
సాక్షి, హైదరాబాద్ : 3 నెలల క్రితం ప్రారంభమై వివాదాలు, సంవాదాలతో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన బిగ్‌బాస్–3 షో విజేతగా గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ నిలిచారు. దీంతో ఆయన రూ.50 లక్షల నగదు బహుమతిని దక్కించుకున్నారు. అండర్‌డాగ్‌గా బిగ్‌హౌస్‌లోకి ఎంటర్ అయిన రాక్‌స్టార్ రాహుల్ .. విన్నర్‌గా కాలర్ ఎగరేశాడు. దీంతో టైటిల్ ఫెవెరెట్‌గా హౌస్‌లో సందడిచేసిన పటాకా శ్రీముఖి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రూ.50లక్షల నగదు బహుమతిని, బిగ్‌బాస్ ట్రోఫిని రాహుల్ అందుకున్నాడు.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. తనకు ఓట్లు వేసి గెలిపించిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పాదాభివందనాలు చేశారు. ఈ విజయం తనను పది మెట్లు పైకి ఎక్కించాయని, ఇక నుంచి తన లైఫ్ కొత్తగా ఉండబోతుందని చెప్పారు. తన గెలుపు కోసం తల్లిదండ్రులు, స్నేహితులు, ప్రేక్షకులు ఎంతో సహకరించారని రాహుల్ అన్నారు. తన విజయంలో పునర్నవి, వరుణ్, వితికల కష్టం కూడా ఉందన్నారు.
(చదవండి : బిగ్‌బాస్ తర్వాత కనిపించకుండా పోయారు)
ఇక పునర్నవి గురించి మాట్లాడుతూ.. ‘ఫస్ట్ నేను టాస్కులు ఆడకపోతుండే. పెద్ద లేజీగాడు లెక్కుండే. మంచిగజెప్పింది ఇన్లేదు. టాస్కులు ఆడరా అని జెప్పింది. అయినా ఇన్లేదు. అరె ఎదవ ఆడరా టాస్కులు అని జెప్పింది. అయినా ఇన్లేదు. ఒకరోజు ఫాట్ అని బైరిబెట్టింది. అయినా ఇన్లేదు. ఆఖరికి నామినేట్ జేసింది. తీస్కపోయి ముఖానికి రంగు పూసింది’ అని చెప్పాడు. టాస్క్‌ల వల్లే శ్రీముఖికి, తనకు బేదాభిప్రాయాలు వచ్చాయి తప్ప వ్యక్తిగతంగా ఏమి లేదన్నారు. ఇక నుంచి తన లైఫ్ కొత్తగా మారుతుందని చెప్పారు. ‘ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో మా అమ్మనాన్న కడుపులో పుట్టాను’అంటూ రాహుల్ ఎమోషనల్ అయ్యాడు.
కాగా, బిగ్‌బాస్ సీజన్ త్రీకి గ్రాండ్‌గా ఎండ్ కార్డ్ పడింది. ఫైనల్ పోటీని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన బుల్లితెర ప్రేక్షకులు సుమారు మూడు గంటల పాటు ఇంట్లో టీవీలకు అతుక్కుపోయారు. ఎంతో మంది వెండితెర తారలు, బుల్లితెర నటీనటులు తమ ఆటపాటలతో అలరించారు. సీరియల్ యాక్టర్స్, పలువరు సెలబ్రిటీలు, బిగ్‌బాస్ కంటిస్టెంట్‌లు ధూమ్‌ధామ్‌గా సందడి చేశారు. ప్రతిరోజు పండగే టీమ్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లి హంగామా చేసింది. హీరోయిన్స్ అంజలి, కేథరిన్, నిషా అగర్వాల్ ఫర్మామెన్స్‌లతో గ్రాండ్ ఫినాలే స్టేజీ దద్దరిల్లింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
టాప్5లో ఉన్న కంటెస్టెంట్స్‌లో మొదటగా అలీ రెజా, తర్వాత వరుణ్ ఎలిమినేట్ అయ్యారు. ఇక మూడో ఎమిలినేషన్‌గా బాబా భాస్కర్ బయటకు వచ్చారు. చివరకి హౌజ్‌లో మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్స్ శ్రీముఖి, రాహుల్ దగ్గరకి స్వయంగా హోస్ట్ నాగార్జునే వెళ్లాడు. వారితో కాసేపు సరదాగా మాట్లాడాడు. వారి జర్నీలకు సంబంధించిన వీడియోలను ప్లే చేసి చూపించాడు. వంద రోజులకు పైగా కష్టపడి టాప్2లోకి వచ్చిన రాహుల్, శ్రీముఖిలకు చివరగా నాగ్ ఓ ఆఫర్‌ను ఇచ్చాడు. ప్రైజ్ మనీ యాభై లక్షలని, ఇద్దరికీ చేరో రూ.25లక్షలు ఇస్తానని డీల్ మాట్లాడాడు. కానీ దాన్ని వారిద్దరూ సున్నితంగా తిరస్కరించారు. దీంతో వారిద్దరిని నాగ్ స్టేజ్ మీదకు తీసుకువచ్చాడు. చిరు కోసం పాట పాడమని నాగ్ రాహుల్‌ను కోరగా.. అబీఅబీ అనే పాటతో రాహుల్ స్టేజిని ఉర్రుతలూగించాడు. ఇక రాహుల్, శ్రీముఖి ఇద్దరిలో రాహుల్‌ను విన్నర్‌గా నాగ్ ప్రకటించేశాడు. అనంతరం చిరంజీవి ట్రోఫీని అందజేశాడు. శ్రీముఖి డల్ అయిపోవడంతో చిరంజీవి ఆమెకు ఉత్సాహాన్ని ఇచ్చారు. అలా ఉంటే తాను చూడలేనని సరదాగా అన్నారు. ఆ తరవాత తనతో చిరు సెల్ఫీ తీసుకున్నారు. ఈ సమయంలో చిరు బుగ్గపై శ్రీ ముద్దపెట్టింది. దీంతో చిరంజీవి షాకయ్యాడు. మొత్తంగా 8కోట్ల 52లక్షల ఓట్లు పోలైనట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించాడు. దీంతో బిగ్‌బాస్ 3కి ఎండ్‌కార్డు పడింది.
Comments
Please login to add a commentAdd a comment