
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినీ దర్శకురాలు, డైనమిక్ లేడీ బి.జయ(54) గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జయ ప్రముఖ పీఆర్వో బీఏ రాజు సతీమణి. జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె సూపర్ హిట్ అనే సినీవారపత్రికకు జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. అనంతరం చంటిగాడు సినిమా ద్వారా దర్శకురాలిగా మారారు. ఆమె తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం రావులపాలెంలో జన్మించారు. తెలుగు సినీ పరిశ్రమలో తనకో ప్రత్యేకతను సంపాదించుకున్నారు. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించారు. ’వైశాఖం’చిత్రంతో ప్రేక్షకుల ప్రశంసలతోపాటు సిల్వర్ క్రౌన్ అవార్డ్‌ను అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment