
బి. జయ దర్శకత్వంలో వైశాఖం
‘‘ఈ ఏడాది మా ఆర్.జె. సంస్థ పతాకంపై బి. జయ దర్శకత్వంలో ‘వైశాఖం’ సినిమా నిర్మించనున్నా. ‘లవ్‌లీ’ తర్వాత మళ్లీ మరో మంచి చిత్రం తీయాలనే ఆకాంక్షతోనే ఇంత కాలం గ్యాప్ తీసుకున్నాం. మంచి ఫీల్‌ని కలిగించే కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది. ఇకనుంచి రెగ్యులర్‌గా సినిమాలు నిర్మించాలనే ప్లాన్‌లో ఉన్నాం. కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో కూడా సినిమాలు తీయనున్నాం’’ అని బీఏ రాజు తెలిపారు.
నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బీఏ రాజు మాట్లాడుతూ - ‘‘సినిమా పరిశ్రమ మీద మక్కువతో చాలా చిన్నప్పుడే ఇక్కడికి వచ్చేశాను. పాత్రికేయుడిగా, ‘సూపర్ హిట్’ పత్రికాధినేతగా, పీఆర్‌వోగా, నిర్మాతగా నా ప్రయాణం సంతృప్తికరంగా ఉంది. ఒకప్పుడు డెరైక్షన్ చేయాలనుకునేవాణ్ణి. కానీ, జయ డెరైక్టర్ అయిన తర్వాత సినిమా దర్శకత్వం అంటే.. పేరు వేసుకున్నంత సులువు కాదని తెలిసి, విరమించుకున్నాను.
అనుకున్న సమయానికి సినిమాని పూర్తి చేయడం, చెప్పిన బడ్జెట్‌లో తీయడంలో జయ బెస్ట్’’ అని చెప్పారు. బి. జయ మాట్లాడుతూ - ‘‘నేను తీసే సినిమాలు ఓ రిఫరెన్స్‌లా మిగిలిపోవాలని నా కోరిక. ‘లవ్‌లీ’ సినిమాని అలానే తీశాను. ఆ చిత్రం ఇతర భాషల్లో అనువాదమై, అక్కడ కూడా విజయం సాధించింది. ‘వైశాఖం’ కూడా మంచి కథతో తీయనున్నాం’’ అని చెప్పారు.