
ప్రజా సమస్యలపై 17, 19 తేదీలలో పోరుబాట: రెహ్మాన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై ఈ నెల 17, 19 తేదీలలో పోరుబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్‌ఎ. రెహమాన్ వెల్లడించారు. హైదరాబాద్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ 10 జిల్లాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఓ ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. ప్రజల సమస్యలపై పోరాటం చేసేందుకు ఈ నెల 17న మహబూబ్‌నగర్ జిల్లాలో 19న నల్గొండ జిల్లాలో పర్యటిస్తామన్నారు. అలాగే త్వరలోనే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు.
ఇంట్లో ఒక్కరికి మాత్రమే పెన్షన్ నిబంధనతో చాలా మంది వృద్ధులకు పింఛన్ అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వం దీనిపై పునరాలోచించాలని కోరారు. ఏపీలో చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ప్రజలు ఆయనను ఎందుకు అధికారంలోకి తెచ్చామని బాధపడే పరిస్థితి నెలకొందన్నారు. తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి వెంటనే గ్రేటర్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రేటర్‌లో వైసీపీ పాగా వేసేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. తెలంగాణ జిల్లాల్లో ప్రతి ఇంటిపై వైసీపీ జెండా ఉండేలా పార్టీని బలోపేతం చేస్తామని ఆయన అన్నారు. రాష్ట్రంలో వక్ఫ్ భూములను రక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ చూపాలని కోరారు.