అమల, బోనీకపూర్, టి. సుబ్బరామిరెడ్డి, నాగార్జున, రేఖ, చిరంజీవి, నాగసుశీల
‘‘అందం, అభినయంతో సూపర్‌స్టార్స్ అయిన రేఖ, శ్రీదేవిగార్లకు అక్కినేని నాగేశ్వరరావుగారి అవార్డుని నా చేతులమీదుగా ఇవ్వడం నా అదృష్టం. వారిద్దరూ భారతదేశం గర్వించదగ్గ నటీమణులు’’ అని చిరంజీవి అన్నారు. 2018, 2019 సంవత్సరాలకు ‘అక్కినేని జాతీయ అవార్డు’లకు శ్రీదేవి, రేఖలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథి చిరంజీవి చేతులమీదుగా రేఖ తీçసుకోగా, శ్రీదేవి అవార్డును ఆమె భర్త బోనీకపూర్ స్వీకరించారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ– ‘‘మా అమ్మ అంజనాదేవిగారికి నాగేశ్వరరావుగారంటే చాలా ఇష్టం. నిండు గర్భవతిగా ఉన్నప్పుడు ఆయన నటించిన ‘రోజులు మారాయి’ సినిమా చూశారు. ఆ టైంలో అమ్మ కడుపులో ఉన్నది నేనే. అందుకేనేమో.. నాకూ సినిమాలంటే ఇష్టం కలిగింది. చదువు అయిపోయాక ఇండస్ట్రీలోకి వచ్చా. అది కూడా నాగేశ్వరరావుగారు, రామారావుగారు వంటి లెజెండ్స్ టైమ్‌లో. ‘మెకానిక్ అల్లుడు’ సినిమాలో నాగేశ్వరరావుగారితో నటించడం అద్భుతమైన జ్ఞాపకం.
నేను క్రమశిక్షణగా ఉన్నానంటే అది ఆయన వల్లే.. ఓ రకంగా నా గురుతుల్యులు. ఆయన నడిచే నిఘంటువు. నటనలో ఒక ఎన్‌సైక్లోపీడియా. ‘ఏయన్నార్ జాతీయ అవార్డు’ ఏదో ఒక రోజు ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు’ అంత గొప్ప స్థాయికి చేరుకుంటుందనడంలో సందేహం లేదు. శ్రీదేవి, రేఖగార్లు మనందరం గర్వించే స్థాయిలో ఉన్నారు. అన్ని భారతీయ భాషల్లో సినిమాలు చేసిన శ్రీదేవిగారు ‘ఇండియా లేడీ సూపర్‌స్టార్’ అయ్యారు. రేఖగారిపై నాకున్న అభిమానంతో నా భార్య సురేఖని ఇప్పటికీ రేఖ అనే పిలుస్తుంటా.. ఆ విషయం తనకి తెలియదు(నవ్వుతూ)’’ అన్నారు.
రేఖ మాట్లాడుతూ – ‘‘నా తొలి సినిమా, తెలుగు సినిమా ‘ఇంటిగుట్టు’. శ్రీదేవిగారు గొప్పనటి. ఆమెలా ఉండాలి. నా జీవితంలో తొలిసారి చూసిన సినిమా ‘సువర్ణ సుందరి’. అంజలీదేవిగారి ‘అమ్మకోసం’ సినిమాతో నాకు బ్రేక్ వచ్చింది. నేను ఇక్కడ ఉన్నానంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా నాగేశ్వరరావుగారు, అంజలి అత్తయ్యే కారణం. ‘సువర్ణసుందరి’ సినిమా వందసార్లు చూసి ఉంటాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. నేనూ చూశాను. ముంబైలో ఉన్నప్పుడు టి.రామారావుగారు, పూర్ణచంద్రరావుగారు, దాసరి నారాయణరావుగారు, కె.విశ్వనాథ్‌గారు, జితేందర్‌గారు ఇక్కడ సినిమాలు చేయమని పిలిచేవారు. మా అమ్మ చెప్పిన మాట ప్రకారం మరో తెలుగు సినిమా తప్పకుండా చేస్తా’’ అన్నారు.
‘ఏయన్నార్ జాతీయ అవార్డు’ కమిటీ చైర్మన్ టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ – ‘‘ఈ వేడుక సందడి చూస్తుంటే అక్కినేనిగారి చిరునవ్వును చూసినట్లుంది. నాకు, ఏయన్నార్‌గారికి వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ క్లాస్‌మేట్స్‌లా ఉండేవాళ్లం. అందంతో పాటు మంచి మనసున్న నటి శ్రీదేవి. 35 ఏళ్ల క్రితం రేఖ ఎంత అందంగా ఉన్నారో ఇప్పుడూ అంతే అందంగా ఉన్నారు. నాగేశ్వరరావుగారు, ఎన్టీఆర్, చిరంజీవి, నాగా ర్జున వంటి వారి నుంచి నేటితరం నటీనటులు నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి’’ అన్నారు.
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ– ‘‘నాన్నగారి సంకల్పమే మమ్మల్ని నడిపిస్తోంది. ఆయన ఆలోచనలే మేము ఆచరిస్తున్నాం. శ్రీదేవి, రేఖగార్లకు ఈ అవార్డులు ఇవ్వాలని నాన్న ఎప్పుడూ చెబుతూనే ఉండేవారు. ఆయన ఉన్నప్పుడు ఇవ్వలేకపోయాం. కానీ తెలుగు సినిమా ఉన్నంత వరకు అక్కినేని నాగేశ్వరరావుగారు ఉంటారు. ఈ వేదికమీదున్న అవార్డుతో పాటు నాన్న కూడా ఇక్కడే మనమధ్యే ఉంటారు. శ్రీదేవిగారితో నేను నాలుగు సినిమాలు చేశా. బోనీకపూర్‌గారు భర్తగా లభించడం శ్రీదేవిగారి అదృష్టం. అక్కినేనిగారు, శ్రీదేవిగారు ఎప్పటికీ జీవించే ఉంటారు. రేఖగారు, శ్రీదేవిగారు ఇద్దరూ తెలుగువాళ్లే.. ఇద్దరూ ఇండియా సూపర్‌స్టార్సే.. ఇది మనకు గర్వకారణం’’ అన్నారు.
ఈ వేడుకలో బ్రహ్మానందం, నాగచైతన్య, విజయ్ దేవరకొండ, అఖిల్, సుమంత్, సుశాంత్, శ్రీకాంత్, కార్తికేయ, అడివి శేష్, అమల, సుప్రియ, మంచు లక్ష్మీతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment