‘జయ జానకీ నాయక’ మేనేజర్‌పై కేసు నమోదు
బంజారాహిల్స్: ‘జయజానకీ నాయక’ సినిమా షూటింగ్ కోసం వినియోగించిన లైట్లకు సంబంధించిన బకాయిలను అడిగేందుకు వెళ్లిన తనను దుర్భాషలాడడమే కాకుండా డబ్బులు ఎగ్గొట్టారంటూ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ద్వారకా క్రియేషన్స్ మేనేజర్ కిషోర్‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కృష్ణానగర్‌కు చెందిన పెద్దిరెడ్డి అశోక్‌రెడ్డి అనే వ్యక్తి గత ఏడాది డిసెంబర్ నుంచి గత జనవరి 2వ తేదీ వరకు అన్నపూర్ణస్టూడియోలో జరిగిన జయజానకీ నాయక సినిమా పాట చిత్రీకరణ కోసం 250 ఎల్‌ఈడీ ట్యూబులు, 250 కాయిన్‌లైట్లు సరఫరా చేశారు.
ఇందుకుగాను రూ.10.75 లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. షూటింగ్ పూర్తయిన తర్వాత తనకు ఇవ్వాల్సిన బిల్లును ఇవ్వడం లేదని, అడగడానికి వెళ్తే బెదిరింపులకు దిగారని, నిర్మాత బెల్లం కొండ సురేష్‌తో పాటు ఈ సినిమా నిర్మాత రవీందర్‌రెడ్డితో మాట్లాడితే తర్వాత ఇస్తామంటూ చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు వెళ్లగా మేనేజర్ కిషోర్ తనను చంపేస్తానంటూ బెదిరించారని, తనకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిషోర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.