
బాక్సాఫీస్ టు బిజినెస్ వరల్డ్
తమన్నా స్వయంగా డిజైన్ చేసిన చెవి దిద్దులు మార్కెట్లోకి వస్తే... అవి హాట్‌కేక్‌లే! తాప్సీ ఈవెంట్ మేనేజర్‌గా మారితే... ఆమెకు ఈవెంట్స్ బాధ్యత ఇవ్వనివాళ్ళుంటారా! కాజల్ అగర్వాల్, ఆమె చెల్లెలు నిషా నగల వ్యాపారం మొదలుపెడితే కొననివాళ్లుంటారా..! ఇప్పటి దాకా మగాళ్ల రాజ్యమైన ఈ రంగాల్లో వీళ్లిప్పుడు జెండా పాతారు.
అవును...
సెలబ్రిటీలు ఏం చేసినా అది అందర్నీ ఆకట్టుకుంటుంది. వాళ్లకున్న క్రేజ్ అలాంటిది. అయితే, మేల్ డామినేషన్ ఉన్న రంగాల్లోనూ కొంతమంది కథా నాయికలు అడుగుపెట్టి, జేజేలు అందుకుంటున్నారు. ఇప్పటికే తమన్నా చేస్తున్న ‘వైట్ అండ్ గోల్డ్’ నగల వ్యాపారానికి బోల్డంత డిమాండ్ ఉంది. చెల్లెలు షగున్‌తో కలిసి తాప్సీ చేస్తున్న వెడ్డింగ్ ప్లానర్ బిజినెస్ కూడా బ్రహ్మాండంగా ఉంది. కాజల్, నిషా అగర్వాల్ చేస్తున్న ‘మార్ సాలా’ నగల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల చందంగా ఉందట. వీళ్లే కాకుండా... రీసెంట్‌గా బిజినెస్‌లోకి అడుగుపెట్టిన హీరోయిన్ల జాబితాలో... సంజన, ప్రణీత, రకుల్ ప్రీత్‌సింగ్... ఇలా ఎందరెందరో! ఈ అందగత్తెలు చేపట్టిన వ్యాపారం కబుర్లు ఏమిటంటే...
టేస్టీ టేస్టీ ఫుడ్.. సో గుడ్!
మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే హాయిగా ఉంటుంది. అన్ని పనులూ తేలికగా చేసుకుని అనుకున్నవన్నీ సాధించవచ్చన్నది ప్రణీత అభిప్రాయం. అందుకే పోషక విలువలున్న ఆహారం తీసుకుంటారామె. అందరికీ అలాంటి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇటీవల ఆమె బెంగళూరులో ఓ రెస్టారెంట్ ప్రారంభించారు. టేస్టీ టేస్టీ ఫుడ్ వడ్డించడమే ఈ రెస్టారెంట్ లక్ష్యం అని ప్రణీత అంటున్నారు. వాస్తవానికి ఎప్పటి నుంచో బిజినెన్ ఉమన్‌గా మారాలని ఆమె అనుకుంటున్నారు. రైట్ టైమ్ చూసి, ఈ రెస్టారెంట్ ప్రారంభించారు. బాపూ బొమ్మ హోటల్ అంటే గిరాకీ ఉండకుండా ఉంటుందా?
రిమ్ జిమ్...
రకుల్ ప్రీత్ సింగ్ మెరుపు తీగలా ఉంటారు. అలా ఉండడం కోసం ఆమె జిమ్ చేస్తారు. సమాజంలో పెరిగిన ఆరోగ్య, సౌందర్య స్పృహ రీత్యా ఇప్పుడు సినిమా తారలు మాత్రమే కాకుండా అందరూ ఫిట్‌నెస్‌కి ఇంపార్టెన్స్ ఇస్తు న్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే రకుల్ ఫిట్‌నెస్ సెంటర్ ప్రారంభించారు. అయితే సంజన, ప్రణీత తమ సొంత ఊళ్లో వ్యాపారం మొదలుపెడితే రకుల్ మాత్రం తన సొంత ఊరు ఢిల్లీలో కాక హైదరాబాద్‌లో మొదలుపెట్టారు. ‘ఎఫ్ 45’ పేరుతో గచ్చిబౌలిలో ఫిట్‌నెస్ సెంటర్ ఆరంభించారు. ఇప్పుడు తెలుగు పరిశ్రమలో అగ్రనాయికగా దూసుకెళుతున్న రకుల్ సొంతంగా పెట్టారు కాబట్టి, ఈ జిమ్ సెంటర్‌కు వెళ్లే అభిమానుల సంఖ్య బాగానే ఉంటుందని చెప్పొచ్చు.
బమ్‌చిక్ బమ్‌చిక్ చెయ్యి బాగా..!
శరీరం, మనసు.. రెండూ తేలికగా ఉండాలంటే యోగాకి మించిన మంచి సాధనం లేదంటారు. తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక సంజన బ్యూటీ సీక్రెట్ కూడా యోగానే! యోగా వల్ల మెరుగైన ఫలితాలు పొందిన సంజన నలుగురికీ మేలు చేయాలనుకున్నారు. అందుకే, తన సొంత ఊరు బెంగళూరులోని కోరమంగళలో ‘అక్షర్ పవర్ యోగా అకాడమీ’ పేరుతో ఓ యోగా సెంటర్ ప్రారంభించారు. సంజన అభిమానులు మాత్రమే కాదు.. ఆమెలాగా స్లిమ్‌గా ఉండాలనుకునేవాళ్లందరి దృష్టి ఇప్పుడీ యోగా సెంటర్ మీదే! ఎంచక్కా ‘బమ్ చిక్ బమ్ చిక్ చెయ్యి బాగా...’ అంటూ యోగా చేసేసి ఈ సెంటర్‌లో అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ పొందవచ్చని సంజన అంటున్నారు.
జనరల్‌గా సినిమా తారలు ఏదైనా బిజినెస్ మొదలుపెడితే అవకాశాలు లేకే అలా చేస్తున్నారని అనుకోవడం సహజం. కానీ, రకుల్, ప్రణీత, సంజనల చేతి నిండా సినిమాలున్నాయి. అంత బిజీలోనూ వాళ్లిలా బిజినెస్ వైపు మొగ్గడానికి చాలా కారణాలున్నాయి. సినిమా కెరీర్ ఎన్నేళ్ళు ఉంటుందో గ్యారెంటీ లేదు కాబట్టి, ఫామ్‌లో ఉన్నప్పుడే ప్రత్యామ్నాయంగా ఒక బిజినెస్ కెరీర్‌ని స్టార్ట్ చేస్తే భవిష్యత్తులో గుండెల మీద చెయ్యేసుకుని మిగతా జీవితాన్ని గడిపేయొచ్చు కదా! నేటి తరం తారలు ఇలా వ్యాపారవేత్తలుగా మారడానికి అది కూడా కారణం అయ్యుంటుంది. అఫ్‌కోర్స్... వాళ్ళకున్న అభిరుచి కూడా దానికి కలగలిసిందన్నది కాదనలేని విషయం.