సుధీర్‌వర్మ దర్శకత్వంలో నాగచైతన్య
‘తడాఖా’ విజయంతో మంచి జోష్ మీదున్న నాగచైతన్య... సినిమాలు చేసే విషయంలో కాస్త జోరు పెంచారు. ప్రస్తుతం తన ఫ్యామిలీ సినిమా ‘మనం’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు చైతు. దేవా కట్టా దర్శకత్వంలో ఆయన నటించిన ‘ఆటోనగర్ సూర్య’ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 23న చైతు పుట్టిన రోజు సందర్భంగా ‘ఆటోనగర్ సూర్య’ ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేయనున్నట్లు వినికిడి. ఇదిలావుంటే...
మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి నాగచైతన్య పచ్చజెండా ఊపారు. ‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్‌బస్టర్‌ని ప్రేక్షకులకు అందించిన బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘స్వామి రారా’ ఫేం సుధీర్ వర్మ దర్శకుడు. ఈ ఏడాది విడుదలైన చిన్న చిత్రాల్లో పెద్ద విజయంగా నిలిచిన సినిమా ‘స్వామి రారా’. తొలి సినిమాతోనే దర్శకునిగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్న సుధీర్‌వర్మ... నాగచైతన్యతో చేయబోతున్న సినిమా క్కూడా ఓ భిన్నమైన కథాంశాన్నే ఎంచుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరి చివరివారంలో కానీ, మార్చి తొలివారంలో కానీ ఈ సినిమా మొదలవుతుందని తెలిసింది.