విమానానికి వేలాడుతూ... ఏడు టేక్‌లు
‘‘విమానం టేకాఫ్ అవుతూ ఉంటే దాని తలుపు పట్టుకుని వేలాడాలి. ఈ చిత్రానికి ఇది కీలకమైన ఘట్టం. చేసేటప్పుడు ఏ మాత్రం తేడా జరిగినా ప్రాణాలు గాల్లోకే. కానీ, వేరే మార్గం లేదు. చేస్తేనే బాగుంటుంది’’ అని హీరో టామ్ క్రూజ్‌తో అన్నారు దర్శకుడు క్రిస్టఫర్ మెక్వైర్. ‘మిషన్ ఇంపాజిబుల్ సిరీస్’లోని అయిదో భాగం ‘రోగ్ నేషన్ ’కి ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. టామ్ క్రూజ్ హీరో. దర్శకుడు చెప్పిన రిస్కీ సీన్‌కు ‘ఊహూ’ అనకుండా టామ్ క్రూజ్ ‘ఓకే’ అనేశారు. ఎలాగైనా సరే, ఒకే టేక్‌లోనే పూర్తి చేస్తే చాలనుకున్నారు చిత్ర బృందం. దర్శకుడు క్రిస్టఫర్ ‘యాక్షన్’ అనగానే విమానం టేకాఫ్ అయింది.
గాల్లో ఎగురుతోంది. మానిటర్‌లో ఇదంతా చూస్తున్న దర్శకుడు సంతృప్తి చెంది, షాట్ ఓకే అనుకుని ‘కట్’ చెప్పారు. విమానం ల్యాండ్ అయ్యాక సీన్ చూసుకున్న టామ్ క్రూజ్ ఏ మాత్రం కన్విన్స్ కాలేదు. ‘ఇంకోసారి చేస్తా’ అన్నారు. ఈసారి కూడా ఆయనకు సంతృప్తి కలగలేదు. అలా మొత్తం ఏడు టేక్‌లు తీసుకున్నారు. సీన్ ఓకే అయింది. యూనిట్ మొత్తం హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది.
‘‘విమానం ఎగిరే కొద్దీ గాలి నన్ను బాగా వెనక్కు తన్నింది. గాలి శక్తేంటో ఇప్పుడు తెలిసింది. విమానం నేల మీద ల్యాండ్ అయ్యేంత వరకూ నేను దాన్ని పట్టుకుని వేలాడాల్సిందే’’ అని ఆ సీన్ గురించి టామ్ వివరించారు. ఈ సిరీస్‌లో గత భాగం ‘ఘోస్ట్ ప్రొటోకాల్’లో కూడా దుబాయ్‌లోని ప్రపంచంలో ఎత్తయిన బిల్డింగ్ బూర్జ్ ఖలీఫా టవర్ పై రిస్కీ స్టంట్స్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు టామ్.