
అదే రక్తం అదే పౌరుషం...
‘కాశీకి పోయాడు, కాషాయం మనిషైపోయాడు అనుకుంటున్నారా? వారణాసిలో బతుకుతున్నాడు, తన వరస మార్చుంటాడనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం.’ - ఇంద్రలో చిరంజీవి చెప్పిన డైలాగ్ ఇది. తొమ్మిదేళ్ల తర్వాత హీరోగా ఆయన మళ్లీ మేకప్ వేసుకున్నారు. ‘ఇప్పుడూ అదే ఎనర్జీతో డైలాగ్స్ చెబుతున్నారు.. అదే రాకింగ్ పర్ఫార్మెన్స్’ అని చిత్రబృందం అంటున్నారు.
వీవీ వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి 150వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ మొదలైంది. హైదరాబాద్ నగర శివార్లలోని చేవెళ్లలో షూటింగ్ జరుగుతోంది. రైతు సమస్యలపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ‘మెగాస్టార్ రాక్స్!! వాట్ ఎన్ ఎనర్జీ!!’ అని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ట్వీట్ చేశారు. ఓ వైపు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.. మరోవైపు చిరు సరసన నటించబోయే కథానాయికను ఇంకా ఎంపిక చేయలేదు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలువురి అగ్ర కథానాయికల పేర్లు పరిశీలనలోకి వచ్చాయట.
కానీ, తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న కథానాయికను ఎంపిక చేయమని చిరు సలహా ఇచ్చారని సమాచారం. కథానాయిక ఎంపిక విషయాన్ని దర్శకుడు వీవీ వినాయక్, నిర్మాత రామ్‌చరణ్‌లకు వదిలేశారట. సో, తండ్రి పక్కన సూటయ్యే కథానాయిక కోసం చరణ్ అన్వేషిస్తున్నారు. ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం మేరకు కాజల్ అగర్వాల్ పేరు వినిపిస్తోంది. అలాగే ఈ చిత్రానికి ‘ఖైదీ నం. 150’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారట.