భాగ్‌ అఖ్తర్‌ భాగ్‌ | Bhag Akhtar Bhag | Sakshi
Sakshi News home page

భాగ్‌ అఖ్తర్‌ భాగ్‌

Published Thu, Feb 16 2017 11:07 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

భాగ్‌ అఖ్తర్‌ భాగ్‌ - Sakshi

భాగ్‌ అఖ్తర్‌ భాగ్‌

మిల్కా సింగ్‌ బయోపిక్‌ చేసిన హీరో ఫర్హాన్‌ అఖ్తర్‌. హీరో అవక ముందు ఇతని పెన్ను పరిగెత్తేది. భాగ్‌ మిల్కా భాగ్‌ తర్వాత కెరియర్‌ పరిగెడుతోంది. మరి పరిగెత్తేటప్పుడు పడకుండా ఉంటారా?పడకుండా ఉండము. పడి లేచి పరిగెత్తినవాడే ఫర్హాన్‌ అఖ్తర్‌. భాగ్‌ అఖ్తర్‌ భాగ్‌.

రచయిత జావేద్‌ అఖ్తర్‌ కుమారుడు. ∙నృత్య దర్శకురాలు ఫర్హా ఖాన్‌ ఇతనికి పిన్ని కూతురు. ∙‘జిందగీ నా మిలేగీ దుబారా’ దర్శకురాలు జోయా ఇతడి సోదరి.
తండ్రిలానే తనూ విడాకులు తీసుకున్నాడు.
‘భాగ్‌ మిల్కా భాగ్‌’తో ఎనలేని కీర్తి.
నటుడుగా, దర్శకుడిగా, నిర్మాతగా బాలీవుడ్‌లో సమున్నత స్థానం.

నలుగురు పిల్లలు ఆడుకుంటున్నారు.
‘నేను సూపర్‌మేన్‌’ అన్నాడు ఒక పిల్లవాడు.
‘నేను స్పైడర్‌మేన్‌’ అన్నాడు ఇంకో పిల్లవాడు.
‘నేను బేట్‌మేన్‌’ అన్నాడు మరో పిల్లవాడు.
నాలుగో పిల్లవాడికి ఈ మేన్‌ల మేనియా లేదు. అతడికి తెలిసిన అతడు ఇష్టపడే సూపర్‌మేన్‌ ఒక్కడే– అమితాబ్‌ బచ్చన్‌.
‘నేను అమితాబ్‌బచ్చన్‌’ అన్నాడు ధీమాగా.
కాని మొదటి పిల్లవాడికి కోపం వచ్చింది.
‘నో.. నేనే అమితాబ్‌ బచ్చన్‌. నువ్వు సూపర్‌మేన్‌ వేషం వెయ్యి’ అన్నాడు.
‘నో.. నేనే అమితాబ్‌ బచ్చన్‌’
‘కుదరదు’
‘ఏం?’
‘ఏం అంటే ఆయన మా నాన్న కాబట్టి. మా నాన్న వేషం వేసే హక్కు నాకే ఉంది’
నాలుగో పిల్లవాడు నీరసంగా అంగీకరించాడు.
ఎందుకంటే మొదటి పిల్లవాడి పేరు అభిషేక్‌ బచ్చన్‌. నాలుగో పిల్లవాడి పేరు ఫర్హాన్‌ అఖ్తర్‌.
చిన్నప్పటి ఆట అది.
కానీ ఆటలో అమితాబ్‌ బచ్చన్‌ కాలేని ఫర్హాన్‌ పెద్దయ్యాక అదే అమితాబ్‌ బచ్చన్‌ను డైరెక్ట్‌ చేశాడు ‘లక్ష్య’ సినిమా కోసం.
పెద్ద సక్సెస్‌ ఇది.
కానీ దీని స్క్రిప్ట్‌ మాత్రం అంత సులువుగా లేదు.

జావేద్‌ అఖ్తర్‌ స్క్రిప్ట్స్‌ బాగా రాస్తాడు. అయితే తన పిల్లవాళ్ల బాల్యపు స్క్రిప్ట్‌ను అతడు అంత బాగా రాయలేకపోయాడు. గట్టిగా చెప్పాలంటే  ఆ స్క్రిప్ట్‌ను డిస్ట్రబ్‌ చేశాడు. గందరగోళం పాలు చేశాడు. జావేద్‌ అఖ్తర్‌ భార్య పేరు హనీ ఇరానీ. ఈమె బాలనటి. టీనేజ్‌లో కూడా సినిమాల్లో నటించింది. హేమమాలిని డబుల్‌ యాక్షన్‌ చేసిన ‘సీతా ఔర్‌ గీతా’లో ఈమె చిన్న పాత్ర పోషించింది. ఆ సినిమాకు సలీమ్‌–జావేద్‌ రచయితలు. జావేద్‌కు అలా హనీ పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. వాళ్లు 1972లో పెళ్లి చేసుకున్నారు. అప్పటికి జావేద్‌ పెద్ద స్టార్‌ రైటర్‌ కాలేదు.

‘జంజీర్‌’, ‘షోలే’, ‘దీవార్‌’ వంటి సినిమాలు విడుదల కావాల్సి ఉంది. అయ్యాయి. సలీమ్‌ జావేద్‌లు ఆ రోజుల్లోనే సూపర్‌స్టార్‌ల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్‌ అంటే ఒక్కో సినిమాకి లక్ష రూపాయలు తీసుకునేవారు. ఈలోపు హనీ ఇరానీ– జావేద్‌లకు ఇద్దరు పిల్లలు పుట్టారు. పెద్దమ్మాయి జోయా. రెండో సంతానం ఫర్హాన్‌ అఖ్తర్‌. కాని ఈలోపు జావేద్‌ అఖ్తర్‌ ఎక్స్‌పోజర్‌ పెరిగింది. గొప్పగొప్పవాళ్లు అతడికి పరిచయమవుతున్నారు. అతనంటే కూడా క్రేజ్‌ ఏర్పడింది. అలా షబానా ఆజ్మీ అతడి జీవితంలోకి ప్రవేశించింది. ఆమె పుట్టిల్లు హైదరాబాద్‌ కనుక అతడు మన హైదరాబాద్‌కు అల్లుడయ్యాడు. బాగుంది కాని హనీ ఇరానీ ముక్కచెక్కలైపోయింది.

జావేద్‌ చర్యను జీర్ణించుకోలేకపోయింది. ఆస్తి అంతస్తు డబ్బు ఉన్న భర్త... కాని అతణ్ణి వదిలేసి ఇద్దరు పిల్లలతో విడిపోయింది. లేదా అతడే ఆమెను వదిలి షబానాతో వెళ్లిపోయాడు. ఫర్హాన్‌ ఆరేడేళ్ల పిల్లవాడిగా ఉన్నప్పుడు మొదలైన గొడవ అతడికి పదేళ్ల వయసు వచ్చేసరికి తల్లిదండ్రుల శాశ్వత యెడబాటుతో ముగిసింది. జావేద్‌– హనీలు లీగల్‌గా విడాకులు తీసుకున్నారు. ఫర్హాన్‌ ఇప్పుడు ఒంటరి. అక్క జోయా తప్ప అతడికి ప్రపంచంలో మరెవ్వరూ లేరు.

ఈ మొత్తం వ్యవహారంతో డిఫెన్స్‌ మెకానిజంలో భాగంగా ఫర్హాన్‌ అల్లరి పిల్లవాడైపోయాడు. తండ్రిని మిస్సవుతున్న విషాదం నుంచి బయట పడటానికి హైపర్‌ యాక్టివ్‌ అయిపోయేవాడు. గెంతేవాడు. పడేవాడు. పరిగెత్తేవాడు. వారంలో రెండుమూడుసార్లు గాయాలపాలై డాక్టర్‌ దగ్గరకు తీసుకు వెళ్లాల్సి వచ్చేది. స్కూల్లో పిల్లలతో తాను రోజూ హెలికాప్టర్‌లో వస్తానని తనను స్కూల్‌ రూఫ్‌ మీద దింపి హెలికాప్టర్‌ వెళ్లిపోతుందని అబద్ధాలు నమ్మకం కలిగేలా చెప్తే మిగిలిన పిల్లలు వాళ్ల తల్లిదండ్రులని హెలికాప్టర్‌లో దించమని గొడవ చేస్తే ఆ తల్లిదండ్రులు స్కూల్‌కు వచ్చి ఫర్హాన్‌ మీద కంప్లయింట్‌ చేయాల్సి వచ్చింది. అంతే కాదు స్కూలు ఎప్పుడు నచ్చకపోయినా ఉన్నట్టుండి స్పృహ తప్పినట్టుగా పడిపోయి ఇల్లు చేరుకునేవాడు.

చదువు సరిగా రాలేదు. డిగ్రీ అయ్యాక తల్లి లా చేయమని చేరిస్తే అటెండెన్స్‌ లేదని వాళ్లు బయటకు గెంటేశారు. ఫర్హాన్‌ తన జీవితంలో బుద్ధిగా కూచుని చేసిన పని ఒకటే ఒకటి. అది సినిమాలు చూడటం. అతడికి అత్యంత ప్రాణప్రదమైన సినిమా – ‘రేజింగ్‌ బుల్‌’. అతడికి బాగా నచ్చిన హీరో రాబర్ట్‌ డి నీరో. ‘డై హార్డ్‌’ సినిమాని 25 సార్లు కనీసం చూశాడు. ‘షోలే’ అంటే పిచ్చి. అమితాబ్‌బచ్చన్‌ అంటే వెర్రి.
బహుశా తాను డైరెక్టర్‌ని అవుతానేమో అనుకునేవాడు.
కాని అయ్యేది ఎలా?

2001లో ‘దిల్‌ చాహ్‌తా హై’ విడుదలైంది. డైరెక్టర్‌ ఫర్హాన్‌ అఖ్తర్‌.
అప్పటికి హిందీ సినిమా రంగంలో ‘బేటి నం.1’, ‘బీవీ నంబర్‌ 1’, ‘అనారీ నం.1’లాంటి సినిమాలు వస్తున్నాయి. యశ్‌రాజ్‌ వాళ్లు ‘మొహబ్బతే’ లాంటి బరువైన సినిమాలు తీస్తున్నారు. ఈ ధోరణిని సమూలంగా మార్చాలి అని నిర్ణయించుకున్నాడు ఫర్హాన్‌ అఖ్తర్‌. ముంబై మెట్రో యువత ఉద్వేగాలను, వారి ప్రేమలను, ఆశలను, గందరగోళాలను సినిమాటిక్‌గా కాకుండా నమ్మశక్యంగా తీస్తే బాగుంటుందని భావించాడు. అతడు ఏ స్క్రిప్ట్‌ రైటర్‌ దగ్గరా పని చేయలేదు. సినిమాలకు అసిస్టెంట్‌గా కూడా పని చేయలేదు. అతడికి ఉన్న అనుభవమల్లా ఒక క్రియేటివ్‌ ఏజెన్సీలో కొన్ని యాడ్స్‌కు డాక్యుమెంటరీలకు పని చేయడమే.

కాని ఇంతకాలంలో చేసిన సినీ శోధన మీద అతడికి నమ్మకం ఉంది. అందుకే తన ఫ్రెండ్స్‌ జీవితంలో, తన జీవితంలో ఉన్న కొన్ని ఉదంతాలను తీసుకుని ‘దిల్‌ చాహ్‌తా హై’ స్క్రిప్ట్‌ రాశాడు. ఆకాష్, సమీర్, సిద్ధార్థ అనే ముగ్గురు కుర్రవాళ్ల కథ అది. ఆకాష్‌ తన జీవితం పట్ల నాన్‌ సీరియస్‌గా ఉంటాడు. సమీర్‌కు ప్రతీదీ గందరగోళం, అయోమయమే. సిద్దార్థ మెచ్యూర్డ్‌ కుర్రవాడే కాని అతడి ప్రేమ అతడి కంటే వయసులో చాలా పెద్దదైన స్త్రీ వైపు మళ్లుతుంది. ఈ అనుభవాల నుంచి ఎలా ఎదిగారన్నదే కథ. దీనికి ప్రొడ్యూసర్‌ కావాల్సి వచ్చింది. కొత్త దర్శకుడికి ఎవరు దొరుకుతారు? అందుకే తన చిన్ననాటి స్నేహితుడు రితేష్‌ సిద్వాని తానే ప్రొడ్యూస్‌ చేస్తానని ముందుకు వచ్చాడు. ఇక యాక్టర్స్‌... హృతిక్‌ రోషన్, అభిషేక్‌ బచ్చన్‌ అనుకున్నాడు.

ఇద్దరూ ఫర్హాన్‌ గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టలేదు. డేట్స్‌ ఇవ్వలేదు. ఫర్హాన్‌కు ఏం చేయాలో తోచలేదు. ఆమిర్‌ఖాన్‌ గుర్తుకు వచ్చాడు. ప్రయత్నిద్దాం వస్తే కొండ పోతే వెంట్రుక అనుకుని ట్రై చేశాడు. ఆమిర్‌ ఖాన్‌ ఎంత తెలివైనవాడంటే తన దగ్గరకు వచ్చింది సామాన్యమైన స్క్రిప్ట్‌ కాదని చిటికెలో కనిపెట్టేశాడు. అందుకే వెంటనే లీడ్‌ క్యారెక్టర్‌ చేయడానికి అంగీకరించాడు. మిగిలిన రెండు పాత్రలకు సైఫ్‌ అలీ ఖాన్, అక్షయ్‌ ఖన్నా ఎంపికయ్యారు. ‘దిల్‌ చాహ్‌తాహై’ విడుదలైంది. అప్పటి వరకూ ఉన్న సినిమా ధోరణుల్ని తిరగ రాసింది. హిందీ సినిమాలకు వెళ్లి రామ్‌గోపాల్‌ వర్మ ఒకరకమైన మార్పు తెస్తే ఫర్హాన్‌ అఖ్తర్‌ తన ‘దిల్‌ చాహ్‌ తాహై’తో మరో రకమైన మార్పు తెచ్చాడు. రియలిస్టిక్‌గా కనిపించే పాత్రలతో కమర్షియల్‌ సినిమా తీయొచ్చని నిరూపించాడు. సినిమాకు ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి.
అంతవరకూ ఫర్హాన్‌ అఖ్తర్‌ జావేద్‌ అఖ్తర్‌ కొడుకు.
ఈ సినిమా నుంచి జావేద్‌ అఖ్తర్‌ ఫర్హాన్‌ అఖ్తర్‌ వాళ్ల నాన్న.
సాధించడం అంటే అదీ.

ఆ తర్వాత ఫర్హాన్‌ అఖ్తర్‌ కార్గిల్‌ వార్‌ నేపథ్యంతో హృతిక్‌ రోషన్, అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్య పాత్రలుగా ‘లక్ష్య’ సినిమా తీశాడు. ఆ తర్వాత తన తండ్రి రాసిన ‘డాన్‌’ సినిమాను ఈ కాలానికి తగినట్టుగా రాసి షారూక్‌ ఖాన్‌తో రీమేక్‌ చేశాడు. అయితే ఈ సమయంలోనే ఫర్హాన్‌కు ఒక బంగారం లాంటి అవకాశం మిస్‌ అయ్యింది. ‘రంగ్‌ దే బసంతీ’లో ముఖ్యపాత్ర ధరించమని దర్శకుడు రాకేష్‌ మెహ్రా అతణ్ణి అడిగాడు. అప్పటికి ఫర్హాన్‌ అఖ్తర్‌ దృష్టి దర్శకత్వం మీదే ఉంది. తను నటుణ్ణో కాదో తేల్చుకోలేకపోయాడు. అంతే కాదు ‘రంగ్‌ దే బసంతీ’ స్క్రిప్ట్‌ను సరిగ్గా జడ్జ్‌ చేయలేకపోయాడు. ఆ సినిమా విడుదలైంది. కనీ వినీ ఎరగని పెద్ద హిట్‌ అయ్యింది. ఆ సినిమాతో నటుడిగా లాంచ్‌ అయి ఉంటే ఓవర్‌ నైట్‌లో ఫర్హాన్‌ స్టార్‌ అయి ఉండేవాడు. కాని మెట్లు మెల్లగానే ఎక్కాలని అతడికి రాసి పెట్టి ఉంది.

‘రాక్‌ ఆన్‌’ (2008) ఫర్హాన్‌ అఖ్తర్‌ మొదటగా నటించిన సినిమా. ఆ సినిమాలో ఒక ర్యాక్‌ బ్యాండ్‌లో లీడ్‌ సింగర్‌గా నటించాడు ఫర్హాన్‌. పాటలు కూడా పాడాడు. ఆ తర్వాత ‘కార్తిక్‌ కాలింగ్‌ కార్తిక్‌’, ‘లక్‌ బై చాన్స్‌’ సినిమాల్లో నటించాడు. కాని అతణ్ణి పెద్ద స్టార్‌ని చేసే అవకాశం, అతడిలోని నటుణ్ణి లోకానికి చూపే అవకాశం అతడి అక్క జోయానే ఇచ్చింది. దర్శకురాలిగా ఆమె తన తొలి ప్రయత్నం ‘జిందగీ నా మిలేగీ దుబారా’లో ఫర్హాన్‌ అఖ్తర్‌కు మంచి పాత్ర ఇచ్చింది. అందులో అతడు పోషించింది కూడా నిజ జీవితాన్ని పోలిన పాత్రనే. తండ్రి మరో పెళ్లి చేసుకుని వెళ్లిపోగా ఆ తండ్రిని వెతుక్కుంటూ వెళ్లే కొడుకు పాత్ర పర్హాన్‌ది. ‘జిందగీ నా మిలేగీ దుబారా’ ఎంత పెద్ద హిట్‌ అంటే 55 కోట్లతో తీస్తే 150 కోట్లు వసూలు చేసింది. నిర్మాత ఫర్హాన్‌ అఖ్తర్‌ కావడంతో అతడి పంట పండింది. కానీ అంత కంటే పెద్ద పంట ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ రూపంలో అతడికి దక్కింది.

‘ఫ్లయింగ్‌ సిక్‌’గా ఖ్యాతి పొందిన మిల్కా సింగ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు రాకేష్‌ మెహ్రా సినిమా తీయాలనుకున్నాడు. ఆ పాత్రకు అడిగితే ఎవరైనా చేయడానికి ఎగిరి గంతేస్తారు. కానీ రాకేష్‌ ఫర్హాన్‌ను ఎంచుకున్నాడు. ఫర్హాన్‌ ఆ పాత్రను ఛాలెంజింగ్‌గా తీసుకున్నాడు. ఇది మామూలు పాత్ర కాదు. పరిగెత్తే పాత్ర. పరిగెత్తి అందరి కంటే ముందు రావాల్సిన పాత్ర.

దాని కోసం దేహ దారుఢ్యం కావాలి. పరిగెత్తడాన్ని ప్రాక్టీసు చేయాలి. గుండె గొంతులో కొట్లాడేలా ఉరకలెత్తాలి. ఫర్హాన్‌ అవన్నీ చేయడానికి సిద్ధ్దపడ్డాడు. ఈ సినిమా చూడటానికి ఒకరోజు షూటింగ్‌ స్పాట్‌కు వచ్చిన మిల్కా సింగ్‌ మొదట అపనమ్మకంగా ఫర్హాన్‌ వైపు చూశాడు. కానీ ట్రాక్‌ మీద అతడు పరిగెత్తడాన్ని చూసి ముప్ఫై ఏళ్ల క్రితం తాను పరిగెత్తినట్టుగానే భావించాడు.
‘జీతే రహో’(బతుకుతూ ఉండు) అని ఆశీర్వదించాడు.
సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు  జీత్‌ తే రహో (గెలుస్తూ ఉండు) అని ప్రోత్సహించారు.
భాగ్‌ మిల్కా భాగ్‌ ఫర్హాన్‌ అఖ్తర్‌లోని ఒక గొప్ప నటుణ్ణి చూపించింది.
ఇప్పుడు ఫర్హాన్‌ పరిపూర్ణమైన నటుడు. నిరూపించుకున్న దర్శకుడు.
ఇంకేం కావాలి?

కానీ స్క్రిప్ట్‌ అంత సులభంగా లేదు. తండ్రి లాంటి కథే పునరావృత్తమైంది. తాను సూపర్‌స్టార్‌ కాక మునుపే ఫర్హాన్‌ ‘అధూనా’ అనే హెయిర్‌ స్టయిలిస్ట్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ముంబైలో సెలూన్స్‌ ఉన్నాయి. ఆమె కూడా ఇతణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరు ఆడపిల్లలు. కాని బహుశా ఫర్హాన్‌ అభిరుచులు, ఎదుగుదల, బిజీ, పేరు, కీర్తి వారిలో ఒక దూరాన్ని తీసుకొచ్చింది. గత సంవత్సరం అంటే 2016లో వాళ్లు విడిపోయారు. తన తండ్రి నిర్ణయంతో తాను ఎంత సఫర్‌ అయ్యాడో తెలిసి కూడా ఆ కఠినమైన నిర్ణయానికి తల ఒంచాడు ఫర్హాన్‌.

ఫర్హాన్‌ ప్రస్తుతం నిర్మాతగా ఎక్కువ చురుగ్గా ఉన్నాడు.
నటుడిగా ‘దిల్‌ ధడక్‌నే దో’ వంటి సినిమాల్లో ఆచి తూచి పాత్రలు ఎంపిక చేసుకుంటున్నాడు.
ఒక ప్రయాణం ముగిసి మళ్లీ మొదటికొచ్చినట్టయ్యింది అతడి పని.
తండ్రి ఒక స్క్రిప్ట్‌ రాశాడు. తను ఒక స్క్రిప్ట్‌ ప్రయత్నించాడు.
కానీ విధి రాసిన స్క్రిప్ట్‌లో తన ప్రమేయం లేని పాత్రను పోషిస్తున్నాడు.
అతడి కోసం విధి ఏం రిజర్వ్‌ చేసి పెట్టి ఉందో మనం రాబోయే రోజుల్లో చూస్తాం.
అందాక ‘దిల్‌ ధడక్‌ నే దో’.
– సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement