
బాలీవుడ్ వర్సెస్ శివసేన
ముంబై: పాకిస్తానీ నటులు, కళాకారులు, క్రీడాకారుల పట్ల శివసేన వైఖరిపై బాలీవుడ్ మండిపడుతోంది. సంస్కృతీ, సంప్రదాయాలను రాజకీయాల నుంచి వేరుచేసి చూడాలని సూచిస్తోంది. ముంబైలో 'ద బ్యూటీ అండ్ ద బీస్ట్' పేరుతో నిర్వహిస్తున్న ఓ సంగీత కార్యక్రమానికి హాజరైన పలువురు బాలీవుడ్ ప్రముఖులు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. కళాకారులకు హద్దులు నిర్ణయించడం సరైనది కాదన్నారు. కళలకు ఎల్లలు ఉండవంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల ప్రముఖ గజల్ గాయకుడు గులాం అలీ కచేరీని అడ్డుకున్న శివసేన వైఖరిపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
దర్శకులు కబీర్ ఖాన్, ఓమంగ్ కుమార్, మోహిత్ సూరి, నటుడు ఇమ్రాన్ హష్మీ, హీరోయిన్ సోహా అలీ ఖాన్, నటి నిమ్రాత కౌర్, రచయిత, గాయకుడు స్వానంద్ కిర్ కిరే తదితరలు శివసేన వైఖరిని ఖండించారు. ఇలాంటి హెచ్చరికల వల్ల బాలీవుడ్ కు జరిగే నష్టం ఏమీ ఉండదని వ్యాఖ్యానించారు. ఇలాంటి నిషేధాలు విధించడం విచారకరమని, ప్రపంచంలో ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా ఖండిచాలని అన్నారు. నైపుణ్యం కలిగిన కళాకారులకు ప్రపంచంలో ఎక్కడైనా స్వేచ్ఛగా తన కళను ప్రదర్శించుకునే హక్కు ఉంటుందని తేల్చి చెప్పారు.
ప్రఖ్యాత సంగీతకారుడు, 8 సార్లు ఆస్కార ఆవార్డు విజేత అలెన్ మెంకెన్ తొలిసారిగా ఇండియాలో 'బ్యూటీ అండ్ బీస్ట్' పేరుతో ప్రదర్శన ఇస్తున్నారు. ముంబై, ఢిల్లీ నగరాలలో సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.