
తెరపైకి దాసరి జీవితకథ
పాలకొల్లు టు హైదరాబాద్ వయా చెన్నై.. దర్శకరత్న దాసరి నారాయణరావు సినిమా జర్నీ ఇది. ఈ జర్నీలో ఎన్నో విజయాలు, అపజయాలూ ఉన్నాయి. దర్శకుడిగా, నటుడిగా, రచయితగా, నిర్మాతగా దాసరి రియల్ లైఫ్‌ని రీల్‌పై చూడబోతున్నాం. ఈ దర్శక దిగ్గజం జీవితకథతో ఓ సినిమా తీయనున్నట్లు నటుడు, ఫిల్మ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు ఓ. కల్యాణ్ ప్రకటించారు.
ఓ. కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘సినీ కళామతల్లికి దాసరిగారు ముద్దు బిడ్డ. సినీ రంగానికి ఆయనొక దిక్సూచి. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది. దాసరిగారు మన మధ్య లేకున్నా ఆయన జ్ఞాపకాలు మనతోనే ఉండాలని ఆయన బయోపిక్ నిర్మించబోతున్నా. గురువుగారి జీవితంలోని ఎత్తుపల్లాలను ఈ సినిమాలో చూపిస్తాం. దాసరిగారి ప్రియ శిష్యుడైన ఓ డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తారు. టైటిల్, నటీనటుల వివరాలు త్వరలో చెబుతా’’ అన్నారు.