
ఛాన్స్ కొట్టేసిన కేథరిన్
శింబు హీరోగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నుంచి త్రిషా తప్పుకుంది. దాంతో ఆ ఛాన్స్ చెన్నై భామ కేథరిన్ థెరిసా కొట్టేసింది. త్రిషా తప్పుకోవడంతో హీరోయిన్ అన్వేషణకు అంతగా సమయం లేకపోవడంతో దర్శకుడు సెల్వ వెంటనే కెథరిన్ సంప్రదించాడు. అందుకు ఆమె ఓకే అంది. దాంతో గత ఆదివారం కెథరిన్కు ఆడిషన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా శింభు సరసన నటించి పాత్రలో ఒదిగిపోయే గుణాలు కేథరిన్లో ఉన్నాయని సెల్వ గ్రహించాడు. దాంతో హీరోయిన్గా ఆమెను ఎంపిక చేశారు. శింబు హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ గురువారం అంటే రేపు ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో శింబు, తాప్సీ, కేథరిన్ ప్రధాన పాత్రలు పొషించనున్నారు.
అసలు ఏం జరిగిందంటే...
అయితే త్రిష, వరుణ్ మణియన్తో ప్రేమలో పడటం... నిశ్చితార్థం... ఆ వెంటనే వివాహం రద్దు అన్ని వెంటవెంటనే జరిగిపోయాయి. అయితే వారి పెళ్లి ఎందుకు రద్దు అయింది అన్నది వేరే విషయం. కాకుంటే ఈ చిత్రంలో త్రిష, తాప్సీలపై పోటో షూట్ చేస్తున్న సమయంలో వరుణ్ మణియన్ అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత త్రిష, వరుణ్ వివాహం రద్దయింది. ఆ చిత్రానికి నిధులు వరుణ్ సమకూరుస్తున్నాడని సమాచారం.
త్రిషతో వివాహం రద్దు కావడంతో ఆ చిత్రం నుంచి ఆమెను తప్పించాలని సెల్వను వరుణ్ కోరాడు. అసలే నిధుల సమస్యతో బాధపడుతున్న సెల్వ అలాగే అని ఓకే చెప్పడం... ఆ విషయాన్ని ముందే గమనించిన త్రిష... నాకు డేట్స్ కుదరడం లేదు... నేను ఈ చిత్రంలో నటించలేనని ముందే ప్రకటించింది. దాంతో ఆమె స్థానంలో కేథరిన్ వచ్చి చేరింది.