
బాహుబలి దర్శకుడు, నిర్మాతలపై ఫిర్యాదు
హైదరాబాద్: ఇటీవల విడుదలైన బాహుబలి–2 సినిమాలో తమ కులాన్ని కించపరిచే విధంగా ‘కటిక చీకటి’ అనే పదాన్ని వాడి ఆరె కటికల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆరోపిస్తూ బాహుబలి సినిమా దర్శక, నిర్మాతలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ఆదివారం ఆరెకటిక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోగికార్ సుధాకర్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సినిమాలో కటిక చీకటి అన్న పదాన్ని వాడటం వల్ల సెన్సార్ నిబంధనలను కూడా ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు.
ఆ పదాన్ని తొలగించకపోతే దర్శకుడు రాజమౌళి ఇంటిని ముట్టడిస్తామని అప్పటికీ మార్పు రాకపోతే సినిమా థియేటర్ల వద్ద ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఫిర్యాదు చేసిన వారిలో సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు అనిల్‌కుమార్, మహేష్, సంతోష్, గురుచరణ్ తదితరులు ఉన్నారు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించారు. న్యాయసలహా అనంతరం కేసు నమోదు చేయాలా వద్దా నిర్ణయం తీసుకుంటామని సీఐ శ్రీనివాస్ తెలిపారు.