ఏపీలో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ విడుదలకు బ్రేక్‌ | Break To Releasing Laxmis NTR Movie In AP | Sakshi
Sakshi News home page

ఏపీలో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ విడుదలకు బ్రేక్‌

Published Fri, Mar 29 2019 1:54 AM | Last Updated on Fri, Mar 29 2019 8:53 AM

Break To Releasing Laxmis NTR Movie In AP - Sakshi

సాక్షి, అమరావతి : ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు బ్రేక్‌ వేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు ఈ సినిమాను ప్రదర్శించరాదని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, నిర్మాత రాకేష్‌రెడ్డి తదితరులను హైకోర్టు ఆదేశించింది. ఈ సినిమాను ఏప్రిల్‌ 3న తాము స్వయంగా వీక్షిస్తామని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రాకేష్‌రెడ్డికి సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాద్‌రావుతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ సినిమా శుక్రవారం విడుదల కావాల్సింది. అయితే ఈ చిత్రాన్ని విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ టీడీపీకి చెందిన న్యాయవాది సువ్వారి శ్రీనివాసరావు, ఆ పార్టీ నాయకుడు పి.మోహన్‌రావు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యాలపై గురువారం ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది మీనాక్షి ఆరోరా వాదనలు వినిపిస్తూ, టీడీపీని అప్రతిష్టపాలు చేయడానికి ఈ సినిమాను రూపొందించారని ఆరోపించారు. ప్రస్తుతం ఎన్నికల తరుణంలో పార్టీని ఏదో రకంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశారన్నారు. ఈ చిత్ర నిర్మాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో సభ్యుడని పేర్కొన్నారు. ఎన్‌టీఆర్‌ గురించి అభ్యంతరకర రీతిలో సన్నివేశాలు చిత్రీకరించారన్నారు. అందువల్ల ఎన్నికలయ్యేంత వరకు ఈ చిత్ర ప్రదర్శనను నిలిపేయాలని న్యాయవాది మీనాక్షి అరోరా కోర్టును కోరారు. అలాగే రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పక్క సీట్లో రాకేష్‌రెడ్డి కూర్చొని ఉన్న ఫోటోను ధర్మాసనం ముందుంచారు.

విమానంలో పక్క సీట్లో కూర్చొంటే....?
దీనిపై నిర్మాత తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. విమానాశ్రయంలో ఎవరి పక్కన ఎవరి సీటు వస్తుందో తెలియదని, అంతమాత్రాన నిర్మాత ప్రతి పక్ష పార్టీతో సంబంధం ఉందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. తాను మొన్న విజయవాడ వచ్చేందుకు విమానం ఎక్కగా, తన పక్కన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఉన్నారని, ఎవరో ఫోటో తీసి జేసీ పక్కన ఉన్నాను కాబట్టి, తనకు టీడీపీతో సంబంధం ఉందంటే అందుకు తానెలా బాధ్యుడిని అవుతానని సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. పక్కన కూర్చున్నంత మాత్రాన దురుద్దేశాలు ఆపాదించడం సరికాదన్నారు. ఈ సమయంలో మీనాక్షి ఆరోరా అడ్డుతగులుతూ.. నిర్మాత రాకేష్‌రెడ్డికి ప్రతిపక్ష పార్టీతో సంబంధం ఉందో? లేదో సుధాకర్‌రెడ్డి మనస్ఫూర్తిగా చెప్పాలని కోరారు. దీనికి సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ.. ఈ చిత్ర నిర్మాతకు, ప్రతిపక్ష పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

సినిమా చూడకుండానే వ్యాజ్యాలా!
అంతకు ముందు ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, అసలు సినిమా చూడకుండా, అందులో ఏముందో తెలియకుండా ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని తెలిపారు. పిటిషనర్లది కేవలం ఆందోళన మాత్రమేనని, దీని ఆధారంగా దాఖలు చేసే వ్యాజ్యాలకు విచారణా ర్హత లేదన్నారు. టీవీల్లో ప్రసారమయ్యే సినిమా ట్రైలర్ల విషయంలో తాము జోక్యం చేసుకోబో మని, కేవలం రాజకీయ ప్రకటనల విషయంలోనే స్పందిస్తామని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ఇప్పుడే తీర్పును వెలువరిస్తామని, కొద్దిసేపు వేచి ఉండాలని స్పష్టం చేసింది. అయితే రాత్రి 7 గంటల సమయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ.. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాను ప్రదర్శించవద్దని అనధికార ప్రతివాదులుగా ఉన్న దర్శకుడు రాంగోపాల్‌ వర్మ, నిర్మాత రాకేష్‌రెడ్డి తదితరులను ఆదేశించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement