
బ్యాక్ టు షూట్
‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ ఇది ఓ బేతాళ ప్రశ్నలా ఇప్పటివరకూ అందర్నీ వేధిస్తూనే ఉంది. కానీ, దీనికి సమాధానం కేవలం రాజమౌళి అండ్ టీమ్‌కు మాత్రమే తెలుసు. అయినా సరే, ఎవరికి తోచిన కథ వాళ్లు అల్లుకుంటూనే ఉన్నారు. ఓ సందర్భంలో ఈ చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్‌ను దీని గురించి అడిగితే- ‘‘నాకో రూ.150 కోట్లు ఇవ్వండి. కచ్చితంగా చెబుతాను’’ అని చమత్కరించారు కూడా. ఈ సంగతి పక్కనబెడితే, ఎవరెన్ని స్టోరీలు చెప్పినా అసలు సమాధానం వచ్చే ఏడాది విడుదలయ్యే ‘బాహుబలి -ద కన్‌క్లూజన్’ (బాహుబలి2) చూసి తెలుసుకో వాల్సిందే.
మొదటి భాగానికి జాతీయ అవార్డు కూడా రావడంతో రెండోభాగంపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అందుకే మలి భాగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి సన్నాహాలు చేస్తున్నారు రాజమౌళి. ఏ పనిలోనైనా బ్రేక్ కావాలి. లేకపోతే ఎంత ఇష్టమైన పనైనా సరే అది కష్టంగా ఉంటుంది. అందుకేనేమో ‘బాహుబలి’ టీమ్ మొత్తం సమ్మర్ బ్రేక్ తీసుకున్నారు. అయితే మళ్లీ ఈ సినిమా పనుల్లో నిమగ్నమైనట్లు ‘బాహుబలి’ టీమ్ తన ట్విట్టర్‌లో పేర్కొంది.
క్లైమాక్స్‌లో వచ్చే యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. త్వరలోనే ఆర్‌ఎఫ్‌సీలో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించి, అక్టోబరు నెలాఖరు కల్లా పూర్తి చేయాలని ‘బాహుబలి’ టీమ్ ప్లాన్ చేసుకుంటోంది. ‘బాహుబలి’తో పాటు దాని రెండో భాగాన్ని కూడా వర్చ్యువల్ రియాలిటీ వెర్షన్‌లో కూడా సిద్ధం చేయాలనుకుంటున్నట్లు ఇటీవల జరిగిన కాన్స్ చిత్రోత్సవాల్లో చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి పని మొదలైంది... సినిమా ఎలా ఉంటుందో... అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.