
ఆంగ్ల చిత్రానికి కథ!
విజయవంతమైన సినీ కథా రచయితగా పేరు తెచ్చుకున్న చిన్నికృష్ణ తన కెరీర్‌లో మరో ఘనతను సాధించారు. తాజాగా ఆయన ఓ ఆంగ్ల చిత్రానికి కథ అందిస్తున్నారు. ప్రసిద్ధ సినీ నిర్మాణ సంస్థ తన్వీర్ గ్రూప్ నిర్మించనున్న ఓ ఆంగ్ల చిత్రానికి ఆయన రచన చేస్తున్నారు. హాలీవుడ్‌లో యాక్షన్ స్టార్ అయిన వాన్‌డెమ్ నటించనున్న ఈ చిత్రంలో మరో కథానాయకునిగా బాలీవుడ్‌కి చెందిన ఓ స్టార్ హీరో లేక దక్షిణాది స్టార్ హీరో కానీ నటిస్తారు. 500కి పైగా ఆంగ్ల చిత్రాలను ఇక్కడి ప్రేక్షకుల ముందుకు తెచ్చిన నిర్మాత ఆర్.కె. భగవాన్ స్వయంగా చిన్నికృష్ణ పేరును తన్వీర్ గ్రూప్ ఇండియన్ సీఈవో శైలేష్‌కి సూచించారట. ఆ సంస్థ ఆహ్వానంపై ఇటీవల గ్రీస్ వెళ్లిన చిన్నికృష్ణ ఆ ప్రాజెక్ట్‌ని ఫైనలైజ్ చేసుకుని వచ్చారు. ఒప్పందం ప్రకారం వచ్చే ఏడాది జనవరి కల్లా కథ పూర్తి చేయాలి కాబట్టి, కథారచన ప్రారంభించారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తిగా విదేశాల్లోనే జరుగుతుంది.