డైనమిజ(య)ం
తెలుగు పరిశ్రమలో అతి తక్కువ మంది మహిళా దర్శకుల్లో ఒకరైన బి. జయ గురువారం తుది శ్వాస విడిచారు. 1964 జనవరి 11న జన్మించారామె. చెన్నై యూనివర్శిటీలో యం.ఎ ఇంగ్లీష్, అన్నామలై యూనివర్శిటీలో యం.ఎ సైకాలజీ పూర్తి చేయడంతో పాటు జర్నలిజంలో డిప్లొమా కూడా సంపాదించారు జయ. 1986లో పాత్రికేయురాలిగా కెరీర్ ఆరంభించి, పలు ప్రముఖ పత్రికల్లో పని చేశారు. మరోవైపు కథలు, నవలలు కూడా రాసేవారు. సుమారు 50కు పైగా షార్ట్ స్టోరీలు, కొన్ని సీరియల్స్, నవల్స్ రాశారు.
తెలుగు, తమిళ, ఇంగ్లీష్‌లో 100కు పైగా కార్టూన్స్ వేశారు. ‘ఆనందో బ్రహ్మ’ అనే షార్ట్ స్టోరీకి నేషనల్ అకాడమీ అవార్డ్ అందుకున్నారు. ‘స్పర్శ’, ‘నీతి’ కథలకు కూడా అవార్డులు దక్కాయి. పాత్రికేయుడు బీఏ రాజుని పెళ్లాడిన అనంతరం ఆరంభించిన ‘సూపర్ హిట్’ పత్రికకు ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించారు. డైనమిక్ జర్నలిస్ట్ అనిపించుకున్న జయకు డైరెక్టర్ అవ్వాలనే ఆకాంక్ష ఉండేది. దర్శకురాలు కాకముందు దీపక్, అంకిత జంటగా నటించిన ‘ప్రేమలో పావనీ కల్యాణ్’ సినిమాకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు.
డైరెక్టర్‌గా జయ ఫస్ట్ సినిమా ‘చంటిగాడు’ (2003). బాల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలాదిత్యను హీరోగా, సుహాసినిని హీరోయిన్గా పరిచయం చేస్తూ జయ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మలి ప్రయత్నంగా 2005లో యువరాజ్, రిషీ గిరీశ్ హీరోలుగా కామ్నా జెఠ్మలానీని హీరోయిన్గా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘ప్రేమికులు’. ఆ తర్వాత కమెడియన్ అలీని హీరోగా పెట్టి రూపొందించిన చిత్రం‘ గుండమ్మగారి మనవడు’. 2008లో ‘సవాల్’, ఆ తర్వాత ఆది సాయికుమార్ హీరోగా, శాన్వీని హీరోయిన్గా పరిచయం చేస్తూ రూపొందించిన లవ్‌స్టోరీ ‘లవ్లీ’. డైరెక్టర్‌గా బి.జయకు, హీరోగా ఆది సాయికుమార్‌కు ‘లవ్లీ’ పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
‘లవ్లీ’ తర్వాత కొత్త నటీనటులతో తెరకెక్కించిన ‘వైశాఖం’ (2017) కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఈ చిత్రాలను ఆర్జే బ్యానర్‌పై బీఏ రాజు నిర్మించారు. ‘వైశాఖం’ తర్వాత ‘లక్కీ ఫెల్లో’ పేరుతో జయ, రాజు ఓ చిత్రం చేయడానికి ప్లాన్ చేశారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. ఈలోపే ఊహించని విధంగా ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్లారు. జర్నలిజమ్ నుంచి సినిమా డైరెక్షన్ వరకూ జయ సాధించిన విజయాలెన్నో. డైనమిక్ జర్నలిస్ట్, డైనమిక్ డైరెక్టర్, డైనమిక్ లేడీ అనిపించుకున్న జయ ఇటు పాత్రికేయ రంగంలోనూ, అటు సినిమా రంగంలోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆమె మరణం తీరని లోటు అని పలువురు పాత్రికేయులు, సినీ రంగ ప్రముఖులు పేర్కొన్నారు. జయ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
బి. జయకు ప్రముఖుల నివాళి
మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, హీరో మహేశ్‌బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్, దర్శకులు రేలంగి నరసింహారావు, పూరి జగన్నాథ్, ఆయన సతీమణి లావణ్య, కుమారుడు ఆకాశ్, దర్శకుడు వంశీ పైడిపల్లి, నటుడు ఉత్తేజ్, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, కె.ఎస్. రామారావు, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాతలు బెల్లంకొండ సురేశ్, అనీల్ సుంకర, నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), సి.కల్యాణ్, శోభారాణి, రచయితలు చిన్నికృష్ణ, భాస్కర భట్ల, నటీమణులు చార్మీ, హేమ, అపూర్వ, నటి–దర్శకురాలు జీవిత తదితరులు జయకు నివాళులర్పించారు.
జయగారు మన మధ్య లేరనేది జీర్ణించుకోలేనిది. చెన్నయ్‌లో ఉన్నప్పటి నుంచి జయగారితో, బీఏ రాజుతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రచయిత్రిగా, పత్రిక ఎడిటర్‌గా, దర్శకురాలిగా.. ఇలా అన్ని శాఖల మీద మంచి పట్టున్న గొప్ప సాంకేతిక నిపుణురాలు లేకపోవడం పరిశ్రమకు తీరని లోటు. బీఏ రాజు ఒక మాట అన్నారు.. ‘చనిపోయింది తను కాదు, నేను. నా ఆలోచనల్లో, ఊహల్లో జయ బ్రతికే ఉంది. తను లేకపోతే నేను లేను’ అన్నారు. బాధ అనిపించింది.
– నటుడు చిరంజీవి
జయ చనిపోవడం బాధగా ఉంది. తను డైరెక్టర్ అవ్వకముందు జర్నలిస్ట్‌గా ఉన్నప్పటి నుంచీ నాకు తెలుసు. వెరీ హానెస్ట్, ఫ్రాంక్ పర్సన్. ఏ ఇంటర్వ్యూ తీసుకున్నా చాలా బాగా తీసుకునేది. డైరెక్టర్‌గా సక్సెస్ఫుల్ సినిమాలు తీశారు.
– నటుడు వెంకటేశ్
జయగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు పరిశ్రమలోని మహిళా దర్శకుల్లో సావిత్రిగారు, విజయనిర్మలగారి తర్వాత జయగారే. ఆమె 6 సినిమాలు డైరెక్ట్ చేసి హిట్ కొట్టారు. ఆమె రాసిన ‘ఆనందోబ్రహ్మ’ 14 భాషల్లో అనువాదమైంది. ఆవిడలోని మానవీయ కోణం చాలా గొప్పది.
– నటుడు–దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి
జయగారికి, నాకు ఉన్న అనుబంధం ఏంటంటే మా ఇద్దరి బర్త్‌డే ఒకే రోజు (జనవరి 11). ఆవిడ ‘హ్యాపీ బర్త్‌డే అంటే నేను సేమ్ టు యు’ అనేవాణ్ని. నేను ‘హ్యాపీ బర్త్‌డే అంటే ఆవిడ సేమ్ టు యు’ అనేవారు. నా సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా ఫోన్ చేసి విశ్లేషిస్తూ మాట్లాడేవారు.
– దర్శకుడు సుకుమార్
ఎప్పుడో ఇంకా 30 ఏళ్ల తర్వాత వినాల్సిన వార్త ఇంత తొందరగా వినడం చాలా బాధ అనిపించింది. జయ తపన ఉన్న డైరెక్టర్. తను చాలా సక్సెస్ఫుల్ సినిమాలు చేశారు. ఇండస్ట్రీ దురదృష్టం ఏంటంటే మొన్న హరికృష్ణగారు చనిపోయారు.. ఇప్పుడు జయగారు. బాధ తర్వాత బాధ.
– దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి
విజయనిర్మలగారి తర్వాత ఆమె వారసత్వాన్ని జయగారు కొనసాగిస్తూ ఎంతో మంది మహిళా దర్శకులు రావడానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ చాలా స్ఫూర్తి ఇచ్చారు. అలాంటి జయగారు మన మధ్య లేకపోవడం గొప్ప లోటు. క్రాంతికుమార్‌గారి వద్ద నేను అసిస్టెంట్‌గా చేస్తున్నప్పుడు తను కలిదిండి జయ పేరుతో కథలు, పుస్తకాలు రాసేవారు. అవి ఆయనకు బాగా నచ్చేవి. అప్పుడే ఆమె అంటే నాకు అభిమానం ఏర్పడింది.
– దర్శకుడు గుణశేఖర్
బలమైన వ్యక్తిత్వం ఉన్నవారు జయగారు. ఆమెతో మాది 30 ఏళ్ల అనుబంధం. పరిశ్రమ పట్ల పూర్తి అవగాహన ఉన్న గొప్ప టెక్నీషియన్. విజయనిర్మలగారి తర్వాత ఆ స్థాయిలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఎక్కుతారేమో అనేంత పట్టుదల ఉన్న జయగారు సడెన్‌గా ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధాకరం. రాజుగారికి తీరని లోటు ఇది.
– నిర్మాత అచ్చిరెడ్డి
జయగారు నా సినిమాలు చూసి ఎప్పటికప్పుడు అభినందించేవారు.. చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు. నువ్వు మంచి సినిమాలు తీస్తున్నావు.. ఇంకా మంచి సినిమాలు తీయాలి అంటూ ప్రోత్సహించేవారు. చాలా ఫ్రెండ్లీ నేచర్.
– డైరెక్టర్ నందినీరెడ్డి
జయ మేడమ్‌కి ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువ. రోజూ వాకింగ్ చేస్తారు, ఫ్రూట్స్ తింటారు. నాకు ఆవిడ తల్లిలాంటిది. నా ఫస్ట్ సినిమా ‘చంటిగాడు’ డైరెక్టర్ ఆవిడ. ఆ చిత్రం టైమ్‌లో నేను చాలా చిన్నమ్మాయిని. నన్ను కూతురిలా చూసుకున్నారు.
– నటి సుహాసిని
జయగారు ‘లవ్లీ’ సినిమాతో నాకు మంచి హిట్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి, మంచి సినిమాలు చేయాలి, హిట్ కొట్టాలని ఎంకరేజ్ చేసేవారు.
– నటుడు ఆది
హరికృష్ణను చివరిసారి చూడాలనుకున్నారు
కొద్ది రోజులుగా హాస్పిటల్లో ఉంటున్న జయ బుధవారం హరికృష్ణ మరణ వార్త విని షాకయ్యారు. ఆయన్ను కడసారి చూడాలనుకున్నారు. ఆమె తెరకెక్కించిన ‘చంటిగాడు’ చిత్రం ఓపెనింగ్‌కి గెస్ట్‌గా హరికృష్ణ వచ్చారు. ‘‘వేడుక 9 గంటలకు అంటే ఆయన 8.30కి వచ్చారు. ఎంతో ఆప్యాయంగా మాట్లాడి, సినిమా సక్సెస్ కావాలని అభినందించారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శించాలనుకున్నారు జయ. అయితే ఆరోగ్య సమస్యల రీత్యా కొన్ని రోజుల తర్వాత కుటుంబాన్ని పరామర్శిద్దాం అనుకునే లోపే ఆమె మృతి చెందడం విచారకరం’’ అని బీఏ రాజు ఉద్వేగానికి గురయ్యారు.
బీఏ రాజు, చిరంజీవి, వెంకటేశ్, మహేశ్‌బాబు...