వంద కోట్లు దాటిన చెన్నై ఎక్స్ప్రెస్ వసూళ్లు
దీపికా పదుకొనే అచ్చమైన తమిళ పొణ్నులా చీరకట్టు కట్టి నటించి, రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డులు బద్దలుకొట్టుకుంటూ సాగిపోతోంది. తొలివారంలోనే ఏకంగా 100 కోట్ల రూపాయల వసూళ్లు చేసింది. ఇప్పటి వరకు ఇంత భారీ వసూళ్లు ఏ సినిమాకీ లేవు. అది అద్భుతమైన వారాంతమని ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ చెప్పారు.
రంజాన్ సందర్భంగా ఆగస్టు తొమ్మిదో తేదీ శుక్రవారం నాడు విడుదలైన చెన్నై ఎక్స్ప్రెస్ కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్లు సంపాదించింది. గురువారం నాటి ప్రివ్యూల నుంచి 6.75 కోట్లు, శుక్రవారం విడుదల రోజున 33.12 కోట్లు, శనివారం రెండో రోజు 28.05 కోట్లు, ఆదివారం 32.50 కోట్లు వసూలు చేసింది. మొత్తం 100.42 కోట్ల నెట్ వసూళ్లు జరిగాయి. ఈ సినిమా నిర్మాణ వ్యయం 70 కోట్ల రూపాయలు. మూడు రోజుల్లోనే దాన్ని దాటి ఎక్కడికో వెళ్లిపోవడంతో ఇక కాసుల వర్షమే కురవనుంది. మొదటి వారాంతంలో రికార్డులు బద్దలవుతాయని విడుదలైన రోజే సినీ పండితులు అంచనా వేశారు.
తమిళనాడుకు చెందిన ఓ డాన్ కుమార్తెతో ప్రేమలో పడే ఉత్తరాది కుర్రాడి కథతో రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాలనూ ఆకట్టుకుంటోంది. కేవలం మన దేశంలోనే కాక, విదేశాల్లో కూడా దాని వసూళ్లు బాగున్నాయి. ఆదివారం నాడు షారుక్ ఖాన్ స్వయంగా ముంబైలో ఓ థియేటర్కు వెళ్లి, ప్రేక్షకుల స్పందనను స్వయంగా చూశాడు. యూటీవీ మోషన్ పిక్చర్స్తో కలిసి షారుక్ ఖాన్కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై తీసిన ఈ సినిమా ఇంత విజయం సాధించినా, ఇంకా దాని ప్రమోషన్ మాత్రం ఆగలేదు. మిస్ ఏషియా పసిఫిక్ 2012 హిమాంగిని సింగ్, ఫెమినా మిస్ ఇండియా 2013 ఫైనలిస్టు అఖితా అగ్నిహోత్రి కలిసి ఖట్మాండులో ఈ చిత్రానికి సంబంధించిన ఓ చారిటీ షోలో పాల్గొంటున్నారు. దీని ద్వారా వచ్చే సొమ్మును ముంబైకి చెందిన ప్రాజెక్ట్ క్రేయాన్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా నేపాల్ వరద బాధితులకు అందిస్తారు.