ఆ కోరిక తీరలేదు
– నాగార్జున
అక్కినేని నాగేశ్వరరావుగారు ‘దాదాసాహెబ్ ఫాల్కే జాతీయ అవార్డు’ అందుకున్నాక, ఆయన కూడా జాతీయ స్థాయిలో ఇటువంటి అవార్డును నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఇవ్వాలనుకున్నారు. ఆ ఆలోచన నుంచి వచ్చిందే ‘ఏయన్నార్ జాతీయ అవార్డు’’ అని అవార్డు కమిటీ చైర్మన్, ‘కళాబంధు’ టి. సుబ్బరామిరెడ్డి అన్నారు. 2006 నుంచి ఇస్తున్న ‘ఏయన్నార్ జాతీయ అవార్డు’కు ఈ ఏడాది దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళిని ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘తాను లేకపోయినా ఎప్పటికీ ఈ అవార్డును కుటుంబ సభ్యులు అందించాలన్నదే ఏయన్నార్ కోరిక. తండ్రి మాట నిలబెట్టడానికి నాగార్జున కృషి చేస్తున్నారు. ఒకప్పుడు తెలుగువారంటే ఇతర రాష్ట్రాల్లో పెద్దగా గుర్తింపు ఉండేదికాదు. ఏయన్నార్‌గారు, ఎన్టీఆర్‌గారు జాతీయస్థాయిలో తెలుగువారి సత్తా చాటారు. ‘బాహుబలి’ సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారికి గుర్తింపు తెచ్చిన రాజమౌళికి ఈ అవార్డును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుగారి చేతుల మీదగా ఈ నెల 17న అందించనున్నాం’’ అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఏయన్నార్ అవార్డు, అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా(ఏ.ఐ.ఎస్.ఎఫ్.ఎమ్.) నాన్నగారి కల, కోరికలు. అవార్డు పంపిణీ, ఏ.ఐ.ఎస్.ఎఫ్.ఎమ్. కాన్వొకేషన్ ఫంక్షన్లను కలిపి నాన్న పుట్టినరోజున (సెప్టెంబర్ 20) చేయాలనుకున్నాం. కానీ, వెంకయ్యనాయుడిగారికి 17న వచ్చే వీలు ఉండటంతో అదే రోజు చేస్తున్నాం. ఈ ఏడాది రాజమౌళికి నాన్నగారి అవార్డు ఇస్తుండటం చాలా హ్యాపీగా ఉంది. ఆయనతో పనిచేయాలన్న నా కోరిక తీరలేదు. కానీ, ‘రాజన్న’ సినిమాలో కొన్ని సీన్స్‌ని రాజమౌళి డైరెక్ట్ చేశారు. తెలుగువారు గర్వపడే సినిమా తీసిన ఆయన నిజంగా బాహుబలే’’ అన్నారు. ‘‘ఏ.ఐ.ఎస్.ఎఫ్.ఎమ్. ను అక్కినేనిగారు ఏ ఆశయంతో నెలకొల్పారో ఆ ఆశయం నెరవేరుతోంది. ఈ స్కూల్‌లో ప్రవేశం కోసం ఇండియా నుంచే కాకుండా, ఇతర దేశాల నుంచి విద్యార్థులు వస్తున్నారు’’ అని అమల అన్నారు.