అమ్మాయిలకు ఇండియానే పేటెంట్
కలర్‌ఫుల్ అమ్మాయిలకు ఇండియానే పేటెంట్ అని నటి తమన్నా అంటున్నారు. అందానికే అందం ఈ పుత్తడి బొమ్మ అని ఈ మిల్కీబ్యూటీని పేర్కొనవచ్చు. పాలరాతి బొమ్మలాంటి మేనందంతో కుర్రకారుని కిర్రెక్కిస్తున్న తమన్నా దశాబ్దం దాటి నేటికీ మేటి నటిగా రాణిస్తున్నారు. రాజమౌళి బాహుబలి చిత్రం తమన్నా ముఖ చిత్రాన్నే మార్చేసింది. ఆ చిత్రంలో అంత అందంగా ప్రేక్షకులను కనువిందు చేశారు. దీంతో ప్రస్తుతం బాహుబలి–2 కోసం అన్ని వర్గాల వారు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక తమిళంలో శింబుతో రొమాన్స్ చేస్తున్న ట్రిబుల్ ఏ( అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్) చిత్రంపైనా అంచనాలు పెరుగుతున్నాయి.
ఇలా ఉండగా దక్షిణాదిలో పాలరాతి బొమ్మలుగా పేరు తెచ్చుకున్న నటి తమన్నా, హన్సిక ఆమె మేని ఛాయ కారణంగా కొన్ని అవకాశాలు కొల్పోవలసి వచ్చిందా? కలర్ తక్కువ హీరోయిన్లకే కథా బలం ఉన్న అవకాశాలు లభిస్తున్నాయా? ఇలాంటి ప్రచారం పరిశ్రమ వర్గాల్లో హల్‌చల్ చేస్తుండడంతో అదే ప్రశ్నను నటి తమన్నా ముందుంచగా తను ఎలాంటి బదులిచ్చారో చూద్దాం. కలర్ నాకు ఎలాంటి ఇబ్బందిని కలిగించలేదు. నాకు రావలసిన అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే నేను నటించిన రెండు చిత్రాల్లో కాస్త రంగు ఛాయ తగ్గించుకునే నటించాను. అందులో ఒకటి బాహుబలి. ఆ చిత్రం ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శరీర ఛాయ అన్నది ఒక సమస్య కానే కాదు. ఇంకా చెప్పాలంటే కలర్‌ఫుల్ అమ్మాయిలకు ఇండియానే పేటెంట్. మహిళలు ఏ కలర్‌లో ఉన్నా అది వారికి అందమే.