సిమ్ కార్డులను విసిరికొట్టిన హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు అన్ ప్రొఫెషనల్ గా వ్యవహరించిందని ఫ్యాషన్ షో నిర్వాహకులు ఆరోపించారు. ముందుగా తమ దగ్గర డబ్బులు తీసుకుని చివరి నిమిషంలో షోలో పాల్గొనకుండా డుమ్మా కొట్టిందని వాపోయారు. ఇండియా పాకిస్తాన్ లండన్ ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు తమకు ఎన్నో షరతులు పెట్టినా ఒప్పుకున్నామని చివరకు బిపాసా గైర్హాజరైందని షో నిర్వాహకులు రోణిత శర్మ రేఖీ వాపోయారు.
'బిపాసా తనతో పాటు భర్త కరణ్ ను లండన్ తీసుకురావాలని కోరడంతో ఒప్పుకున్నాం. అంతేకాదు లండన్ లో ఉండేందుకు మేఫెయిర్ హోటల్ లో ఆమెకు గదులు కూడా బుక్ చేశాం. అయితే షెడ్యూల్ కంటే ఎక్కువ రోజులు ఉండడంతో మరో ఫైవ్ స్టార్ హోటల్ లో గదులు బుక్ చేయాల్సి వచ్చింది. ఆమెకు ఏ లోటు రాకుండా ఏర్పాట్లు చేశాం. బిపాసాకు అడ్వాన్స్ కూడా ఇచ్చాం. లండన్ లో దిగిన వెంటనే రెండు లోకల్ సిమ్ కార్డులు అందజేశాం. వాటిలో ఐదు పౌండ్లు మాత్రమే రీచార్జి ఉందన్న కారణంతో సిమ్ కార్డులను మా ముఖంపై విసిరికొట్టింది. మా చుట్టూ 20 మంది ఇదంతా చూశారు.
మేము ఇవన్నీ మర్చిపోయి షోకు రావాలని ఆమెను బతిమాలినా వినిపించుకోలేదు. ర్యాంప్ నడిచేందుకు ససేమీరా అంది. ఆమె కారణంగా నిర్వాహకులకు 7800 పౌండ్ల నష్టం వాటిల్లింది. దీంతో పాటు ప్రయాణ ఖర్చులకు నగదు రూపంలో ఎయిర్ పోర్టులో ఆమెకు ఇచ్చాం. ఈ డబ్బును హనీమూన్ మనీగా వాడేసుకుంది. మాకు అన్నివిధాలా నష్టం కలిగించిన బిపాసాపై పోరాడతామ'ని రోణిత వాపోయారు. ఈ ఆరోపణలను బిపాసా తోసిపుచ్చారు. 15 ఏళ్ల తన కెరీర్ లో ఎప్పుడూ అన్ ప్రొఫెషనల్ గా వ్యవహరించలేదని వివరణయిచ్చింది.