సరికొత్త స్టెప్స్‌లో...
ఓ సూపర్‌హిట్ కాంబినేషన్ రిపీట్ అయితే ఎలాంటి భారీ అంచనాలు ఉంటాయో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న ‘లెజెండ్’పై అలాంటి అంచనాలే ఉన్నాయి. బాలయ్య హీరోగా ‘సింహా’లాంటి సంచలన విజయాన్ని అందించిన బోయపాటి ప్రస్తుతం ‘లెజెండ్’లో ఆయన్ను సరికొత్త లుక్‌లో ఆవిష్కరించనున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన బాలయ్య ఫస్ట్ లుక్ అందర్నీ ఆకట్టుకుంది. ఈ లుక్ కోసం బాలయ్య బరువు కూడా తగ్గారు. ఇందులో జగపతిబాబు ప్రతినాయకుడి పాత్ర చేయడం విశేషం.
బాలయ్య సరసన రాధికా ఆప్టే, సొనాల్ చౌహాన్ కథానాయికలు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ పాటలు స్వరపరిచారు. బాలయ్య సినిమాకి దేవి పాటలివ్వడం ఇదే తొలిసారి. దేవి పాటలు ఎంత హుషారుగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో.. బాలయ్య సరికొత్త స్టెప్స్ వేసి ఉంటారన్నది అభిమానుల అంచనా. ఈ పాటలను వచ్చే నెల 7న విడుదల చేయనున్నారు. శిల్పకళా వేదికలో అభిమానుల సమ క్షంలో ఈ వేడుక జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.