అడిగేవారు. ఈ సినిమా మీద అంత నమ్మకం పెట్టారు. ఈ సినిమా ద్వారా నాకు ఏ ప్రశంస వచ్చినా... అది పూర్తిగా దేవాకే దక్కుతుంది. తనతో మళ్లీ మళ్లీ సినిమా చేయడానికి సిధ్దంగా ఉన్నాను. అనూప్ మంచి పాటలిచ్చారు’’ అని చెప్పారు. ఈ వేడుకలో ఎస్వీ కృష్ణారెడ్డి, సుకుమార్, సి.కళ్యాణ్, అలంకార్ ప్రసాద్, గౌతంరాజు, విజయ్‌కుమార్ కొండా, సాయికుమార్, సుశాంత్, అనూప్ రూబెన్స్, సురేష్‌రెడ్డి, సమంత, నందు, సంజన తదితరులు పాల్గొన్నారు. -
మాటకు మాట... దెబ్బకు దెబ్బ...
‘‘‘నా పేరు సూర్య.. ఆటోనగర్ సూర్య. నా ప్రపంచంలో మాటకు మాట... దెబ్బకు దెబ్బే సమాధానం. ఇంకా నా క్యాస్ట్ ఏంటో మీకు అర్థం కాలేదు కదూ.. నాది మోటర్ క్యాస్ట్. మనిషి బరువుని, బాధను మోసుకెళ్లే క్యాస్ట్’’... డైలాగ్ పవర్‌ఫుల్‌గా బావుంది కదూ. దేవా కట్టా మంచి దర్శకుడే కాదు, మంచి డైలాగ్ రైటర్ కూడా అని మరోమారు రుజువు చేసేలా ఉందీ డైలాగ్. ఇలాంటి శక్తిమంతమైన డైలాగులు ‘ఆటోనగర్ సూర్య’లో చాలా ఉన్నాయట. నటునిగా నాగచైతన్యలోని కొత్తకోణం ఈ సినిమా అని చిత్రం యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే ‘తడాఖా’తో మాస్‌కి చేరువైన చైతూ... ఈ సినిమాతో మాస్ ప్రేక్షకుల అభిమాన హీరోగా అవతరించడం ఖాయమని వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు కూడా. ఆర్.ఆర్.మూవీమేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. జనవరి 31న ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. అచ్చిరెడ్డి మాట్లాడుతూ -‘‘నాగచైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమా ఇది. ‘ఏమాయచేశావె’ తర్వాత మళ్లీ చైతూ, సమంత కలిసి నటించారు. వారి కెమిస్ట్రీ యువతరాన్ని ఆకట్టుకుంటుంది. అనూప్ మ్యూజిక్ ఈ చిత్రానికి హైలైట్. మా సంస్థల నుంచి వచ్చిన గత చిత్రాలకు మించి ఈ సినిమా ఉంటుంది. నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీకాంత్ నారోజ్, కూర్పు: గౌతంరాజు, కళ: రవీందర్. -
అత్యంత శక్తిమంతంగా ఆటోనగర్ సూర్య
దేవా కట్టా తెరకెక్కించిన ‘ప్రస్థానం’ దేశంలో జరిగిన కొన్ని నిజజీవిత కథలకు అద్దం పట్టింది. తొలి సినిమా ‘వెన్నెల’కు పూర్తి భిన్నంగా ‘ప్రస్థానం’ చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలందుకున్నారు దేవా కట్టా. ఆయన దర్శకత్వంలో ముచ్చటగా రాబోతున్న మూడో సినిమా ‘ఆటోనగర్ సూర్య’. వాస్తవికతకు అద్దం పట్టే ఈ టైటిల్‌ని బట్టి... ఆయన ఎంచుకున్న కథాంశం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా ద్వారా అక్కినేని నటవారసుడు నాగచైతన్యను శక్తిమంతమైన పాత్రలో చూపించనున్నారు దేవా. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కె.అచ్చిరెడ్డి నిర్మాత. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. నిర్మాత మాట్లాడుతూ-‘‘సామాజిక అంశాలను స్పృశిస్తూ, పూర్తి వాణిజ్య విలువలతో దేవా కట్టా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య పాత్ర చిత్రణ చాలా భిన్నంగా ఉంటుంది. ఇటీవల చైతూ, బాలీవుడ్ తార కిమాయాలపై రాజు సుందరం నేతృత్వంలో మూడు రాత్రుల పాటు ఓ ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించాం. దీంతో షూటింగ్ కంప్లీట్ అయింది. అతి త్వరలో పాటలను, త్వరలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. సాయికుమార్, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, జీవా తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, ఎడిటింగ్: గౌతంరాజు, సమర్పణ: ఆర్.ఆర్.మూవీమేకర్స్, నిర్మాణం: మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్. -
నాకిది థ్రిల్లింగ్ మూమెంట్
సినిమాలు చేసే విషయంలో నాగచైతన్య యమ స్పీడు మీదున్నారు. చకచకా సినిమాలు చేస్తూ... అటు స్టార్‌గా, ఇటు యాక్టర్‌గా తన తడాఖా చూపించే పనిలో ఉన్నారు. దేవా కట్టా దర్శకత్వంలో చైతూ నటిస్తున్న ‘ఆటోనగర్ సూర్య’ చిత్రం ఒక పాట మినహా పూర్తయింది. ఇక తన ఫ్యామిలీ స్టార్లందరూ కలిసి నటిస్తున్న ‘మనం’ సినిమా కొత్త షెడ్యూల్ డిసెంబర్ 1 నుంచి కర్నాటకలోని కూర్గ్‌లో మొదలు కానుంది. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం, డి.రామానాయుడు నిర్మించనున్న ‘సింగ్ వర్సెస్ కౌర్’ తెలుగు రీమేక్... మొదలు కావాల్సి ఉన్నాయి. ఇలా... క్షణం తీరిక లేకుండా దూసుకుపోతున్నాడు ఈ అక్కినేని అందగాడు. నేడు నాగచైతన్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా తాను చేస్తున్న సినిమాలు, పాత్రల గురించి మాట్లాడుతూ -‘‘నా కెరీర్లో నేనెంతో ఇష్టపడి, కష్టపడి చేస్తున్న సినిమా ‘ఆటోనగర్ సూర్య’. నా పాత్రను దేవాకట్టా తీర్చిదిద్దిన తీరు వండర్. నా కెరీర్లో ఓ మైలురాయిలా నిలిచే సినిమా అవుతుంది. ఏ విషయంలోనూ రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు కె.అచ్చిరెడ్డి. ఒక ఐటమ్ సాంగ్ మినహా షూటింగ్ పూర్తయింది. ఈ నెల 27 నుంచి నాలుగు రోజుల పాటు ఈ పాటను చిత్రీకరిస్తారు. అనూప్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. త్వరలోనే పాటలను కూడా విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ‘మనం’ సినిమా గురించి చెబుతూ -‘‘తాతయ్యతో, నాన్నతో తెరను పంచుకోవడం అద్భుతమైన అనుభవం. హీరోగా నాకు చాలా థ్రిలింగ్ మూమెంట్ ఇది. విక్రమ్ కుమార్ చాలా గొప్పగా సినిమాను తీస్తున్నారు. ఏ మాయ చేశావె, ఆటోనగర్ సూర్య చిత్రాల తర్వాత సమంత నాకు పెయిర్‌గా నటిస్తోంది. డిసెంబర్ 1 నుంచి కర్నాటకలోని కూర్గ్‌లో తాజా షెడ్యూల్‌ని స్టార్ట్ చేస్తున్నాం. పదిహేను రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగుతుంది’’ అని తెలిపారు. -
సుధీర్‌వర్మ దర్శకత్వంలో నాగచైతన్య
‘తడాఖా’ విజయంతో మంచి జోష్ మీదున్న నాగచైతన్య... సినిమాలు చేసే విషయంలో కాస్త జోరు పెంచారు. ప్రస్తుతం తన ఫ్యామిలీ సినిమా ‘మనం’ షూటింగ్లో బిజీగా ఉన్నారు చైతు. దేవా కట్టా దర్శకత్వంలో ఆయన నటించిన ‘ఆటోనగర్ సూర్య’ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 23న చైతు పుట్టిన రోజు సందర్భంగా ‘ఆటోనగర్ సూర్య’ ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేయనున్నట్లు వినికిడి. ఇదిలావుంటే... మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి నాగచైతన్య పచ్చజెండా ఊపారు. ‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్‌బస్టర్‌ని ప్రేక్షకులకు అందించిన బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘స్వామి రారా’ ఫేం సుధీర్ వర్మ దర్శకుడు. ఈ ఏడాది విడుదలైన చిన్న చిత్రాల్లో పెద్ద విజయంగా నిలిచిన సినిమా ‘స్వామి రారా’. తొలి సినిమాతోనే దర్శకునిగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్న సుధీర్‌వర్మ... నాగచైతన్యతో చేయబోతున్న సినిమా క్కూడా ఓ భిన్నమైన కథాంశాన్నే ఎంచుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరి చివరివారంలో కానీ, మార్చి తొలివారంలో కానీ ఈ సినిమా మొదలవుతుందని తెలిసింది. -
‘ఆటోనగర్ సూర్య’దీపావళికి వస్తున్నాడు
‘ఆటోనగర్ సూర్య’ హంగామా చేయడానికి సన్నద్ధమవుతున్నాడు. బ్యాలెన్స్ వర్క్‌ని పూర్తి చేసి, దీపావళికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ‘ఏమాయ చేసావె’ తర్వాత నాగచైతన్య, సమంత కలిసి చేస్తున్న సినిమా ఇది. ‘వెన్నెల’, ‘ప్రస్థానం’ చిత్రాలతో దర్శకునిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్న దేవా కట్టా ఈ మాస్ చిత్రాన్ని క్లాస్‌గా డీల్ చేస్తున్నారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 10న చివరి షెడ్యూలు మొదలుకానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ షెడ్యూల్లో ఒక పాట, రెండు రోజుల ప్యాచ్‌వర్క్ పూర్తి చేస్తాం. ఆ తర్వాత మలేసియాలో పాట చిత్రీకరిస్తాం. దాంతో సినిమా పూర్తవుతుంది. మరోపక్క నిర్మాణానంతర కార్యక్రమాలు మొదలుపెట్టాం’’ అని తెలిపారు. బ్రహ్మానందం, సాయికుమార్, జయప్రకాష్‌రెడ్డి, ఎమ్మెస్ నారాయణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్. -
ఆటో నగర్ సూర్య మూవీ స్టిల్స్
-
సూర్య మళ్లీ పట్టాలెక్కుతున్నాడు!
బాక్సాఫీస్ వద్ద తన ‘తడాఖా’ చూపించి మంచి జోష్ మీదున్నారు నాగచైతన్య. ప్రస్తుతం తాతయ్య, తండ్రితో కలిసి ‘మనం’లో నటిస్తూ బిజీగా ఉన్నారాయన. అయితే... ఈ మధ్యలో సైన్ చేసి, దాదాపు షూటింగ్ కూడా పూర్తి చేసిన సినిమా ఒకటుంది. అదే ‘ఆటోనగర్ సూర్య’. మరి ఆ సినిమా మాటేంటి? అటు పరిశ్రమనూ ఇటు ప్రేక్షకులనూ వెంటాడుతున్న ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు సదరు చిత్ర దర్శకుడు దేవా కట్టా సమాధానం చెప్పేశారు. కొన్ని కారణాల వల్ల నిర్మాణం విషయంలో అంతరాయం తలెత్తిన ‘ఆటోనగర్ సూర్య’ చిత్రాన్ని త్వరలోనే పట్టాలెక్కిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ఆయన పేర్కొన్నారు. దాదాపు ఈ చిత్రం షూటింగ్ పూర్తిగావచ్చిందని, మిగిలిన భాగాన్ని పూర్తి చేసి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తెస్తామని దేవా కట్టా ట్విట్టర్లో తెలిపారు. దేవా కట్టా గతంలో తీసిన సినిమాలు వెన్నెల, ప్రస్థానం. రెండూ ఒకదానితో ఒకటి సంబంధం లేని కాన్సెప్ట్‌లు. ఈ రెండు సినిమాలతో దర్శకునిగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారాయన. ముఖ్యంగా ‘ప్రస్థానం’తో విమర్శకుల ప్రశంసలందుకున్నారు. మరి నాగచైతన్యను ‘ఆటోనగర్ సూర్య’గా ఆయన ఎలా చూపిస్తారో తెలుసుకోవాలంటే... ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. రాష్ట్రంలో చర్చనీయాంశమైన ఓ అంశం ఆధారంగా ఆయన ఈ చిత్ర కథను తయారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: అనూప్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్.