
రవితేజ కేరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ బలుపు
నటుడు రవితేజ కేరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రం బలుపు అని ఆ చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని వ్యాఖ్యానించారు. క్రేజీ నటి శ్రుతీహాసన్, అంజలి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నటి రాయ్‌లక్ష్మి ముఖ్యపాత్రను పోషించారు. ప్రకాశ్‌రాజ్, నాజర్, బ్రహ్మానందం, జయ్‌ప్రకాశ్, ఆదిత్యమీనన్, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎస్‌ఎస్.తమన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం విడుదలై చాలా రోజులైంది, ఇప్పుడెందుకు మళ్లీ చెబుతున్నారనేగా ప్రశ్న. తెలుగులో ఘన విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు ఎవండా పేరుతో తమిళం మాట్లాడనుంది.
ఇంతకు ముందు సెల్వందన్, బ్లూస్లీ-2 వంటి పలు విజయవంతమైన చిత్రాలను తమిళ ప్రేక్షకులకు అందించిన భద్రకాళీ ఫిలింస్ అధినేత ప్రసాద్ ఈ ఎవండా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. స్వాతి, హర్షిణి సమర్పణలో అడ్డాల వెంకట్రావు, సత్య సీతల సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి మాటలను ఏఆర్‌కే.రాజరాజా అందిస్తున్నారు. కాగా ఎవండా చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం స్థానిక వడపళనిలోని ఏవీఎం స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని, సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ తమన్ ప్రత్యేకంగా పాల్గొన్నారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న జాగ్వుర్ తంగం చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ తమిళంలో ఎవండాగా రానున్న బలుపు చిత్రం హీరో రవితేజ కేరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందన్నారు. చిత్ర కథను ఎంతగానో ప్రేమించి రూపొందించామన్నారు. జనరంజక అంశాలతో కూడిన మంచి కమర్షియల్ చిత్రం ఇదని పేర్కొన్నారు. చిత్రంలో బోలెడు ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని తెలిపారు. సంగీత దర్శకుడు త మన్ ఆరు హిట్ పాటల్ని ఇచ్చారని చెప్పారు. తెలుగులో బలుపు అన్నది చాలా పవర్‌ఫుల్ టైటిల్ అనీ, తమిళంలోనూ ఎవండా పవర్‌ఫుల్‌గా ఉందనీ అన్నారు.
చిత్ర తమిళ పోస్టర్లలో తన పేరు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాననీ, బలుపు తమిళంలోనూ పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ రవితేజతో తాను చేసిన ఎనిమిదో చిత్రం బలుపు, అదే విధంగా దర్శకుడు గోపీచంద్ మలినేనితో నాలుగవ చిత్రం ఇప్పుడు ఐదవ చిత్రం చేయనున్నాను అని అన్నారు. గోపీచంద్ తెలుగుతో పాటు తమిళంలోనూ చిత్రాలు చేయాలని అన్నారు. సహనిర్మాత అడ్డాల వెంకట్రావు మాట్లాడుతూ ఎవండా మంచి మాస్ ఎంటర్‌టెయినర్ చిత్రం అని తెలిపారు.
ఈ సంస్థ నుంచి నెలకొక చిత్రం చొప్పున ఐదు నెలలలో ఐదు చిత్రాలను విడుదల చేసినట్లు వెల్లడించారు. బలుపు చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయాలనీ ప్రయత్నించామనీ, ఇద్దరు హీరోలతో సంప్రదింపులు కూడా చేశామనీ నిర్మాత ప్రసాద్ తెలిపారు. అయితే ఈ చిత్రం చేయడానికి ఆ హీరోలు సాహసించలేక పోయారనీ చెప్పారు. ఇకపై కూడా నెలకో చిత్రం చేస్తామనీ తదుపరి ప్రభాస్ నటించిన డార్లింగ్ చిత్రాన్ని తమిళ ప్రేక్షకులకు అందించనున్నట్లు తెలిపారు. ఎవండా చిత్రాన్ని ఈ నెల 12న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత ప్రసాద్ వెల్లడించారు.