
‘‘తమ్మారెడ్డి భరద్వాజ, విజయ్, యువన్ శంకర్‌రాజా వల్లే ‘ప్యార్ ప్రేమ కాదల్’ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ఒప్పుకున్నా. తమ్మారెడ్డితో 40ఏళ్ల అనుబంధం ఉంది. నా ఫేవరెట్ సంగీత దర్శకుడు యువన్. 1980లలో ఎన్నో హిట్లిచ్చిన ఇళయరాజా కొడుకు అవ్వడం వల్లనే తనంటే అంత ఇష్టం. ‘మా’ అసోసియేషన్ విజయ్ సోదరుడితో సమానం. యువ ప్రతిభావంతులు పరిశ్రమకు రావాలి. ఏ భాష సినిమా అయినా బావుంటే మన తెలుగు ప్రేక్షకులు చూడాలి’’ అని చిరంజీవి అన్నారు. సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా నిర్మించిన తొలి చిత్రం ‘ప్యార్ ప్రేమ కాదల్’. హరీష్ కల్యాణ్, రైజ విల్సన్ జంటగా ఎలన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్ పతాకంపై యువన్ శంకర్ రాజా, విజయ్ మోర్వనేని అక్టోబరులో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
ఈ సినిమా ట్రైలర్‌ని చిరంజీవి రిలీజ్ చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘నాన్నగారిపై కోపంతో చిరంజీవికి ఫోన్ చేసి మనం సినిమా చేయాలి అని అడిగాను. కథేంటి.. దర్శకుడెవరు? అన్నది అడగకుండా అంగీకరించారు. చిరంజీవితో 40 ఏళ్ల క్రితం ‘మొగుడు కావాలి’ సినిమా తీశాను. ఆయనతో నేను రెండు సినిమాలు చేసినా చిరంజీవికి డబ్బులు ఇవ్వలేదు. నేను దర్శకుడిగా మారి ‘అలజడి’ సినిమా చేశా. నేను పిలవకుండానే చిరంజీవి వచ్చి సక్సెస్ పార్టీ ఇచ్చారు. ఆ రోజు చిరంజీవి వేరు. ఇప్పుడు చిరంజీవి వేరు. ఎంతో కష్టపడ్డారు కాబట్టే 40 ఏళ్లలో ఆయన మెగాస్టార్ అయ్యారు’’ అన్నారు. యువన్ శంకర్ రాజా, విజయ్ మోర్వనేని పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా.
Comments
Please login to add a commentAdd a comment