* ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఉద్ఘాటన
* హైదరాబాద్‌ను సినిమా రంగానికి ఆలవాలంగా మారుస్తాం
* బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌కు ఏఎన్నార్ జాతీయ పురస్కారం ప్రదానం చేసిన సీఎం
సాక్షి, హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో సుస్థిరంగా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. భాగ్యనగరాన్ని తెలుగు చిత్ర రంగానికి ఆలవాలంగా మార్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. ‘అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో అక్కినేని జాతీయ పురస్కారాన్ని బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్‌బచ్చన్‌కు ప్రదానం చేశారు. శనివారం సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై పురస్కారాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో ఇంతకు వంద రెట్లు అభివృద్ధి చెందాల్సి ఉంది. ఇందుకు త్వరలోనే పరిశ్రమ ప్రముఖులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నం. చిత్ర పరిశ్రమను మరింత అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వం అనుసరించాల్సిన చర్య లు, అందించాల్సిన రాయితీలు తదితరాలపై అం దులో సమగ్రంగా చర్చిస్తం. వారి సూచనలకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేస్తాం’’ అని చెప్పా రు. చిత్ర పరిశ్రమతో సన్నిహిత సంబంధాలున్న నగర నేత తలసాని శ్రీనివాసయాదవ్‌కు ఇదే ఉద్దేశంతో సినిమాటోగ్రఫీ శాఖను అప్పగించామన్నా రు. ‘ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కుదురుకుంటోంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపు జరిగిం ది. ఇక దర్జాగా పాలన సాగబోతోంది’ అన్నారు.
వారు సాటిలేని మేటి నటులు
భారతదేశ నటుల్లో అక్కినేని, అమితాబ్ సాటిలేని మేటి నటులని సీఎం కొనియాడారు. హైదరాబాద్‌కు తెలుగు సినీపరిశ్రమ తరలి రావడానికి అక్కినేనే ముఖ్య కారకులనేది చారిత్రక సత్యమన్నారు. తొలుత నగరంలోని చికోటి గార్డెన్స్‌కు వచ్చి సినీ పరిశ్రమ తరలేందుకు ఆయన పునాది వేశారని, ఆ తర్వాత బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌కు నివాసాన్ని మార్చుకున్నారని పేర్కొన్నారు. ఆయన వల్ల ఇప్పుడు ముంబై కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ సినిమాలు రూపొందే స్థితి వచ్చిందన్నారు.
అలసటగా ఉంటే ‘అభిమాన్’ చూస్తా
అద్భుత నటనా కౌశలాన్ని పుణికి పుచ్చుకున్న అమితాబ్ గురించి తాను కొత్తగా చెప్పేదేమీ లేదని, ఆయన సింగర్‌గాకనిపించే ‘అభిమాన్’ సినిమా అంటే తనకు అత్యంత ఇష్టమని కేసీఆర్ చెప్పారు. ‘‘పని ఒత్తిడితో నాకు అలసటగా అనిపిస్తే అభిమాన్ సినిమా చూస్తా. ఇప్పటికే యాభైసార్లు చూసి ఉంటాను’’ అని అన్నారు. ఏడు పదుల వయసులో కూడా అమితాబ్‌కు దేశవ్యాప్తంగా క్రేజ్ తగ్గలేదని, అది ఆయన గొప్పతనమని కొనియాడారు. ఒక పద్మభూషణుడి పేరుతో ఉన్న అవార్డును మరో పద్మభూషణుడికి తన చేతులతో అందించడం ఆనందంగా ఉందన్నారు.
‘ఏ’ ఆయనే.. ‘బీ’ ఆయనే: వెంకయ్య
తెలుగు చిత్రరంగంలో బెంచ్‌మార్క్‌గా నిలిచిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు అయితే... హిందీ చిత్రపరిశ్రమలో ఆ స్థానం అమితాబ్‌కే దక్కుతుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. హీరో అంటే ముందుగా గుర్తుకువచ్చే వ్యక్తి అమితాబ్ అని, చిత్ర రంగంలో ‘ఏ’ ఆయనే, ‘బీ’ ఆయనే (అమితాబ్ బచ్చన్ పేరు సంక్షిప్త రూపం) అని అన్నారు. ఎవరైనా ఉంటే ‘సీ’గా ఉండాల్సిందేనని చమత్కరించారు. స్వరం సరిగాలేదంటూ ఆదిలో ఆలిండియా రేడియో తిరస్కరిస్తే ఆ స్వరాన్నే వరంగా మార్చుకుని సినిమారంగంలో అగ్రహీరోగా మారిన నటుడు అమితాబ్ అని పేర్కొన్నారు.
రాజకీయాల్లో ఉన్నవారు కొందరిని దూరం చేసుకుంటారని, కానీ ఆయన ఆ పనిచేయకుండా సినిమాల్లోకి వచ్చి అందరికీ దగ్గరయ్యారన్నారు. 91 ఏళ్ల జీవితంలో 75 ఏళ్లు నటుడిగా కొనసాగిన ఏకైన వ్యక్తిగా అక్కినేని చరిత్రలో నిలిచిపోతారని కీర్తించారు. అప్పట్లో సినిమా చూస్తుంటే మనసు ఉల్లాసంగా ఉండేదని, ఇప్పుడు సంగీతం, సాహిత్యం తక్కువ... వాయిద్యం వాయింపు ఎక్కువగా ఉందన్నారు. శృంగారాన్ని కళ్లు, నటన, మాటలు, ముఖ కవళికలతో అక్కినేని పలికించేవారని, కానీ ఇప్పుడు తాకి, తొ క్కి, తిరగేసి, కిందపడేసి చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హింస, అసభ్యత తగ్గాలన్నారు.
జలగం గుర్తొస్తున్నారు: సుబ్బరామిరెడ్డి
రాచకొండను అద్భుత చిత్రనగరిగా రూపొందిం చేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే... తెలుగు చిత్రపరిశ్రమ హైదరాబాద్‌కు తరలేందుకు ఎంతో కృషి చేసిన అప్పటి సీఎం జలగం వెంగళరావు గుర్తుకొస్తున్నారని ఎంపీ సుబ్బరామిరెడ్డి కొనియాడారు. కార్యక్రమంలో అక్కినేని కుటుంబ సభ్యులు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్‌తో బిగ్‌బీ భేటీ
బాలీవుడ్ నటుడు అమితాబ్‌బచ్చన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. బేగంపేటలోని సీఎం అధికార నివాసంలో బిగ్‌బీ.. సీఎంను కలుసుకున్నారు. అమితాబ్ వెంట సినీ నటుడు అక్కినేని నాగార్జున ఉన్నారు. దాదాపు అర గంటపాటు వీరు పలు అంశాలపై చర్చించుకున్నట్లు తెలిసింది. మర్యాదపూర్వకంగా తనను కలిసేందుకు వచ్చిన అమితాబ్‌ను కేసీఆర్ శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అమితాబ్‌తో జరిగిన భేటీలో ముఖ్యమంత్రితో పాటు ఆయన కూతురు, ఎంపీ కవిత కూడా ఉన్నారు.
లాఠీచార్జి తర్వాత చీపురుపుల్లతో కొట్టినట్టు..
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డి మాట్లాడిన తర్వాత కేసీఆర్ ప్రసంగించారు. స్వతహాగా ప్రాసలు, విరుపులతో వెంకయ్య మాట్లాడగా... సుబ్బరామిరెడ్డి తన ప్రసంగంలో శివుడి శ్లోకాలను పఠించారు. దీంతో కేసీఆర్ మైకువద్దకు వస్తూనే ‘‘సుబ్బరామిరెడ్డి శ్లోకాలు, వెంకయ్యనాయుడి ప్రాసలు విన్న తర్వాత నేను మాట్లాడితే పోలీసు లాఠీచార్జి తర్వాత చీపురుపుల్లతో కొట్టినట్టు ఉంటుంది వ్యవహారం’’ అని చమత్కరించడంతో సభలో నవ్వులు పూశాయి.
మరవలేను: అమితాబ్
దేశం గర్వించదగ్గ అక్కినేని పేరుతో ఉన్న పురస్కారాన్ని అందుకోవడం తన జీవితంలో మరచిపోలేని అనుభూతి అని అమితాబ్ అన్నారు. చలనచిత్ర రంగానికి అక్కినేని హుందాతనాన్ని తెచ్చారని, నటుడిగా గొప్ప స్థానంలో ఉండి కూడా సాధారణ జీవితాన్ని గడిపి... ఒదిగి ఉండే లక్షణాన్ని మనకు నేర్పారని అన్నారు. ఆయన జీవితాన్ని ఓ పాఠంగా చదువుకోవాల్సిన అవసరం నేటి తరానికి ఉందన్నారు. ఆయనలాంటి వారి వల్ల తెలుగు చిత్రసీమ ఇప్పుడు దేశంలో గొప్పగా వర్ధిల్లుతోందన్నారు. సమాజానికి ఎంతో చేయాలని ఆయన తపించారన్నారు. ఆ తత్వం న టులకి అవసరమని, అందుకే పోలి యో నిర్మూలనకు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారకర్తగా పనిచేశానని చెప్పారు.
అలాగే టీబీని కూడా దేశం నుంచి తరమాల్సిన అవసరం ఉందని, దాని బాధేంటో తాను స్వయంగా అనుభవించానని పేర్కొన్నారు. అక్కినేని వారసులు ఆయన ఆశయాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తున్నారని అభినందించారు. తెలుగు చిత్రరంగ అభివృద్ధికి తన వంతు సాయం అందించేందుకు ఎల్లవేళలా సిద్ధమని ప్రకటించారు. బాలీవుడ్ కంటే టాలీవుడ్‌లోనే ఎక్కువ సినిమాలు రూపొందుతున్నాయని, అక్కినేని లాంటి లెజెండ్స్ తెలుగు పరిశ్రమ నుంచి రావాలని ఆకాంక్షించారు.
చిత్రనగరిగా భాగ్యనగరం
Published Sun, Dec 28 2014 1:15 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement
Advertisement