Tadakha
-
సుధీర్‌వర్మ దర్శకత్వంలో నాగచైతన్య
‘తడాఖా’ విజయంతో మంచి జోష్ మీదున్న నాగచైతన్య... సినిమాలు చేసే విషయంలో కాస్త జోరు పెంచారు. ప్రస్తుతం తన ఫ్యామిలీ సినిమా ‘మనం’ షూటింగ్లో బిజీగా ఉన్నారు చైతు. దేవా కట్టా దర్శకత్వంలో ఆయన నటించిన ‘ఆటోనగర్ సూర్య’ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 23న చైతు పుట్టిన రోజు సందర్భంగా ‘ఆటోనగర్ సూర్య’ ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేయనున్నట్లు వినికిడి. ఇదిలావుంటే... మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి నాగచైతన్య పచ్చజెండా ఊపారు. ‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్‌బస్టర్‌ని ప్రేక్షకులకు అందించిన బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘స్వామి రారా’ ఫేం సుధీర్ వర్మ దర్శకుడు. ఈ ఏడాది విడుదలైన చిన్న చిత్రాల్లో పెద్ద విజయంగా నిలిచిన సినిమా ‘స్వామి రారా’. తొలి సినిమాతోనే దర్శకునిగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్న సుధీర్‌వర్మ... నాగచైతన్యతో చేయబోతున్న సినిమా క్కూడా ఓ భిన్నమైన కథాంశాన్నే ఎంచుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరి చివరివారంలో కానీ, మార్చి తొలివారంలో కానీ ఈ సినిమా మొదలవుతుందని తెలిసింది. -
రెండు సినిమాలకు పచ్చజెండా
అందాలరాముడు, మర్యాద రామన్న, పూలరంగడు చిత్రాలతో హీరోగా తన ‘తడాఖా’ ఏంటో చూపించారు సునీల్. ప్రస్తుతం ఆయన సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఉదయ్‌శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘దసరాబుల్లోడు’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలకు పచ్చజెండా ఊపేశారు సునీల్. అందులో మొదటిది భీమినేని శ్రీనివాసరావు సినిమా. ‘సుడిగాడు’ లాంటి భారీ విజయం తర్వాత సునీల్‌తో తన తర్వాతి సినిమాను ప్లాన్ చేశారు భీమినేని. రీమేక్‌ల స్పెషలిస్ట్ అయిన భీమినేని... సునీల్‌తో తెరకెక్కించే సినిమా కూడా రీమేకే కావడం విశేషం. తమిళ హిట్ ‘సుందరపాండ్యన్’ చిత్రాన్ని సునీల్ కథానాయకునిగా రీమేక్ చేయబోతున్నారాయన. ఇక రెండో సినిమా విషయానికొస్తే... ఈ సినిమా ద్వారా రచయిత గోపిమోహన్ దర్శకునిగా పరిచయం కానున్నారు. మళ్ల విజయప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో సెట్స్‌కి వెళ్లనుంది. -
సూర్య మళ్లీ పట్టాలెక్కుతున్నాడు!
బాక్సాఫీస్ వద్ద తన ‘తడాఖా’ చూపించి మంచి జోష్ మీదున్నారు నాగచైతన్య. ప్రస్తుతం తాతయ్య, తండ్రితో కలిసి ‘మనం’లో నటిస్తూ బిజీగా ఉన్నారాయన. అయితే... ఈ మధ్యలో సైన్ చేసి, దాదాపు షూటింగ్ కూడా పూర్తి చేసిన సినిమా ఒకటుంది. అదే ‘ఆటోనగర్ సూర్య’. మరి ఆ సినిమా మాటేంటి? అటు పరిశ్రమనూ ఇటు ప్రేక్షకులనూ వెంటాడుతున్న ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు సదరు చిత్ర దర్శకుడు దేవా కట్టా సమాధానం చెప్పేశారు. కొన్ని కారణాల వల్ల నిర్మాణం విషయంలో అంతరాయం తలెత్తిన ‘ఆటోనగర్ సూర్య’ చిత్రాన్ని త్వరలోనే పట్టాలెక్కిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ఆయన పేర్కొన్నారు. దాదాపు ఈ చిత్రం షూటింగ్ పూర్తిగావచ్చిందని, మిగిలిన భాగాన్ని పూర్తి చేసి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తెస్తామని దేవా కట్టా ట్విట్టర్లో తెలిపారు. దేవా కట్టా గతంలో తీసిన సినిమాలు వెన్నెల, ప్రస్థానం. రెండూ ఒకదానితో ఒకటి సంబంధం లేని కాన్సెప్ట్‌లు. ఈ రెండు సినిమాలతో దర్శకునిగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారాయన. ముఖ్యంగా ‘ప్రస్థానం’తో విమర్శకుల ప్రశంసలందుకున్నారు. మరి నాగచైతన్యను ‘ఆటోనగర్ సూర్య’గా ఆయన ఎలా చూపిస్తారో తెలుసుకోవాలంటే... ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. రాష్ట్రంలో చర్చనీయాంశమైన ఓ అంశం ఆధారంగా ఆయన ఈ చిత్ర కథను తయారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: అనూప్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్.