అక్కడ అంతా మనమే చెప్పాలి!
అమాయకమైన కళ్లు, ఆకట్టుకునే అభినయంతో పక్కా పదహారణాల తెలుగమ్మాయిలా కనిపిస్తారు గుజరాతీ భామ అవికా గోర్. ‘ఉయ్యాల జంపాల’, ‘సినిమా చూపిస్త మావ’ విజయాలతో మంచి జోష్ మీద ఉన్న అవిక తాజాగా ‘తను - నేను’ చిత్రం ద్వారా తెరపై మెరవనున్నారు. నిర్మాత పి. రామ్మోహన్ తొలి ప్రయత్నంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన విశేషాలు అవిక మాటల్లోనే...
‘ఉయ్యాల -జంపాల’ సినిమా చేస్తున్నప్పుడే నిర్మాత రామ్మోహన్ నాకీ కథ చెప్పారు. కథ నచ్చినప్పటికీ ఇందులో ఉన్న కీర్తి పాత్రకు సెట్ అవుతానా? అనే సందేహం వచ్చింది. చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచించే అమ్మాయి కీర్తి. అంత పరిణతి కనబరుస్తానా? అనిపించింది. ఆ తర్వాత నాకు నమ్మకం కలగడానికి కారణం ‘లక్ష్మీ రావే మా ఇంటికి’. ఆ సినిమా చేశాక మాత్రం కీర్తి పాత్రకు సెట్ అవుతాననే నమ్మకం కుదిరింది. అందుకే ఒప్పుకున్నా.
ఇది నా కెరీర్‌లో స్పెషల్ మూవీ. ఇక ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే...ఓ అబ్బాయి, అమ్మాయి, ఆమె తండ్రి చుట్టూ తిరిగే కథ. తన తండ్రి ఇష్టానుసారం హీరోయినేమో ఎప్పటికైనా అమెరికాలో సెటిల్ కావాలని కలలు కంటుంది. కానీ ఆమెను ప్రేమించే అబ్బాయికి మాత్రం అది ఇష్టం ఉండదు. తర్వాత ఏమైందనేది మిగతా కథ. కీర్తికీ, అవికా గోర్‌కు ఏ మాత్రం పోలికలు లేవు. కీర్తి అంత మెచ్యూర్డ్‌గా, స్వతంత్రంగా నేనైతే ఆలోచించను.
మళ్లీ ‘ఉయ్యాల జంపాల’ టీమ్‌తోనే పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. రామ్మోహన్ గారు డెరైక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఇది. ‘ఉయ్యాల జంపాల’ టైంలో ఓ నిర్మాతగా సెట్‌లో గంభీరంగా ఉండే వారు. కానీ డెరైక్టర్‌గా అందుకు పూర్తి భిన్నంగా సరదాగా నవ్వించేవారు. షూటింగ్ చాలా సరదాగా గడిచిపోయింది. సీరియల్స్ చిత్రీకరణకూ, సినిమాలకూ చాలా తేడా ఉంటుంది. అక్కడ ప్రాప్టింగ్ ఇవ్వరు. అంతా మనమే చెప్పాలి. సినిమాలు చేస్తున్నా నేను సీరియల్స్ మానలేదు. ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. తెలుగులో నాకు మరో మంచి ఆఫర్ వచ్చింది. త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తాను.