కాగ్ కనుసన్నల్లో బాలీవుడ్ స్టార్స్
న్యూఢిల్లీ : సేవాపన్ను సరిగ్గా కట్టని బాలీవుడ్ స్టార్స్ అందరూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) కనుసన్నల్లోకి వచ్చేశారు. రూ.50 కోట్ల కంటే ఎక్కువ రెవెన్యూలు ఆర్జిస్తున్నప్పటికీ తక్కువ సేవాపన్ను కట్టడం, నిబంధనలను అతిక్రమించడం వంటి వాటికి పాల్పడిన 150 కేసులను కాగ్ గుర్తించింది. ఈ అక్రమాలకు పాల్పడిన వారందరిపై విచారణ సాగిస్తున్నట్టు కాగ్ శుక్రవారం పార్లమెంట్‌కు నివేదించింది. ఈ బాలీవుడ్ దిగ్గజాల్లో సల్మాన్‌ఖాన్, రణబీర్ కపూర్, అజయ్ దేవ్‌గన్, రితీష్ దేశ్‌ముఖ్, అర్జున్ రాంపాల్ ఉన్నారు. అజయ్ దేవ్‌గన్, రితీష్ దేశ్‌ముఖ్, రాంపాళ్లకు షోకాజ్ నోటీసు జారీచేస్తున్నామని కాగ్‌కు, సేవాపన్ను అధికారులు చెప్పినప్పటికీ, ఇప్పటి వరకు తక్కువ పన్ను చెల్లింపులకు ఎందుకు చర్యలు తీసుకోలేదో పన్ను డిపార్ట్‌మెంట్ స్పష్టంచేయలేకపోయింది.
సల్మాన్ ఖాన్, రాంపాల్, రితీష్ దేశ్‌ముఖ్, అజయ్ దేవ్‌గన్‌ల రికార్డులను పరిశీలించినప్పుడు, నిర్మాతలకు, నటులకు మధ్యనున్న ఒప్పందాలను గమనించామని కాగ్ పేర్కొంది. దానిలో ప్రయాణ ఖర్చులు, లాడ్జింగ్, బోర్డింగ్, మేకప్ ఆర్టిస్టు, హై స్టయిలిస్ట్, స్పాట్ బాయ్ వంటి ఖర్చులన్నీ నిర్మాతనే భరిస్తారని రిపోర్టు చెప్పింది. అయితే ఇవన్నీ సర్వీసెస్ కింద అసెసీకి అదనంగా సమకూరుతున్నాయని రిపోర్టులో పేర్కొంది.
కానీ అసెసీలు మాత్రం తమ పన్ను విలువలో ఈ అదనపు విలువలను చూపించడం లేదని కాగ్ తేల్చింది. రణబీర్ కపూర్‌నే తీసుకుంటే.. యే దిల్ హై ముస్కిల్ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిందని, దీన్ని కొంత భాగం భారత్‌లో, కొంత భాగం న్యూయార్క్‌లో తీసినట్టు కాగ్ చెప్పింది. ఈ షూటింగ్‌లో భాగంగా లండన్‌కు చెందిన ఫారిన్ కంపెనీ ఏడీహెచ్‌ఎం ఫిల్మ్స్ లిమిటెడ్ నుంచి రణబీర్‌కు రూ.6.75 కోట్లు లభించాయని, కానీ వాటికి చెల్లించాల్సిన సర్వీసెస్ పన్ను రూ.83.43 లక్షలను ఎక్స్‌పోర్టు సర్వీసుల లాగా ట్రీట్ చేసి, వాటిని చెల్లించలేదని ఆడిటర్ పేర్కొంది.