
మూఢ నమ్మకాలపై... ‘అవంతిక’
‘అవంతిక’ చిత్రం ట్రైలర్ చాలా బాగుంది. సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. మిత్రుడు రామసత్యనారాయణ స్వయం కృషితో ఇప్పటికి 90 చిత్రాలు నిర్మించారు. త్వరలోనే వంద చిత్రాలు పూర్తి చేస్తారనే నమ్మకం ఉంది’’ అని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. పూర్ణ ప్రధాన పాత్రలో శ్రీరాజ్ బళ్లా దర్శకత్వంలో భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘అవంతిక’. ఈ సినిమా ట్రైలర్‌ను రోశయ్య విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం సమాజంలో పలువురు మూఢ నమ్మకాలను నమ్ముతున్నారు. దాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సాగే మా చిత్రాన్ని శ్రీరాజ్ బాగా తెరకెక్కించాడు. 2017లో వంద సినిమాల మైలురాయిని పూర్తి చేయాలనుకుంటున్నా. నా వందో చిత్రం ప్రారంభోత్సవం రోశయ్యగారి చేతుల మీదుగానే జరుపుతా’’ అన్నారు. శ్రీరాజ్ బళ్లా, నిర్మాతలు ప్రతాని రామకృష్ణ గౌడ్, సాయివెంకట్, నటీనటులు గీతాంజలి, శివాజీరాజా, కృష్ణుడు, సత్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కర్ణ ప్యారసారి, సంగీతం: రవిరాజ్ బళ్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ధీరజ అప్పాజీ, సమర్పణ: కె.ఆర్.ఫణిరాజ్.