అవును... కామెడీ సుధాకర్ మళ్లీ వచ్చాడు!
నాయకుడు, ప్రతినాయకుడు, హాస్యనటుడు, సహాయ నటుడు... ఇలా అన్ని పార్శ్వాల్లోనూ భేష్ అనిపించుకునే నటులు కొంతమందే ఉంటారు. అలాంటివారిలో సుధాకర్ ఒకరు. ఒకప్పుడు తమిళంలో తిరుగులేని కథానాయకుడు అనిపించుకొని, తెలుగులో ‘కింగ్ ఆఫ్ కామెడీ’ అన్నంత పేరు తెచ్చుకున్న సుధాకర్ చాలా కాలం తరువాత మళ్ళీ కెమేరా ముందుకు వచ్చారు. దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు రామ్ శంకర్ (సాయిరామ్ శంకర్) హీరోగా నటిస్తున్న ‘వాడు నేను కాదు!’ సుధాకర్ కమ్‌బ్యాక్ మూవీ. సంభాషణలు పలికే తీరులో ప్రత్యేక శైలి కనబరిచే సుధాకర్ ఈ చిత్రంలో మంచి పాత్ర చేస్తున్నట్లు పేర్కొన్నారు. మొన్న జూన్ 5, 6 తేదీల్లో రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగిన షూటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. సుధాకర్‌ను అభిమానించేవారికి ఇది నిజంగా తీపి కబురే.
సుధాకర్ కమ్‌బ్యాక్ ఎలా జరిగిందంటే...
హీరో రామ్ శంకర్ ఆ మధ్య తన తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం ఎడిటింగ్ కోసం, దర్శకుడు సుదర్శన్‌తో కలసి ఒక ఎడిటింగ్ సూట్‌కు వెళ్ళారట. తీరా చూస్తే, అది కమెడియన్ సుధాకర్ ఇల్లనీ, ఎడిటింగ్ సూట్ పై భాగంలోనే ఆయన ఉంటారనీ తెలిసి, ఆయనను కలిశారు. ‘‘పూర్తి ఆరోగ్యంతో ఉన్న ఆయనను పలకరించి, మళ్ళీ సినిమాల్లో నటిస్తే బాగుంటుందన్నాం. మొదట ఆయన మొహమాటపడ్డారు. కొన్నాళ్ళ తరువాత ఓ.కె. అన్నారు. ఆ విషయం దర్శక - నిర్మాత వినోద్ విజయన్‌కు చెప్పగానే, అయిదు భాషల్లో తీస్తున్న ‘వాడు నేను కాదు!’లో ఒక మంచి పాత్ర సుధాకర్‌కు ఇచ్చారు’’ అని రామ్‌శంకర్, ‘సాక్షి’కి వివరించారు. ‘‘ఏడేళ్ళ విరామం తరువాత మళ్ళీ కెమేరా ముందుకు’’ వచ్చిన సుధాకర్ ఈ చిత్రంలో హీరోకు మేనమామగా, కథతో లింకున్న ఒక ముఖ్య పాత్ర ధరిస్తున్నారు. చాలా కాలంగా ఇంట్లో ట్రాక్ ప్యాంట్, టీ షర్ట్‌లకే పరిమితమై, ఇన్నాళ్ళకు మళ్ళీ షూటింగ్‌కు వచ్చిన సుధాకర్‌కు సెట్ వాతావరణం మళ్ళీ కొత్త శక్తినీ, ఉత్సాహాన్నీ ఇచ్చిందని యూనిట్ సభ్యులు చెప్పారు. సీన్ పేపర్ ముందుగా చదువుకొని, నటనకు సిద్ధమవుతున్న తీరు చూస్తుంటే, మళ్ళీ పాత సుధాకర్‌ను చూసినట్లుందట!
నేనిప్పుడు బ్రహ్మాండంగా ఉన్నా! - సుధాకర్
ఆరోగ్యం బాగాలేకపోవడం వల్లే ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. ‘‘ఇప్పుడు చాలా హ్యాపీగా, ఆరోగ్యంగా ఉన్నాను. ఐయామ్ ఫిట్ ఎగైన్ నౌ’’ అని సుధాకర్ తాజాగా ప్రకటించారు. కాగా, సుధాకర్‌కి సినిమాలు తగ్గడానికి కారణం ఆయన మద్యానికి బానిస కావడమే అన్న అభిప్రాయం పలువురికి ఉంది. ఈ విషయం గురించి సుధాకర్ క్లారిటీ ఇచ్చారు. ‘‘నాకంటూ కొన్ని నియమాలు, పద్ధతులు ఉండేవి. యోగా చేసేవాణ్ణి. నేను వేసే క్లిష్టమైన ఆసనాలు చాలామంది వేయలేరు కూడా! రోజూ యోగా చేశాకే షూటింగ్‌కు వెళ్లేవాణ్ణి. అంతేకానీ, చాలామంది ఊహించినట్లు నేను అదే పనిగా తాగుతూ ఉండేవాణ్ణి కాదు. షూటింగ్ నుంచి వచ్చాక రిలాక్సేషన్ కోసం కొద్దిగా డ్రింక్ చేసేవాణ్ణి. వృత్తి విషయంలో చాలా క్రమశిక్షణగా ఉండేవాణ్ణి. అలా ఉన్నాను కాబట్టే, నాలుగు వందల సినిమాల వరకూ చేయగలిగాను. మధ్యలో ఆరోగ్యం బాగాలేకే సినిమాలకు దూరంగా ఉన్నాను తప్ప, వేరే కారణాలేవీ లేవు. ఒక మంచి పాత్ర ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది’’ అని సుధాకర్ చెప్పారు. ‘బిష... బిష’ అంటూ వెరైటీ కామెడీతో ఒకప్పుడు అందర్నీ నవ్వించిన సుధాకర్ సెకండ్ ఇన్నింగ్స్‌లో మళ్ళీ అంత వినోదం పంచితే, ప్రేక్షకులకు అంతకన్నా ఆనందం ఇంకేం కావాలి!