
స్టయిలిష్ డిక్టేటర్!
అతను పవర్‌ఫుల్ డిక్టేటర్. సమాజ శ్రేయస్సు కోసం ఏం చేయాలో డిక్టేట్ చేసేటప్పుడు హుందాగా ఉంటాడు. గాళ్ ఫ్రెండ్‌తో రొమాన్స్ చేసేటప్పుడు మంచి లవర్‌లా మారిపోతాడు. ప్రత్యర్థులను అంతం చేయాలనుకున్నప్పుడు రెచ్చిపోతాడు. ఈ అన్ని పార్శ్వాల్లోనూ స్టయిలిష్‌గా కనిపిస్తాడు. అందుకే ఈ డిక్టేటర్ అందరికీ నచ్చుతాడని శ్రీవాస్ అంటున్నారు. నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్‌లో శ్రీవాస్ దర్శకత్వంలో వేదాశ్వ క్రియేషన్స్‌తో కలిసి ఈరోస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘డిక్టేటర్’. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష కథానాయికలు.
దసరా కానుకగా అభిమానుల కోసం ఈ చిత్రంలో బాలయ్యకు సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు. ‘శుభాకాంక్షలతో మీ బాలకృష్ణ’ అంటూ ఫొటో పై సంతకం ద్వారా అభిమానులను పలకరించారు బాలకృష్ణ. ‘‘ఇంతకుముందు ఏ చిత్రంలోనూ కనిపించనంత స్టయిలిష్‌గా ఈ చిత్రంలో బాలయ్య కనిపిస్తారు. యూత్, ఫ్యామిలీస్‌కి నచ్చే యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఈరోస్ సంస్థ వెనకాడకుండా నిర్మిస్తుండటంతో ఇప్పటివరకూ జరిపిన షూటింగ్ క్వాలిటీగా వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తున్నాం.
తదుపరి షెడ్యూల్‌ను యూరప్‌లో జరపనున్నాం. అక్కడ కొంత టాక్టీ, యాక్షన్ సీన్స్, సాంగ్స్ చిత్రీకరించాలనుకుంటున్నాం’’ అని శ్రీవాస్ చెప్పారు. ‘‘తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి చూస్తోంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఈ ట్రెండ్ చాలా బాగుంది. ‘శ్రీమంతుడు’వంటి భారీ విజయవంతమైన చిత్రంతో అసోసియేట్ అయిన తర్వాత ‘డిక్టేటర్’ చిత్రాన్ని నిర్మించడం మరింత ఆనందంగా ఉంది’’ అని ఈరోస్ మ్యానేజింగ్ డెరైక్టర్ సునీల్ లుల్లా అన్నారు.