ANR national award
-
ANR అవార్డు అందుకున్న హీరో చిరంజీవి (ఫొటోలు)
-
కాబోయే కోడలు అంటూ.. శోభితను చిరంజీవికి పరిచయం చేసిన నాగార్జున (ఫొటోలు)
-
ఈ సంవత్సరం మాకు ప్రత్యేకం: నాగార్జున
దివంగత ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరుతో ఇస్తున్న ‘ఏఎన్ఆర్’ అవార్డు వేడుకని ఈ నెల 28న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 20న ఏఎన్ఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ‘ఏఎన్ఆర్’ అవార్డుని హీరో చిరంజీవికి ఇవ్వనున్నట్లు నాగార్జున పేర్కొన్న విషయమూ తెలిసిందే. అందులో భాగంగా శుక్రవారం చిరంజీవిని కలిసిన నాగార్జున అవార్డు వేడుకకి రావాలంటూ ఆహ్వానించారు.‘‘మా నాన్న ఏఎన్ఆర్గారి శత జయంతి వేడుకలు జరుపుకుంటున్న ఈ సంవత్సరం మాకు చాలా ప్రత్యేకమైనది. ఈ మైలురాయికి గుర్తుగా ఈ అవార్డు వేడుకకి అమితాబ్ బచ్చన్‌గారు, చిరంజీవిగారిని ఆహ్వానించడం ఆనందంగా ఉంది. ఈ అవార్డు ఫంక్షన్‌ను మరపురానిదిగా చేద్దాం’’ అంటూ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు నాగార్జున. ఈ అవార్డు ప్రదానోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఇక ఇప్పటివరకూ దేవానంద్, షబానా అజ్మీ, అంజలీ దేవి, వైజయంతీ మాల బాలి, లతా మంగేష్కర్, కె. బాలచందర్, హేమ మాలిని, శ్యామ్ బెనెగల్, అమితాబ్ బచ్చన్, ఎస్.ఎస్. రాజమౌళి, శ్రీదేవి, రేఖ వంటి దిగ్గజాలు ‘ఏఎన్ఆర్’ అవార్డును అందుకున్నారు. -
చిరంజీవికి అక్కినేని నాగార్జున ఆహ్వానం
ఈ నెల(అక్టోబర్ 28)న అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు హాజరుకావాలని మెగాస్టార్ చిరంజీవిని అక్కినేని నాగార్జున ఆహ్వానించారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్‌ను కూడా ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరవుతారని ఎక్స్ వేదికగా నాగార్జున తెలియజేశారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన చిత్ర ప్రముఖులకు తన పేరుతో జాతీయ అవార్డ్ ఇచ్చి సత్కరించాలని ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు 2006లో ఏఎన్నార్ అవార్డులను ప్రారంభించారు. మధ్యలో రెండేళ్ల గ్యాప్ ఇచ్చి.. 2014 తిరిగి అమితాబ్ బచ్చన్‌కు ఈ అవార్డు అందజేశారు. ఆ తర్వాత మళ్లీ రెండేళ్లు గ్యాప్ వచ్చింది. 2016లో జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరికి ఏఎన్నార్ అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత రాజమౌళి, శ్రీదేవి, రేఖలకు ఈ అవార్డులు అందుకున్నారు. ఐదేళ్ల గ్యాప్ తర్వాత తాజాగా మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ అవార్డును అందజేయబోతున్నట్లు నాగార్జున ప్రకటించారు. ఈ నెల 28న అన్నపూర్ణ స్టూడియో జరగబోతున్న ఈ వేడుకల్లో అమితాబ్ చేతుల మీదుగా చిరంజీవి ఈ అవార్డును అందుకోబోతున్నారు. -
నడిచే నిఘంటువు అక్కినేని
‘‘అందం, అభినయంతో సూపర్‌స్టార్స్ అయిన రేఖ, శ్రీదేవిగార్లకు అక్కినేని నాగేశ్వరరావుగారి అవార్డుని నా చేతులమీదుగా ఇవ్వడం నా అదృష్టం. వారిద్దరూ భారతదేశం గర్వించదగ్గ నటీమణులు’’ అని చిరంజీవి అన్నారు. 2018, 2019 సంవత్సరాలకు ‘అక్కినేని జాతీయ అవార్డు’లకు శ్రీదేవి, రేఖలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథి చిరంజీవి చేతులమీదుగా రేఖ తీçసుకోగా, శ్రీదేవి అవార్డును ఆమె భర్త బోనీకపూర్ స్వీకరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ– ‘‘మా అమ్మ అంజనాదేవిగారికి నాగేశ్వరరావుగారంటే చాలా ఇష్టం. నిండు గర్భవతిగా ఉన్నప్పుడు ఆయన నటించిన ‘రోజులు మారాయి’ సినిమా చూశారు. ఆ టైంలో అమ్మ కడుపులో ఉన్నది నేనే. అందుకేనేమో.. నాకూ సినిమాలంటే ఇష్టం కలిగింది. చదువు అయిపోయాక ఇండస్ట్రీలోకి వచ్చా. అది కూడా నాగేశ్వరరావుగారు, రామారావుగారు వంటి లెజెండ్స్ టైమ్‌లో. ‘మెకానిక్ అల్లుడు’ సినిమాలో నాగేశ్వరరావుగారితో నటించడం అద్భుతమైన జ్ఞాపకం. నేను క్రమశిక్షణగా ఉన్నానంటే అది ఆయన వల్లే.. ఓ రకంగా నా గురుతుల్యులు. ఆయన నడిచే నిఘంటువు. నటనలో ఒక ఎన్సైక్లోపీడియా. ‘ఏయన్నార్ జాతీయ అవార్డు’ ఏదో ఒక రోజు ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు’ అంత గొప్ప స్థాయికి చేరుకుంటుందనడంలో సందేహం లేదు. శ్రీదేవి, రేఖగార్లు మనందరం గర్వించే స్థాయిలో ఉన్నారు. అన్ని భారతీయ భాషల్లో సినిమాలు చేసిన శ్రీదేవిగారు ‘ఇండియా లేడీ సూపర్‌స్టార్’ అయ్యారు. రేఖగారిపై నాకున్న అభిమానంతో నా భార్య సురేఖని ఇప్పటికీ రేఖ అనే పిలుస్తుంటా.. ఆ విషయం తనకి తెలియదు(నవ్వుతూ)’’ అన్నారు. రేఖ మాట్లాడుతూ – ‘‘నా తొలి సినిమా, తెలుగు సినిమా ‘ఇంటిగుట్టు’. శ్రీదేవిగారు గొప్పనటి. ఆమెలా ఉండాలి. నా జీవితంలో తొలిసారి చూసిన సినిమా ‘సువర్ణ సుందరి’. అంజలీదేవిగారి ‘అమ్మకోసం’ సినిమాతో నాకు బ్రేక్ వచ్చింది. నేను ఇక్కడ ఉన్నానంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా నాగేశ్వరరావుగారు, అంజలి అత్తయ్యే కారణం. ‘సువర్ణసుందరి’ సినిమా వందసార్లు చూసి ఉంటాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. నేనూ చూశాను. ముంబైలో ఉన్నప్పుడు టి.రామారావుగారు, పూర్ణచంద్రరావుగారు, దాసరి నారాయణరావుగారు, కె.విశ్వనాథ్‌గారు, జితేందర్గారు ఇక్కడ సినిమాలు చేయమని పిలిచేవారు. మా అమ్మ చెప్పిన మాట ప్రకారం మరో తెలుగు సినిమా తప్పకుండా చేస్తా’’ అన్నారు. ‘ఏయన్నార్ జాతీయ అవార్డు’ కమిటీ చైర్మన్ టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ – ‘‘ఈ వేడుక సందడి చూస్తుంటే అక్కినేనిగారి చిరునవ్వును చూసినట్లుంది. నాకు, ఏయన్నార్‌గారికి వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ క్లాస్‌మేట్స్‌లా ఉండేవాళ్లం. అందంతో పాటు మంచి మనసున్న నటి శ్రీదేవి. 35 ఏళ్ల క్రితం రేఖ ఎంత అందంగా ఉన్నారో ఇప్పుడూ అంతే అందంగా ఉన్నారు. నాగేశ్వరరావుగారు, ఎన్టీఆర్, చిరంజీవి, నాగా ర్జున వంటి వారి నుంచి నేటితరం నటీనటులు నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి’’ అన్నారు. అక్కినేని నాగార్జున మాట్లాడుతూ– ‘‘నాన్నగారి సంకల్పమే మమ్మల్ని నడిపిస్తోంది. ఆయన ఆలోచనలే మేము ఆచరిస్తున్నాం. శ్రీదేవి, రేఖగార్లకు ఈ అవార్డులు ఇవ్వాలని నాన్న ఎప్పుడూ చెబుతూనే ఉండేవారు. ఆయన ఉన్నప్పుడు ఇవ్వలేకపోయాం. కానీ తెలుగు సినిమా ఉన్నంత వరకు అక్కినేని నాగేశ్వరరావుగారు ఉంటారు. ఈ వేదికమీదున్న అవార్డుతో పాటు నాన్న కూడా ఇక్కడే మనమధ్యే ఉంటారు. శ్రీదేవిగారితో నేను నాలుగు సినిమాలు చేశా. బోనీకపూర్గారు భర్తగా లభించడం శ్రీదేవిగారి అదృష్టం. అక్కినేనిగారు, శ్రీదేవిగారు ఎప్పటికీ జీవించే ఉంటారు. రేఖగారు, శ్రీదేవిగారు ఇద్దరూ తెలుగువాళ్లే.. ఇద్దరూ ఇండియా సూపర్స్టార్సే.. ఇది మనకు గర్వకారణం’’ అన్నారు. ఈ వేడుకలో బ్రహ్మానందం, నాగచైతన్య, విజయ్ దేవరకొండ, అఖిల్, సుమంత్, సుశాంత్, శ్రీకాంత్, కార్తికేయ, అడివి శేష్, అమల, సుప్రియ, మంచు లక్ష్మీతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
అమ్మ కోసం మళ్లీ వస్తా: రేఖ...
సాక్షి, హైదరాబాద్ : ‘తాను ఇవాళ వేదికపై ఉన్నానంటే అందుకు కారణం అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలీదేవిగారే. వారిద్దరూ నటించిన ‘సువర్ణసుందరి’ చిత్రం నా జీవితంలో చూసిన తొలి సినిమా. వందసార్లు అయినా ఆ సినిమా చూశాను. సినిమా అంటే ఏంటి అనే తెలియని వయసులో ఆ సినిమా చూశాక నాకు పిచ్చి పట్టేసింది’ అని ప్రముఖ బాలీవుడ్ నటి రేఖ తెలిపారు. అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందుకున్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘అన్నపూర్ణ స్టూడియోకు వస్తే నా సొంతింటికి వచ్చినట్టుంది. అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే.. మా చిన్నాన్న వేదాంతం రాఘవయ్య గారు. నా చిన్నప్పుడు ఆయన ఎప్పుడూ మాట్లాడుతుండేవారు. ఆ అబ్బాయ్ చాలా ఫోకస్డ్... చాలా స్మార్ట్, చాలా ఫన్నీ, ప్రేమ, క్వయిట్ కానీ ...కెమెరా ఆన్ అయితే అదరగొట్టేస్తారు. ఎవరూ...ఎవరూ అని అడిగితే ఇంకెవరూ నాగేశ్వరరావుగారు అని చెప్పారు. నేను చూసిన మొదటి సినిమా ‘సువర్ణ సుందరి’. ఇక్కడ నేను నిల్చున్నానంటే దానికి కారణం నాగేశ్వరరావుగారు, అంజలీదేవినే. ఆ సినిమా చూశాక పిచ్చి పట్టేసింది. ఎలాగేనా సినిమాల్లో నటించాలని అనుకున్నాను. చదవండి: రేఖగారు మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారు.. నటి అయ్యాక షూటింగ్‌కు వెళుతూ... రోజూ బంజారాహిల్స్ నుంచి వెళుతూ గుడిలోకి వెళ్లేదాన్ని. అక్కడ నుంచి అలా తిరిగితే నాగేశ్వరరావు గారి ఇల్లు. ఇంకోవైపు సుబ్బరామిరెడ్డిగారి ఇల్లు. రోడ్డు మీద వెళుతూనే నాగేశ్వరరావుగారికి మనసులోనే నమస్కరించేదాన్ని. పెద్ద స్టార్‌ను అయ్యేలా దీవించమని. ఒకరోజు భోజనానికి వాళ్ల ఇంటికి పిలిచారు. అమ్మ బాబోయ్ అని భయపడ్డాను. అమ్మాయ్ ఏం అనుకున్నావ్. నిన్ను చాలా గమనించేవాడిని తెలుసా? అని అన్నారు. నేను ఒక్కమాట మాట్లాడితే ఒట్టు. చూడమ్మాయ్.... నువ్వు ఏం తింటున్నావో అనేది కూడా ముఖ్యం. కానీ అన్నింటికి కంటే ముఖ్యం నువ్వు ఏం తింటావో అది మన మీద ప్రభావం చూపుతుందని. అది అప్పట్లో నాకు అర్థం కాలేదు కానీ తర్వాత తెలిసింది. నాగేశ్వరరావుగారితో పాటు అలాగే మా నాన్నగారు చదువు, నటన గురించి చెప్పిన రెండు మాటలు జీవితాంతం చీర పల్లులో మూటకట్టుకుని పెట్టుకున్నాను. అందరూ అడుగుతున్నారు ఇప్పటికీ ఇంత అందంగా ఎలా ఉన్నారు అని. అవి నాకు అమ్మా,నాన్నల నుంచి వారసత్వంగా వచ్చిన జీన్స్ అంతే. ఇందుకోసం నేను ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. సినిమా కెరీర్లో ఎత్తు పల్లాలు ఉంటాయి. నా జీవితంలో కూడా అలాంటివి జరిగాయి. అయినా తట్టుకుని నిలబడ్డాను. అప్పట్లో హాస్పటల్లో ఉన్న అమ్మ తన కోసం ఓ తెలుగు సినిమా చేయమంది. అమ్మ కోసం తెలుగు సినిమాలో నటిస్తా. తెలుగు బాగా నేర్చుకుని శ్రీదేవి అంత స్పష్టంగా మాట్లాడతాను’ అని తెలిపారు. -
అక్కినేని జాతీయ అవార్డుల ప్రదానోత్సవం
-
రేఖగారు మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారు..
సాక్షి, హైదరాబాద్ : అక్కినేని జాతీయ పురస్కారాలు ఆదివారం సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అతిథులకు అక్కినేని కుటుంబం స్వయంగా స్వాగతం పలికి ఆహ్వానించింది. ఈ వేడుకల్లో 2018, 2019 సంవత్సరాలకు అవార్డులు ప్రదానం చేశారు. 2018కి గాను దివంగత నటి శ్రీదేవికి పురస్కారం ప్రకటించగా, శ్రీదేవి తరఫున ఆమె భర్త బోనీకపూర్ ఈ అవార్డును మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా అందుకున్నారు. అలాగే 2019కి గానూ బాలీవుడ్ సీనియర్ నటి రేఖకు అక్కినేని అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. తెలుగు సినిమా ఉన్నంతవరకూ అక్కినేని నాగేశ్వరరావు అందరి మనస్సులో ఉంటారని అన్నారు. ‘సినిమా తల్లి ఎంతో ఇచ్చింది. ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి నాన్న అక్కినేని జాతీయ పురస్కారాన్ని ప్రకటించారు. ఈ జాతీయ పురస్కారంతో పాటు నాన్న తనపేరు కూడా చిత్ర పరిశ్రమలో చిరకాలం ఉంటుందనుకునేవారు. నాన్నగారు భౌతికంగా మనమధ్య లేకున్నా ఆయన ఆత్మ మన మధ్య, మనతో ఇక్కడే ఉంది. జాతీయ అవార్డుతో పాటు నాన్నగారు కూడా ఈ వేదికపైనే ఉన్నారు. ఆయన సంకల్పం నెరువుతుందని సంతోషంగా ఉన్నారు.’ అని పేర్కొన్నారు. గతంలో దేవానంద్ , షాబానా ఆజ్మీ , లతా మంగేష్కర్ , కే బాల చందర్ ,హేమమాలిని, అమితాబచ్చన్ , రాజమౌళి లాంటి ప్రముఖులకు అక్కినేని జాతీయ పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున, నటి రేఖా మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. నటి రేఖ తొలి తెలుగుచిత్రంతో పాటు, అందంపై నాగార్జున చేసిన వ్యాఖ్యలకు అంతే దీటుగా రేఖా సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా రేఖ స్పష్టమైన తెలుగులో మాట్లాడి వేడుకకు వచ్చిన వారందరినీ ఆశ్చర్యపరిచారు. తన తొలి తెలుగు చిత్రం ‘ఇంటిగుట్టు’ అని.. సొంత ప్రొడక్షన్లో నిర్మించిన ఆ సినిమాలో ఏడాది వయసు పాత్ర తనదని అన్నారు. ‘రేఖగారు మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారు’ అన్న నాగార్జున ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ... ‘మీరు ఎంత అందంగా ఉన్నారో నేను అంతే అందంగా ఉన్నాను’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అవార్డుల ఫంక్షన్‌లా లేదని, ప్రశ్నల కార్యక్రమంలా ఉందంటూ రేఖ సరదాగా వ్యాఖ్యలు చేశారు. సినిమా ...సినిమానే...జీవితం ...జీవితమే అని ఆమె అన్నారు. ఆఖరీ రాస్తా చిత్రానికి శ్రీదేవికి డబ్బింగ్ చెప్పిన విషయాన్ని రేఖ గుర్తు చేసుకున్నారు. ఆమె బిజీగా ఉండటంతో ఆ సినిమాకు తాను డబ్బింగ్ చెప్పానని తెలిపారు. అలాగే శ్రీదేవితో కలిసి నాలుగు సినిమాలు చేశాను. మీతో కలిసి నటించాలని ఉందంటూ నాగార్జున ఈ సందర్భంగా రేఖను కోరగా... నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తే అందులో ఒక పాత్రలో రేఖ నటిస్తారంటూ చిరంజీవి మధ్యలో మైక్ తీసుకుని తన మనసులో ఉన్న మాట అంటూ చెప్పుకొచ్చారు. -
మహోన్నతుడు అక్కినేని
‘‘అందరి గుండెల్లో జీవించి ఉండే మహోన్నతమైన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావుగారు(ఏయన్నార్). అలాంటి వ్యక్తిని మళ్లీ చూడలేం. ఆయన పేరిట నెలకొల్పిన ‘ఏయన్నార్ జాతీయ అవార్డు’ ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఈ అవార్డు గ్రహీతలు అదృష్టవంతులు’’ అని ‘ఏయన్నార్ జాతీయ అవార్డు కమిటీ చైర్మన్’, కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి అన్నారు. 2018, 2019 సంవత్సరాలకుగానూ ఏయన్నార్ జాతీయ అవార్డు గ్రహీతల పేర్లను హైదరాబాద్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో సుబ్బరామిరెడ్డి వెల్లడించారు. ఏయన్నార్ నేషనల్ ఫిల్మ్ అవార్డు 2018కి దివంగత ప్రముఖ నటి శ్రీదేవికి, 2019కి నటి రేఖలను ఎంపికచేశారు. ఈ నెల 17న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో హీరో చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ –‘‘నాకు ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డు వచ్చినప్పుడు అక్కినేని నాగేశ్వరరావుగారు పిలిచి ‘ఏయన్నార్ నేషనల్ ఫిలిం అవార్డు’ను స్థాపించి, అవార్డులు ఇవ్వాలనే ఆలోచన గురించి చెప్పారు. తాను ఉన్నా లేకున్నా తన వారసుల చేత ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతూనే ఉండాలన్నారు. అలా 2006లో ‘ఏయన్నార్ నేషనల్ ఫిలిం అవార్డు’ను స్థాపించి, తొలిసారి నటుడు దేవానంద్‌కు ఇచ్చాం. 2017లో దర్శకుడు రాజమౌళికి ఇచ్చాం. నటీమణులుగా శ్రీదేవి, రేఖ జాతీయస్థాయిలులో కీర్తి గడించారు. అందరూ గర్వించే గొప్ప నటి శ్రీదేవికి ఈ అవార్డు ఇవ్వాలనేది నాగేశ్వరరావుగారి కోరిక కూడా. అందుకే 2018 అవార్డును శ్రీదేవికి ఇస్తున్నాం. తండ్రి ఆలోచనలను బాధ్యతగా ముందుకు తీసుకువెళ్తున్న నాగార్జునగారిని అభినందిస్తున్నాను’’ అన్నారు. హీరో నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఏయన్నార్ నేషనల్ ఫిలిం అవార్డు’ మాకు ఎంతో ప్రతిష్టాత్మకమైనది. నాన్నగారి(ఏయన్నార్) పేరు ఉన్నంతవరకు ఈ అవార్డును ప్రదానం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. మా నాన్నగారికి సుబ్బరామిరెడ్డిగారు ఎంత సన్నిహితులో, నాకూ అంతే సన్నిహితులు. ఈ అవార్డు కమిటీ బోర్డ్ చైర్మన్‌గా ఆయన ఉండాలి అనేది నాన్నగారి కోరిక. శ్రీదేవి తరపున ఈ అవార్డును ఆమె భర్త బోనీకపూర్, కుటుంబ సభ్యులు తీసుకుంటారు. రేఖగారికి ఈ అవార్డు గురించి చెప్పగానే చాలా సంతోపడ్డారు. నాన్నగారితో మంచి అనుబంధం ఉందని, ఆయన దగ్గర నటనకు సంబంధించిన సలహాలు తీసుకున్నట్లు చెప్పారామె. అవార్డు గ్రహీతలకు ఐదు లక్షల నగదు బహుమతి అందజేస్తాం. ఈ కార్యక్రమంలో ‘అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా’ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు రేఖగారు సర్టిఫికెట్లు అందజేస్తారు’’ అన్నారు. -
శ్రీదేవి, రేఖలకు ఏఎన్ఆర్ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: చిత్ర పరిశ్రమలో అద్భుతమైన ప్రతిభ చూపిన వారికి అందించే ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరావు జాతీయ పురస్కారాలను గురువారం కమిటీ ప్రకటించింది. 2018-19కి గానూ దివంగత నటి శ్రీదేవి బోనీకపూర్‌తో పాటు, మరో సీనియర్ హీరోయిన్ రేఖ.. ఏఎన్ఆర్ అవార్డులను అందుకోనున్నారు. కాగా 2013లో ఏఎన్ఆర్ అవార్డును అందుకున్న అలనాటి అందాల నటి శ్రీదేవి మరోసారి ఈ అవార్డుకు ఎంపిక కావడం విశేషం. నవంబరు 17న అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించే ఒక కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఈ అవార్డులను అందించనున్నారని కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీదేవి తరపున ఆమె భర్త బోనీకపూర్ ఈ పురస్కారాన్నిస్వీకరించనున్నారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ కాలేజీ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా (ఏసీఎఫ్ఎం) తృతీయ కాన్వకేషన్ (స్నాతకోత్సవం)ను కూడా నిర్వహించనున్నట్టు తెలిపింది. కాగా ఏఎన్ఆర్ తొలి జాతీయ అవార్డును బాలీవుడ్ హీరో దేవానంద్, 2017లో టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి అందుకున్నారు. అలనాటి మేటి నటి అంజలీదేవి (2007), నర్తకి, నటి వైజయంతిమాల (2008), నేపథ్య గాయని లతా మంగేష్కర్ (2009), దర్శకుడు కె. బాలచందర్ (2010), దర్శకురాలు హేమమాలిని (2011), రచయిత దర్శకుడు శ్యామ్ బెనగల్ (2012), బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్‌బచ్చన్ (2014), సూపర్‌స్టార్ కృష్ణ(2015) ఈ పురస్కారాన్ని అందుకున్న ప్రముఖులు. -
కుటుంబంతో చూసే సినిమాలేవి?
► అలాంటివి వేళ్లపై లెక్కించొచ్చు: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ► సామాజిక విలువలతో సినిమాల్లో ఒక్క పాటైనా పెట్టాలి: సీఎం కేసీఆర్ ► వెంకయ్య చేతుల మీదుగా రాజమౌళికి ఏఎన్ఆర్ జాతీయ అవార్డు ప్రదానం సాక్షి, హైదరాబాద్: ‘‘ఇవాళ ఎన్నో అద్భుతమైన సిని మాలు రూపొందుతున్నా చౌకబారు, మూస సిని మాలు కూడా కొన్ని వస్తున్నాయి. పలువురు దర్శక, నిర్మాతలు తమ సృజనాత్మకతను హింస, నేరాలు, అసభ్యత, డబుల్ మీనింగ్ డైలాగుల్లో చూపించేందుకు ఉపయోగిస్తున్నారు. సినిమా విజయవంతం కావడమే పరమావధిగా పెట్టుకున్నారు. సినిమాలకు జనాల జీవితమే పరమావధి కావాలి’’ అని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. హింస, అత్యాచారం, హత్యలు వంటి వాటిని ఎక్కువ చేసి చూపిస్తున్నారని, సినిమా, మీడియా బాధ్యతాయుతంగా ఉండాలని హితవు పలికారు. కుటుంబంతో కలిసి చూసే సిని మాలు ఇప్పుడు వేళ్లపై లెక్కపెట్టొచ్చని, శివాజీ గణే శన్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి నటులు తగ్గిపోయారని అన్నారు. ఏఎన్ఆర్ నటన తలచుకుంటే మనసు మధురం అవుతుందని కొనియాడారు. ఆదివారం ఆయన హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళికి ‘ఏఎన్ఆర్ జాతీయ అవార్డు’ను ప్రదానం చేశారు. సన్మాన పత్రం, చెక్కును సీఎం కేసీఆర్ అందజే శారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. ‘‘ఈ అవార్డుతో పెద్ద బాధ్యత నా భుజాలపై పెట్టారని రాజమౌళి అన్నారు. ఈ బాధ్యతని కచ్చితంగా నువ్వు నెరవేర్చగలవు. ఎందుకంటే నువ్వు ‘బాహుబలి’. అంటే ఫిజికల్‌గా కాదు. క్రియేటివిటీ, విజన్ పరంగా. ఈ పురస్కారాలు ఎందుకంటే మిగతా వాళ్లకి ఒకరక మైన అభిరుచి, శ్రద్ధ, ఆసక్తి పెంచడం కోసం’’అని అన్నారు. తల్లిపాలు ఎంత శ్రేష్టమో మాతృభాష కూడా అంతే శ్రేష్టమని, తెలంగాణలో తెలుగును తప్పనిసరి చేసిన సీఎంను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ప్రేక్షకులు మంచిని ఆదరిస్తారు: కేసీఆర్ ‘‘మనమంతా ఎంతో గర్వపడే ఏఎన్ఆర్ అవార్డును తెలుగుబిడ్డగా అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించిన రాజమౌళిగారికి ఈ రోజు అందించడం చాలా సార్థకంగా ఉందని భావిస్తున్నా. ఆయన తక్కువ సినిమాలు తీసినా.. అన్నీ హిట్లే. ‘బాహుబలి’ సినిమా అద్భుత కళాఖండం. దాన్ని ముందు హిందీలో తర్వాత తెలుగులో చూశా. రాజమౌళి తెలుగులో కూడా అధిక బడ్జెట్ పెట్టి సినిమాలు తీయొచ్చని ట్రెండ్‌సెట్ చేశారు’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. ‘‘ఇంతమంది సినీ పెద్దల సమక్షంలో ఏఎన్ఆర్ గురించి నేను ఏమని మాట్లాడేది. ఆయన సినిమాలు, అందులోని పాటలు, సాహిత్యం అద్భుతం. పాత ట్రెండ్ మారుతోందనే సందర్భంలో ‘శంకరాభరణం’ సినిమా వచ్చింది. తొలుత పట్టించుకోకున్నా అది మూడు వందల రోజులు ఆడింది. ప్రేక్షకులు మంచిని ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారు. తెలుగు భాషను మనం కాపాడాలి. సాహిత్యం, సామాజిక విలువలతో కూడిన ఒక్క పాటైనా సినిమాల్లో పెట్టాలని కోరు తున్నా’’ అని అన్నారు. ‘‘ఆ రోజుల్లోనే హైదరాబాద్‌కు ధైర్యంగా వచ్చి అన్నపూర్ణ స్టూడియో కట్టి తెలుగు సినిమా ఇక్కడికి తరలివచ్చేందుకు శ్రీకారం చుట్టిన ఆద్యులు ఏఎన్ఆర్. ఆ తర్వాత ఎన్టీఆర్, కృష్ణ, రామా నాయుడు, రామోజీరావు స్టూడియోలు కట్టారు’’ అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమకు అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందన్నారు. మహాభారతంలో భీష్ముడు.. కలియుగంలో అక్కినేని: రాజమౌళి అక్కినేనికి 1974లో గుండెపోటు వచ్చినా తన విల్‌పవర్, మనోబలంతో మృత్యువుని చాలెంజ్ చేసి ఆపగలిగారని అవార్డు గ్రహీత రాజమౌళి అన్నారు. ‘‘మృత్యువుతో మాట్లాడిన వారిలో మహాభారతంలో భీష్ముడు ఉన్నారు.. కలియుగంలో అక్కినేని నాగేశ్వరరావు ఉన్నారు. అంతటి మహానుభావుడి పేరిట అవార్డుని ఈరోజు నాకు ఇస్తున్నారు. ఆ అవార్డుకి నేను అర్హుడినా అంటే కాదనే చెప్తాను. నా భుజాలపై మరింత భారం మోపుతున్నట్లు ఫీల్ అవుతున్నా. నేను ఇంకా కష్టపడాలని గుర్తు చెయ్యడానికి ఈ అవార్డు ఇస్తున్నారని అనుకుంటున్నాను’’ అని అన్నారు. ఈ కార్యక్రమం తర్వాత అక్కినేని ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ ఫిల్మ్ అండ్ మీడియా స్నాతకోత్సవం జరిగింది. ఈ వేడుకలో అక్కినేని కుటుంబ సభ్యులు వెంకట్, నాగార్జున, నాగసుశీల, సుమంత్, నాగచైతన్య, అఖిల్‌తోపాటు కె.రాఘవేంద్రరావు, జి.ఆదిశేషగిరిరావు, కె.ఎల్.నారా యణ, జగపతిబాబు, పీవీపీ, ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ, గుణ్ణం గంగరాజు పాల్గొన్నారు. -
ఆ కోరిక తీరలేదు
– నాగార్జున అక్కినేని నాగేశ్వరరావుగారు ‘దాదాసాహెబ్ ఫాల్కే జాతీయ అవార్డు’ అందుకున్నాక, ఆయన కూడా జాతీయ స్థాయిలో ఇటువంటి అవార్డును నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఇవ్వాలనుకున్నారు. ఆ ఆలోచన నుంచి వచ్చిందే ‘ఏయన్నార్ జాతీయ అవార్డు’’ అని అవార్డు కమిటీ చైర్మన్, ‘కళాబంధు’ టి. సుబ్బరామిరెడ్డి అన్నారు. 2006 నుంచి ఇస్తున్న ‘ఏయన్నార్ జాతీయ అవార్డు’కు ఈ ఏడాది దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘తాను లేకపోయినా ఎప్పటికీ ఈ అవార్డును కుటుంబ సభ్యులు అందించాలన్నదే ఏయన్నార్ కోరిక. తండ్రి మాట నిలబెట్టడానికి నాగార్జున కృషి చేస్తున్నారు. ఒకప్పుడు తెలుగువారంటే ఇతర రాష్ట్రాల్లో పెద్దగా గుర్తింపు ఉండేదికాదు. ఏయన్నార్‌గారు, ఎన్టీఆర్‌గారు జాతీయస్థాయిలో తెలుగువారి సత్తా చాటారు. ‘బాహుబలి’ సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారికి గుర్తింపు తెచ్చిన రాజమౌళికి ఈ అవార్డును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుగారి చేతుల మీదగా ఈ నెల 17న అందించనున్నాం’’ అన్నారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఏయన్నార్ అవార్డు, అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా(ఏ.ఐ.ఎస్.ఎఫ్.ఎమ్.) నాన్నగారి కల, కోరికలు. అవార్డు పంపిణీ, ఏ.ఐ.ఎస్.ఎఫ్.ఎమ్. కాన్వొకేషన్ ఫంక్షన్లను కలిపి నాన్న పుట్టినరోజున (సెప్టెంబర్ 20) చేయాలనుకున్నాం. కానీ, వెంకయ్యనాయుడిగారికి 17న వచ్చే వీలు ఉండటంతో అదే రోజు చేస్తున్నాం. ఈ ఏడాది రాజమౌళికి నాన్నగారి అవార్డు ఇస్తుండటం చాలా హ్యాపీగా ఉంది. ఆయనతో పనిచేయాలన్న నా కోరిక తీరలేదు. కానీ, ‘రాజన్న’ సినిమాలో కొన్ని సీన్స్‌ని రాజమౌళి డైరెక్ట్ చేశారు. తెలుగువారు గర్వపడే సినిమా తీసిన ఆయన నిజంగా బాహుబలే’’ అన్నారు. ‘‘ఏ.ఐ.ఎస్.ఎఫ్.ఎమ్. ను అక్కినేనిగారు ఏ ఆశయంతో నెలకొల్పారో ఆ ఆశయం నెరవేరుతోంది. ఈ స్కూల్లో ప్రవేశం కోసం ఇండియా నుంచే కాకుండా, ఇతర దేశాల నుంచి విద్యార్థులు వస్తున్నారు’’ అని అమల అన్నారు. -
చిత్రనగరిగా భాగ్యనగరం
* ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఉద్ఘాటన * హైదరాబాద్‌ను సినిమా రంగానికి ఆలవాలంగా మారుస్తాం * బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌కు ఏఎన్నార్ జాతీయ పురస్కారం ప్రదానం చేసిన సీఎం సాక్షి, హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో సుస్థిరంగా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. భాగ్యనగరాన్ని తెలుగు చిత్ర రంగానికి ఆలవాలంగా మార్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. ‘అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో అక్కినేని జాతీయ పురస్కారాన్ని బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్‌బచ్చన్‌కు ప్రదానం చేశారు. శనివారం సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో ఇంతకు వంద రెట్లు అభివృద్ధి చెందాల్సి ఉంది. ఇందుకు త్వరలోనే పరిశ్రమ ప్రముఖులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నం. చిత్ర పరిశ్రమను మరింత అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వం అనుసరించాల్సిన చర్య లు, అందించాల్సిన రాయితీలు తదితరాలపై అం దులో సమగ్రంగా చర్చిస్తం. వారి సూచనలకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేస్తాం’’ అని చెప్పా రు. చిత్ర పరిశ్రమతో సన్నిహిత సంబంధాలున్న నగర నేత తలసాని శ్రీనివాసయాదవ్‌కు ఇదే ఉద్దేశంతో సినిమాటోగ్రఫీ శాఖను అప్పగించామన్నా రు. ‘ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కుదురుకుంటోంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపు జరిగిం ది. ఇక దర్జాగా పాలన సాగబోతోంది’ అన్నారు. వారు సాటిలేని మేటి నటులు భారతదేశ నటుల్లో అక్కినేని, అమితాబ్ సాటిలేని మేటి నటులని సీఎం కొనియాడారు. హైదరాబాద్‌కు తెలుగు సినీపరిశ్రమ తరలి రావడానికి అక్కినేనే ముఖ్య కారకులనేది చారిత్రక సత్యమన్నారు. తొలుత నగరంలోని చికోటి గార్డెన్స్‌కు వచ్చి సినీ పరిశ్రమ తరలేందుకు ఆయన పునాది వేశారని, ఆ తర్వాత బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌కు నివాసాన్ని మార్చుకున్నారని పేర్కొన్నారు. ఆయన వల్ల ఇప్పుడు ముంబై కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ సినిమాలు రూపొందే స్థితి వచ్చిందన్నారు. అలసటగా ఉంటే ‘అభిమాన్’ చూస్తా అద్భుత నటనా కౌశలాన్ని పుణికి పుచ్చుకున్న అమితాబ్ గురించి తాను కొత్తగా చెప్పేదేమీ లేదని, ఆయన సింగర్గాకనిపించే ‘అభిమాన్’ సినిమా అంటే తనకు అత్యంత ఇష్టమని కేసీఆర్ చెప్పారు. ‘‘పని ఒత్తిడితో నాకు అలసటగా అనిపిస్తే అభిమాన్ సినిమా చూస్తా. ఇప్పటికే యాభైసార్లు చూసి ఉంటాను’’ అని అన్నారు. ఏడు పదుల వయసులో కూడా అమితాబ్‌కు దేశవ్యాప్తంగా క్రేజ్ తగ్గలేదని, అది ఆయన గొప్పతనమని కొనియాడారు. ఒక పద్మభూషణుడి పేరుతో ఉన్న అవార్డును మరో పద్మభూషణుడికి తన చేతులతో అందించడం ఆనందంగా ఉందన్నారు. ‘ఏ’ ఆయనే.. ‘బీ’ ఆయనే: వెంకయ్య తెలుగు చిత్రరంగంలో బెంచ్‌మార్క్‌గా నిలిచిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు అయితే... హిందీ చిత్రపరిశ్రమలో ఆ స్థానం అమితాబ్కే దక్కుతుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. హీరో అంటే ముందుగా గుర్తుకువచ్చే వ్యక్తి అమితాబ్ అని, చిత్ర రంగంలో ‘ఏ’ ఆయనే, ‘బీ’ ఆయనే (అమితాబ్ బచ్చన్ పేరు సంక్షిప్త రూపం) అని అన్నారు. ఎవరైనా ఉంటే ‘సీ’గా ఉండాల్సిందేనని చమత్కరించారు. స్వరం సరిగాలేదంటూ ఆదిలో ఆలిండియా రేడియో తిరస్కరిస్తే ఆ స్వరాన్నే వరంగా మార్చుకుని సినిమారంగంలో అగ్రహీరోగా మారిన నటుడు అమితాబ్ అని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఉన్నవారు కొందరిని దూరం చేసుకుంటారని, కానీ ఆయన ఆ పనిచేయకుండా సినిమాల్లోకి వచ్చి అందరికీ దగ్గరయ్యారన్నారు. 91 ఏళ్ల జీవితంలో 75 ఏళ్లు నటుడిగా కొనసాగిన ఏకైన వ్యక్తిగా అక్కినేని చరిత్రలో నిలిచిపోతారని కీర్తించారు. అప్పట్లో సినిమా చూస్తుంటే మనసు ఉల్లాసంగా ఉండేదని, ఇప్పుడు సంగీతం, సాహిత్యం తక్కువ... వాయిద్యం వాయింపు ఎక్కువగా ఉందన్నారు. శృంగారాన్ని కళ్లు, నటన, మాటలు, ముఖ కవళికలతో అక్కినేని పలికించేవారని, కానీ ఇప్పుడు తాకి, తొ క్కి, తిరగేసి, కిందపడేసి చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హింస, అసభ్యత తగ్గాలన్నారు. జలగం గుర్తొస్తున్నారు: సుబ్బరామిరెడ్డి రాచకొండను అద్భుత చిత్రనగరిగా రూపొందిం చేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే... తెలుగు చిత్రపరిశ్రమ హైదరాబాద్‌కు తరలేందుకు ఎంతో కృషి చేసిన అప్పటి సీఎం జలగం వెంగళరావు గుర్తుకొస్తున్నారని ఎంపీ సుబ్బరామిరెడ్డి కొనియాడారు. కార్యక్రమంలో అక్కినేని కుటుంబ సభ్యులు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్‌తో బిగ్‌బీ భేటీ బాలీవుడ్ నటుడు అమితాబ్‌బచ్చన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. బేగంపేటలోని సీఎం అధికార నివాసంలో బిగ్‌బీ.. సీఎంను కలుసుకున్నారు. అమితాబ్ వెంట సినీ నటుడు అక్కినేని నాగార్జున ఉన్నారు. దాదాపు అర గంటపాటు వీరు పలు అంశాలపై చర్చించుకున్నట్లు తెలిసింది. మర్యాదపూర్వకంగా తనను కలిసేందుకు వచ్చిన అమితాబ్‌ను కేసీఆర్ శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అమితాబ్‌తో జరిగిన భేటీలో ముఖ్యమంత్రితో పాటు ఆయన కూతురు, ఎంపీ కవిత కూడా ఉన్నారు. లాఠీచార్జి తర్వాత చీపురుపుల్లతో కొట్టినట్టు.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డి మాట్లాడిన తర్వాత కేసీఆర్ ప్రసంగించారు. స్వతహాగా ప్రాసలు, విరుపులతో వెంకయ్య మాట్లాడగా... సుబ్బరామిరెడ్డి తన ప్రసంగంలో శివుడి శ్లోకాలను పఠించారు. దీంతో కేసీఆర్ మైకువద్దకు వస్తూనే ‘‘సుబ్బరామిరెడ్డి శ్లోకాలు, వెంకయ్యనాయుడి ప్రాసలు విన్న తర్వాత నేను మాట్లాడితే పోలీసు లాఠీచార్జి తర్వాత చీపురుపుల్లతో కొట్టినట్టు ఉంటుంది వ్యవహారం’’ అని చమత్కరించడంతో సభలో నవ్వులు పూశాయి. మరవలేను: అమితాబ్ దేశం గర్వించదగ్గ అక్కినేని పేరుతో ఉన్న పురస్కారాన్ని అందుకోవడం తన జీవితంలో మరచిపోలేని అనుభూతి అని అమితాబ్ అన్నారు. చలనచిత్ర రంగానికి అక్కినేని హుందాతనాన్ని తెచ్చారని, నటుడిగా గొప్ప స్థానంలో ఉండి కూడా సాధారణ జీవితాన్ని గడిపి... ఒదిగి ఉండే లక్షణాన్ని మనకు నేర్పారని అన్నారు. ఆయన జీవితాన్ని ఓ పాఠంగా చదువుకోవాల్సిన అవసరం నేటి తరానికి ఉందన్నారు. ఆయనలాంటి వారి వల్ల తెలుగు చిత్రసీమ ఇప్పుడు దేశంలో గొప్పగా వర్ధిల్లుతోందన్నారు. సమాజానికి ఎంతో చేయాలని ఆయన తపించారన్నారు. ఆ తత్వం న టులకి అవసరమని, అందుకే పోలి యో నిర్మూలనకు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారకర్తగా పనిచేశానని చెప్పారు. అలాగే టీబీని కూడా దేశం నుంచి తరమాల్సిన అవసరం ఉందని, దాని బాధేంటో తాను స్వయంగా అనుభవించానని పేర్కొన్నారు. అక్కినేని వారసులు ఆయన ఆశయాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తున్నారని అభినందించారు. తెలుగు చిత్రరంగ అభివృద్ధికి తన వంతు సాయం అందించేందుకు ఎల్లవేళలా సిద్ధమని ప్రకటించారు. బాలీవుడ్ కంటే టాలీవుడ్లోనే ఎక్కువ సినిమాలు రూపొందుతున్నాయని, అక్కినేని లాంటి లెజెండ్స్ తెలుగు పరిశ్రమ నుంచి రావాలని ఆకాంక్షించారు.