
నా మాటలు నాకే వెగటు పుట్టించాయి.. మన్నించండి
‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో ఫంక్షన్.
ఏం జరిగింది: ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం’ అని సినిమాలోని డైలాగ్‌పై ‘మీ ఒపీనియన్ ఏంటి?’ అంటూ విచ్చేసిన అతిథులను యాంకర్స్ అడగడం మొదలు పెట్టారు. అందరూ ఎవరికి తోచినట్లు వాళ్లు కామెడీగా చెబుతున్నారు. నటుడు చలపతిరావు ముందు మైక్ పెట్టి, ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా’ అనడిగారు యాంకర్.. దానికి సమాధానంగా ‘‘హానికరం కాదు కానీ, పక్కలోకి పనికొస్తారు’’ అని క్యాజువల్‌గా అనేశారు. అంతే.. దుమారం రేగింది. నలుగురూ నానా రకాలుగా చలపతిరావుని విమర్శించడం మొదలుపెట్టారు. ఆదివారం సాయంత్రం మొదలైన ఈ వివాదం మంగళవారానికి ఊపందుకుంది. చివరికి తాను అలా వ్యాఖ్యలు చేయడం తప్పేనని మంగళవారం చలపతిరావు స్వహస్తాలతో రాసిన లెటర్‌ని మీడియాకు విడుదల చేశారు. ఆ లేఖ సారాంశం ఇది.
73 ఏళ్ళ వయసులో, 50 సంవత్సరాల సినీజీవితంలో అనాలోచితంగా, అన్యోపదేశంగా నేను చేసిన ఒక వ్యాఖ్య దురదృష్టకరం. ఒక మహిళా వ్యాఖ్యాత అడిగిన ప్రశ్న ఇది. ‘‘ఆడవాళ్ళు హానికరమా’’. దానికి జవాబుగా నేను ‘‘ఆడవాళ్ళు హానికరం కాదు’’. ఆ తర్వాత నేను చేసిన ఒక వ్యాఖ్యను టీవీల్లో పదే పదే ప్రచారం చేసి, నన్ను ఒక ‘‘చరిత్రహీనుడిగా’’ మార్చేసిన పరిస్థితి పట్ల నేను బాధపడుతున్నాను. నిజమే... నా వ్యాఖ్యలు నాకే వెగటు పుట్టించాయి. అవి నేను చెయ్యకుండా ఉండాల్సింది.
ఈ వ్యాఖ్యలు అభ్యంతరమే కాదు, ఆక్షేపణీయం కూడా. అందుకే నేను ఎటువంటి షరతులు లేకుండా క్షమాపణలు చెబుతున్నాను. ఇదే సందర్భంలో నాదో చిన్న మనవి. సినిమాల్లో, టీవీల్లో చివరికి ఇప్పటి సామాజిక మాధ్యమాల్లో మహిళల్ని కించపరిచే మాటలకు, దృశ్యశ్రవంగాలకు మనమందరం బాధ్యులమే! పరోక్షంగా, ప్రత్యక్షంగా కూడా! ఆ విషయం మనందరికీ తెలుసు.నాతోపాటు అందరం దీనికి బాధ్యత వహించాల్సిందే. సినిమాల్లో చూపించే దృశ్యాలు, చెప్పే మాటలకు పరిశ్రమలోని రచయితలు, నిర్మాతలు, దర్శకులు, నటులు అందరం బాధ్యత వహించాలి. ఇకముందు నేనే కాదు, మరెవ్వరూ ఇటువంటి దురదృష్టకరమైన పరిస్థితికి కారణం కాకూడదు.
నా మాటలకు, వ్యాఖ్యలకు అందరికీ మరోసారి క్షమాపణలు చెబుతున్నాను. మన్నించండి!
– మీ చలపతిరావు