
సాక్షి, విజయవాడ: విడుదలకు ముందురోజు పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘అజ్ఞాతవాసి’పై విజయవాడలో ఫిర్యాదు నమోదైంది. ఈ సినిమాలో ఒక పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోటేశ్వరరావు అనే న్యాయవాది మాచవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ‘కొడకా కోటేశ్వరరావు ఖరుసైపోతవురో..’ పాట కోటేశ్వరరావు అనే పేరు గల వ్యక్తులను కించపర్చేవిధంగా ఉన్నదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే ఈ పాటను సినిమా నుంచి తొలగించాలని ఆయన కోరారు. కాగా, తమపై విమర్శలు చేస్తున్న కత్తి మహేశ్‌ను తిడుతూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ పాటకు స్పూఫ్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మరోవైపు ‘అజ్ఞాతవాసి’ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. తెలంగాణలో ప్రత్యేక ప్రదర్శనలకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఈ అర్ధరాత్రి నుంచి ‘అజ్ఞాతవాసి’ స్పెషల్ షోలు మొదలవుతాయి. అర్థరాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 10 గంటల మధ్య ప్రత్యేక షోలు వేసేందుకు ఏపీ సర్కారు అనుమతిచ్చింది.
ప్రత్యేక ప్రదర్శనలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ధియేటర్ల యాజమాన్యాలు వెనక్కు తగ్గాయి. స్పెషల్ షోలు వేయడం లేదని, ప్రత్యేక ప్రదర్శనల పేరుతో ఎవరైనా టిక్కెట్లు అమ్మితే కొనొద్దని అభిమానులకు సూచించాయి. ఈమేరకు హైదరాబాద్‌లోని భ్రమరాంబ, మల్లికార్జున ధియేటర్ల యాజమాన్యం ప్లెక్సీలు ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment