
హైదరాబాద్: చరిత్రను వక్రీకరించి ‘పద్మావతి’ సినిమా తీశారని బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీపై బీజేపీ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ లోథ మండిపడ్డారు. ఈ సినిమాను ప్రదర్శిస్తే ధియేటర్లు తగలబెడతామని హెచ్చరించారు. రాజ్‌పుత్‌ల గౌరవానికి ఎవరు భంగం కలిగించినా సహించబోమన్నారు. సికింద్రాబాద్‌లో మంగళవారం జరిగిన రాజస్థాన్ రాజ్‌పుత్ సమాజ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘మహ్మద్ ప్రవక్త, జౌరంగజేబుపై సినిమా తీయాలని సంజయ్‌లీలా భన్సాలీకి సవాల్ విసురుతున్నా. ఆయన చరిత్రను వక్రీకరిస్తున్నార’ని ధ్వజమెత్తారు.
ఈ సినిమాను బహిష్కరించడమే కాకుండా విడుదల కాకుండా అడ్డుకోవాలని హిందూధర్మ పరిరక్షకులకు పిలుపునిచ్చారు. భాగ్యనగరం పరిధిలో ‘పద్మావతి’ సినిమాను అడ్డుకుని అరెస్టైన వారి తరపున తాను బాధ్యత తీసుకుంటానని, బెయిల్ ఇప్పిస్తానని ఆయన హామీయిచ్చారు. దేశసంస్కృతిని భ్రష్టు పట్టించే కుట్రలో భాగంగానే ఈ సినిమా తీశారని ఆరోపించారు. దేశ ప్రతిష్ఠ, హిందూ మతం, హిందూ సమాజం గౌరవాన్ని కాపాడుకునేందుకు యువత పోరాడాలన్నారు. ‘పద్మావతి’ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.