
క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా ద్రువంగళ్ పదునారు
ప్రేమ లేదు, పాటలు లేవు, ఫైట్స్ లేవు, డబుల్ మీనింగ్ కామెడీ లేదు. పంచ్‌డైలాగ్స్ లేవు, అసలు కథానాయికే లేదు ఇలాంటి సాధారణ సన్నివేశాలేమీ లేకుండా రూపొందిన చిత్రం ద్రువంగళ్ పదునారు. అయితే ఈ చిత్రంలో ఏముందంటారా? జెట్ వేగంగా సాగే కథ, కథనాలు అంటున్నారు ఆ చిత్ర దర్శక నిర్మాత కార్తీక్ నరేన్. కేవలం 21 ఏళ్ల యువకుడీయన. మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థి అయిన ఆయన సినిమా మోహంతో విద్యను మధ్యలోనే నిలిపేసి తొలుత లఘు చిత్రాలతో తన ప్రతిభను చాటుకున్నారు. విళియన్ సువడుగళ్, నిరం మూండ్రు, ఊమైగళ్, పిరది వంటి లఘు చిత్రాలను రూపొందించి పలువురి ప్రశంసలు పొందారు. తాజాగా వెండితెరపై దృష్టి సారించారు.ఈయన దర్శక నిర్మాతగా నైట్ నాస్ట్రాలజియా ఫిలిమోటెయిన్‌మెంట్ పతాకంపై రూపొందించిన చిత్రం ద్రువంగళ్ పదునారు.
అందరూ కొత్తవాళ్లతో తెరకెక్కించిన ఈ చిత్రంలో నటుడు రెహ్మాన్ పోలీసు అధికారిగా ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రం గురించి దర్శక నిర్మాత కార్తీక్ నరేన్ తెలుపుతూ ఇందులో 16 మంది నటించారన్నారు. ప్రతి పాత్ర ఒక ద్రువంగా అనిపిస్తుందన్నారు. దీనికి ద్రువంగళ్ పదునారు పేరు పెట్టడానికి ఇది కూడా ఒక కారణం అన్నారు. అంతే కాకుండా 16 గంటల్లో జరిగే క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రం ఇదని తెలిపారు. చిత్ర వేగాన్ని తగ్గిస్తాయన్న భావనతో ఇందులో పాటలను పొందుపరచలేదనిపేర్కొన్నారు. కోవై నేపథ్యంలో సాగే ఈ చిత్ర షూటింగ్‌ను కోవై, ఊటీ, చెన్నై ప్రాంతాల్లో నిర్వహించినట్లు వెల్లడించారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని పలువురు చిత్ర ప్రముఖులు చూసి చాలా బాగుందని అభినందించారన్నారు. డ్రీమ్ ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్ర విడుదల హక్కులను పొందిందని కార్తీక్ నరేన్ వెల్లడించారు.