
నాకిది థ్రిల్లింగ్ మూమెంట్
సినిమాలు చేసే విషయంలో నాగచైతన్య యమ స్పీడు మీదున్నారు. చకచకా సినిమాలు చేస్తూ... అటు స్టార్‌గా, ఇటు యాక్టర్‌గా తన తడాఖా చూపించే పనిలో ఉన్నారు. దేవా కట్టా దర్శకత్వంలో చైతూ నటిస్తున్న ‘ఆటోనగర్ సూర్య’ చిత్రం ఒక పాట మినహా పూర్తయింది. ఇక తన ఫ్యామిలీ స్టార్లందరూ కలిసి నటిస్తున్న ‘మనం’ సినిమా కొత్త షెడ్యూల్ డిసెంబర్ 1 నుంచి కర్నాటకలోని కూర్గ్‌లో మొదలు కానుంది. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం, డి.రామానాయుడు నిర్మించనున్న ‘సింగ్ వర్సెస్ కౌర్’ తెలుగు రీమేక్... మొదలు కావాల్సి ఉన్నాయి. ఇలా... క్షణం తీరిక లేకుండా దూసుకుపోతున్నాడు ఈ అక్కినేని అందగాడు. నేడు నాగచైతన్య పుట్టిన రోజు.
ఈ సందర్భంగా తాను చేస్తున్న సినిమాలు, పాత్రల గురించి మాట్లాడుతూ -‘‘నా కెరీర్‌లో నేనెంతో ఇష్టపడి, కష్టపడి చేస్తున్న సినిమా ‘ఆటోనగర్ సూర్య’. నా పాత్రను దేవాకట్టా తీర్చిదిద్దిన తీరు వండర్. నా కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచే సినిమా అవుతుంది. ఏ విషయంలోనూ రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు కె.అచ్చిరెడ్డి. ఒక ఐటమ్ సాంగ్ మినహా షూటింగ్ పూర్తయింది. ఈ నెల 27 నుంచి నాలుగు రోజుల పాటు ఈ పాటను చిత్రీకరిస్తారు. అనూప్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. త్వరలోనే పాటలను కూడా విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు.
‘మనం’ సినిమా గురించి చెబుతూ -‘‘తాతయ్యతో, నాన్నతో తెరను పంచుకోవడం అద్భుతమైన అనుభవం. హీరోగా నాకు చాలా థ్రిలింగ్ మూమెంట్ ఇది. విక్రమ్ కుమార్ చాలా గొప్పగా సినిమాను తీస్తున్నారు. ఏ మాయ చేశావె, ఆటోనగర్ సూర్య చిత్రాల తర్వాత సమంత నాకు పెయిర్‌గా నటిస్తోంది. డిసెంబర్ 1 నుంచి కర్నాటకలోని కూర్గ్‌లో తాజా షెడ్యూల్‌ని స్టార్ట్ చేస్తున్నాం. పదిహేను రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగుతుంది’’ అని తెలిపారు.