'నాలో నటిని కనుగొన్నది ఆయనే'
దివంగత సీనియర్ దర్శకుడు కె.బాలచందర్ అంటే.. అలనాటి హీరోయిన్ రతి అగ్నిహోత్రికి ప్రత్యేకమైన అభిమానం, గౌరవం. తెలుగులో వచ్చిన 'మరోచరిత్ర'ను హిందీలో 'ఏక్ దూజే కే లియే'గా రీమేక్ చేసినప్పుడు అందులో హీరోయిన్గా రతి అగ్నిహోత్రిని ఎంపిక చేసింది ఆయనే. ఆ సినిమా 1981లో విడుదలైంది. అందులో కమల్ హాసన్ సరసన నటించిన రతి అగ్నిహోత్రి.. ఆ తర్వాత బాలీవుడ్లో బ్రహ్మాండమైన స్థాయికి వెళ్లిపోయింది. ఇప్పుడు బాలచందర్ ఈ లోకంలో లేరంటే.. ఆమె నమ్మలేకపోతోంది.
కొన్ని రోజుల క్రితం తాను పంజాబ్లో ఓ సినిమా షూటింగులో ఉండగా, చెన్నై నుంచి ఫోన్ వచ్చిందని రతి అగ్నిహోత్రి తెలిపింది. బాలచందర్తో పాటు.. భారతీరాజాను సన్మానిస్తున్నామని, ఆ కార్యక్రమానికి 1970లు, 80లలో వాళ్లతో కలిసి చేసిన నటీనటులు, సాంకేతికవర్గం అంతటినీ పిలుస్తున్నామన్నది ఆ ఫోన్ సారాంశం. అయితే, సరిగ్గా ఆ సన్మానం జరిగే సమయానికి తన తల్లికి తీవ్ర అనారోగ్యంగా ఉండటంతో ఆమెతోపాటు తాను ఉండిపోవాల్సి వచ్చి.. తాను వెళ్లలేకపోయినట్లు రతి తెలిపింది. తనకు తమిళంలో తొలి సినిమా చాన్సు భారతీరాజా, హిందీలో బాలచందర్ ఇచ్చారని.. అందుకు తనను తాను చాలా అదృష్టవంతురాలిగా భావిస్తానని చెప్పింది. ఇప్పుడు బాలచందర్ లేరంటే అది తీరని లోటని రతి అగ్నిహోత్రి వాపోయింది.