Mission Impossible series
-
రిలీజ్‌కు రెడీ అయిన టామ్ క్రూజ్ ‘మిషన్: ఇంపాజిబుల్’
టామ్ క్రూజ్ నటించిన చిత్రం ‘మిషన్: ఇంపాజిబుల్–డెడ్ రికనింగ్ పార్ట్ వన్’. క్రిస్టోఫర్ మెక్ క్వారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, ఇంగ్లిష్, హిందీ, తమిళ భాషల్లో రేపు(బుధవారం) విడుదలవుతోంది. ‘‘మిషన్: ఇంపాజిబుల్–ఫాల్ అవుట్ (2018)కి సీక్వెల్, 7వ విడత ‘మిషన్: ఇంపాజిబుల్’ ఫిల్మ్ సిరీస్‌గా రూపొందిన చిత్రం ‘మిషన్: ఇంపాజిబుల్–డెడ్ రికనింగ్ పార్ట్ వన్’. ఏతాన్ హంట్ (టామ్ క్రూజ్), అతని ఐఎమ్ఎఫ్ (ఇంపాజిబుల్ మిషన్ ఫోర్స్) బృందం ఓ ప్రమాదకరమైన మిషన్‌ను ప్రారంభిస్తారు. ఆ మిషన్ ఏంటి? టామ్ క్రూజ్ ఇప్పటివరకూ చేయని, ఈ మూవీలో చేసిన ప్రమాదకరమైన స్టంట్ ఏంటి? అనేది సినిమాలో చూడాల్సిందే’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
కొండపై నుంచి బైక్‌తో సహా దూకిన హీరో..
Tom Cruise Mission Impossible Dead Reckoning Part One Trailer Released: యాక్షన్ ప్రియులను సీట్ ఎడ్జ్‌లో కూర్చుండపెట్టే సినిమాలలో మిషన్ ఇంపాజిబుల్ మూవీ ఫ్రాంచైజీ ఒకటి. హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ ఏజెంట్ 'ఈథన్ హంట్'గా ఆద్యంతం ఆకట్టుకుంటున్న ఈ మూవీ సిరీస్‌కు క్రేజ్ ఎక్కువే. ఈ సినిమాల్లో టామ్ యాక్షన్ సీక్వెన్స్, అడ్వంచెర్స్ మైండ్ బ్లోయింగ్ థ్రిల్ అందిస్తాయి. ఇక పరిస్థితులకు తగినట్లు వివిధ పాత్రల గెటప్పుల్లోకి హీరో మారే సన్నివేశాలు మంచి కిక్కిస్తాయి. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటివరకు వచ్చిన ఆరు సినిమాలు ఎంతో అలరించాయి. ప్రస్తుతం సిరీస్ నుంచి 7, 8వ సినిమాలు రానున్న విషయం తెలిసిందే. తాజాగా 'మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ పార్ట్ వన్'గా ఏడో సినిమా ట్రైలర్‌ను సోమవారం (మే 24) రాత్రి విడుదల చేశారు. ''గ్రేటర్ గుడ్'గా పిలవబడే మీ పోరాట రోజులు ముగిశాయి'' అంటూ ప్రారంభమైన ట్రైలర్ యాక్షన్ సీన్స్‌తో ఆద్యంత ఆకట్టుకునేలా ఉంది. లొకేషన్లు, సీన్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. ట్రైలర్ చూస్తుంటే ఏదో ఒక 'కీ' నేపథ్యంలో సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ చివర్లో కొండపై నుంచి బైక్‌తో సహా హీరో దూకే సీన్ థ్రిల్లింగ్‌గా ఉంది. 1996లో వచ్చిన 'మిషన్ ఇంపాజిబుల్' మొదటి సినిమాలోని ఐఎమ్ఎఫ్ డైరెక్టర్ యూజీన్ కిట్రిడ్జ్గా కనిపించిన హెన్రీ జెర్నీ ఇందులో నటించడం విశేషం. చదవండి:👇 36 ఏళ్ల తర్వాత సీక్వెల్.. బడ్జెట్ రూ. 12 వందల కోట్లు ఈ సినిమాకు క్రిస్టోఫర్ మెక్‌క్వారీ కథ, దర్శకత్వం అందించారు. ఇతను 2015లో 'రోగ్ నేషన్', 2018లో 'ఫాల్ అవుట్' సినిమాలను డైరెక్ట్ చేశాడు. 'డెడ్రెకనింగ్ పార్ట్ 1' జూలై 14, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. 2024లో 'డెడ్రెకనింగ్ పార్ట్ 2' విడుదల కానుంది. అయితే ఇదే ఈథన్ హంట్‌గా టామ్ క్రూజ్ చివరి సినిమా అని సమాచారం. -
ఆ యాక్షన్ చిత్రాల ఫ్యాన్స్‌కు నిరాశే.. మళ్లీ వాయిదా
ప్రేక్షకులను అద్భుతంగా అలరించే హాలీవుడ్ యాక్షన్ చిత్రాల్లో మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ ఒకటి. ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ హీరోగా నటించే ఈ ఫ్రాంచైజీకి క్రేజ్ ఎక్కువే. ఈ సినిమాల్లో టామ్ చేసే యాక్షన్ సీక్వెన్స్, సాహసాలు ఆడియెన్స్‌ను సీటుకు కట్టిపడేస్తాయి. ఇక ఈథన్ హంట్ (సిరీస్‌లో టామ్ క్రూజ్ పాత్ర పేరు) తరచుగా మార్చే గెటప్పులు ఆహా అనిపిస్తాయి. అంతేకాకుండా ఈ ఫ్రాంచైజీలోని ప్రతినాయకుల విలనిజం, హీరోయిన్లు గ్లామర్ అదనపు ఆకర్షణ. అయితే ఇంతగా అలరించే ఈ సిరీస్‌లో వచ్చే సినిమాలు మళ్లీ వాయిదా పడి అభిమానులకు నిరాశకు గురిచేశారు. (చదవండి: అత్యధిక నిడివి ఉన్న చిత్రం ఇదేనట !.. భారీగా అంచనాలు) ఈ సిరీస్‌లో ఇదివరకు 6 సినిమాలు వచ్చి ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ఇప్పుడు కొత్తగా 7, 8 సినిమాలు వరుస పెట్టి రానున్న సంగతి తెలిసిందే. మిషన్ ఇంపాజిబుల్ 7వ సినిమాను సెప్టెంబర్ 2022లో థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఆ తర్వాత జూలై 2023లో ఎనిమిదవ చిత్రాన్ని రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ కొవిడ్ కారణంగా ఈ సినిమాలు మరింత ఆలస్యం కానున్నాయి. ఈ విషయాన్ని పారామౌంట్ పిక్చర్స్, స్కైడాన్స్ నిర్మాణ సంస్థలు శుక్రవారం (జనవరి 21) ఒక ప్రకటనలో తెలిపాయి. (చదవండి: 'స్క్విడ్ గేమ్' మళ్లీ రానుంది.. ఈసారి ఎలాంటి గేమ్ ?) అనేక పరిశీలనల తర్వాత ఆలోచించుకుని కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ సినిమాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ సిరీస్‌లోని 7వ చిత్రాన్ని జూలై 14, 2023న, 8వ మూవీని జూన్ 28, 2024న విడుదల చేయనున్నట్లు వెల్లడించాయి. ఇక ఈ సినిమాలు ఆ తేదీల్లో విడుదలవుతాయో లేదా కరోనా కారణంగా ఇంకా వాయిదా పడతాయో చూడాలి. (చదవండి: ఆస్కార్ బరిలో 'నో టైమ్ టు డై'.. 4 విభాగాలకు నామినేట్) -
సినీ ఫక్కీలో స్టార్ హీరో కారు చోరీ
హాలీవుడ్ స్టార్ నటుడు టామ్ క్రూజ్‌కు చెందిన ఓ లగ్జరీ కారు సినీ ఫక్కీలో చోరీకి గురైంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న కారును పక్కా స్కెచ్‌తో అవలీలగా ఎత్తుకెళ్లిపోయారు. దాదాపు కోటి రూపాయలకు పైగా విలువ చేసే ఆ బీఎండబ్ల్యూ కారును.. చివరికి ఎలాగోలా ట్రేస్ చేయగలిగిన పోలీసులు. కానీ.. కారులో విలువైన లగేజీ, కొంత డబ్బును మాత్రం ఎత్తుకెళ్లిపోయారు. ప్రస్తుతం బర్మింగ్హమ్(ఇంగ్లండ్)లో మిషన్ ఇంపాజిబుల్ ఏడో పార్ట్ షూటింగ్ జరుగుతోంది. ఓ లగ్జరీ హోటల్లో సినిమా యూనిట్ బస చేసింది. అయితే కారు బయట పార్కింగ్ చేసిన కాస్ట్లీ కారును దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. చాలా తెలివిగా.. మోడ్రన్ డే కారులు కీలెస్గా, ఇగ్నిషన్ ఫోబ్స్తో వస్తున్నాయి. ఇది దొంగలకు అనుకూలంగా మారుతోంది. వైర్లెస్ ట్రాన్స్మీటర్లను ఉపయోగించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇదే తీరులో టామ్ క్రూజ్ కారు చోరీకి గురైంది. కారుకు దగ్గరగా నిలబడ్డ దొంగలు.. ఫ్రీక్వెన్సీ మీటర్ల ద్వారా ఫోబ్ సిగ్నల్‌ను క్యాప్చర్ చేయగలిగారు. అదే టైంలో ఒరిజినల్ ఫోబ్‌ను రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగా పని చేయకుండా చేశారు. అటుపై దర్జాగా కారును వేసుకుని వెళ్లిపోయారు. కారు చోరీకి గురైందని గుర్తించిన టామ్ క్రూజ్ బాడీగార్డులు.. పోలీసులకు సమాచారం అందించారు. ట్రాకింగ్ సిస్టమ్ ఆధారంగా ట్రేస్ చేసి.. స్మెత్విక్ విలేజ్‌లో కారును గుర్తించారు. అయితే కారు దొరికినప్పటికీ.. అందులో లగేజీ, కొంత డబ్బు మాయమైనట్లు తెలుస్తోంది. దాదాపు లక్ష పౌండ్లు విలువ(మన కరెన్సీలో కోటి రూపాయలు) చేసే బీఎండబ్ల్యూ ఎక్స్7.. 4.4 లీటర్ V8 ఇంజిన్, 523 హార్స్ పవర్ ఇంజిన్, నాలుగు సెకన్లలో 96 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకునే సామర్థ్యం ఉంది. టాప్ స్పీడ్ 249 కిలోమీటర్లు. ఇక కరోనా కారణంగా ఆలస్యమవుతూ వస్తున్న.. MI-7 వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ కానుంది. -
ప్లాన్..ఇంపాజిబుల్..కరోనాతో ఆగిన షూటింగ్
హాలీవుడ్ చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ చిత్రీకరణ కరోనా కారణంగా నిలిచిపోయింది. టామ్ క్రూజ్ నటిస్తున్న ఈ యాక్షన్ స్పై ఫిల్మ్‌కి క్రిస్టోఫర్ మెక్వారీ దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ సినిమా చిత్రీకరణ యూకేలో జరుగుతోంది. అయితే రెగ్యులర్ కోవిడ్ టెస్టుల్లో భాగంగా చిత్రబృందానికి కరోనా పరీక్షలు చేయగా కొంతమందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చినవారి సంఖ్య 10మందికి పైనే ఉందని హాలీవుడ్ మీడియా చెబుతోంది. దీంతో ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ షూటింగ్‌ను జూన్ 14 వరకు నిలిపి వేశారు. ఇక గత ఏడాది అక్టోబరులో కూడా ఈ చిత్రబృందంలో 12 మందికి కరోనా వచ్చి, షూటింగ్ నిలిచిపోయింది. ఇప్పుడు కరోనా వల్ల మరోసారి షూటింగ్ ప్లాన్ ఇంపాజిబుల్ (అసాధ్యం) అయింది. ఈ ఏడాది విడుదల కావాల్సిన ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వచ్చే ఏడాది వేసవికి వాయిదా పడింది. -
Prabhas: ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీపై డైరెక్టర్ క్లారిటీ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. హాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించేందుకు ప్రభాస్ సిద్ధమయ్యారంటూ గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ హాలీవుడ్ చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్ 7’లొ ప్రభాస్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా ఈ సినిమా దర్శకుడు క్రిస్టోఫర్ మెక్‌క్వారీ ప్రభాస్ పై హాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. మీరు తెరకెక్కిస్తున్న ‘మిషన్ ఇంపాజిబుల్-7’లో ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ కీ రోల్ పోషించనున్నారంటూ గత కొంతకాలంగా ఇక్కడ పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దయచేసి అందులో ఎంత నిజముందో చెప్పగలరు?’ అని నెటిజన్ కోరగా.. ‘ప్రభాస్ ఎంతో టాలెంట్ కలిగిన వ్యక్తి. కానీ ఇప్పటి వరకూ ఆయన్ని నేను కలవలేదు’ అని క్రిస్టోఫర్ రిప్లై ఇచ్చారు. ఆయన పెట్టిన ట్వీట్‌తో ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. While he‘s a very talented man, we’ve never met. Welcome to the internet. https://t.co/mvVFP6N4zV — Christopher McQuarrie (@chrismcquarrie) May 26, 2021 -
మిషన్ డేట్ మారింది
టామ్ క్రూజ్ ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న హాలీవుడ్ యాక్షన్ చిత్రం ‘మిషన్ ఇంపాసిబుల్ 7’. క్రిస్టోఫర్ మాక్వారీ దర్శకత్వం వహిస్తున్నారు. ‘మిషన్ ఇంపాసిబుల్’ సిరీస్‌లో వస్తున్న 7వ చిత్రమిది. ఈ సినిమా ఎక్కువ శాతం షూటింగ్ ఇటలీలో జరగాలి. కరోనా వైరస్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. షూటింగ్స్ మళ్లీ ఎప్పుడు ప్రారంభం అవుతాయో ఎవరికీ స్పష్టంగా తెలియదు. దాంతో మిషన్ రిలీజ్ డేట్స్ మారాయి. ముందుగా 7వ భాగాన్ని 2021 జులైలో, 8వ భాగాన్ని 2022 ఆగస్ట్‌లో విడుదల చేయాలనుకున్నారు. తాజాగా 7వ భాగాన్ని 2021 నవంబర్ 19న, 8వ భాగాన్ని 2022 నవంబర్ 4న విడుదల చేయబోతున్నట్టు నిర్మాణ సంస్థ పారమౌంట్ పిక్చర్స్ తెలిపింది. -
ఇలా అయితే ఎలా కరోనా?
కాదేదీ సినిమా షూటింగ్‌కి అవాంతరం అంటారో నిర్మాత. అవును, సినిమా షూటింగ్ ఆగిపోవడానికి.. ఆగకుండా కురిసే వర్షం నుండి అనుకోకుండా వచ్చే వైరస్ కూడా కారణం అవొచ్చు. ప్లాన్ ఎంత పకడ్బందీగా ఉన్నా, నటీనటుల కాల్షీట్లు కావాల్సినన్ని ఉన్నా, కొన్ని సార్లు షూటింగ్ అనుకున్నట్టుగా సాగదు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్ – కరోనా. చాలా దేశాలు ప్రాణ భయంలో ఉన్నాయి. చైనాలో మొదలైన ఈ వైరస్ దెబ్బ అన్ని పరిశ్రమలపై పడింది. సినీ పరిశ్రమ మీద కూడా. ఇలా అకారణంగా ఊడిపడ్డ ఈ వైరస్ కారణంగా పలు సినిమాల షూటింగ్ షెడ్యూళ్లు తారుమారవుతున్నాయి. ఇలా అయితే ఎలా కరో (చెయ్య)నా అనే డైలమాలో కొన్ని యూనిట్లు పడ్డాయి. మొత్తానికి రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు వాయిదా పడుతున్నాయి. ప్రమోషన్లు డైలమాలో పడుతున్నాయి. ప్రస్తుతం కరోనా కారణంగా అనూహ్య ఇబ్బందులు ఎదుర్కొన్న సినిమాల గురించి వివరాలు. థాయ్ వద్దోయ్ నాగార్జున ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ అనే సీరియస్ థ్రిల్లర్ చిత్రం చేస్తున్నారు. ఇందులో ఏసీపీ విజయ్ వర్మ అనే పవర్ఫుల్ ఎన్ఐఏ ఆఫీసర్‌గా కనిపిస్తారు. అహిషోర్ సోల్మాన్ దర్శకుడు. ఈ సినిమాలో ఓ కీలక షెడ్యూల్‌ను థాయ్‌ల్యాండ్‌లో జరపాలనుకున్నారు. కరోనా ప్రభావం థాయ్‌ల్యాండ్‌లో కనిపించడంతో ఈ షెడ్యూల్‌ను వాయిదా వేసింది చిత్రబృందం. మరి ఈ షెడ్యూల్‌ను పూర్తి చేయడానికి కరోనా హడావిడి తగ్గాక థాయ్‌ల్యాండ్ వెళతారా? లేకపోతే లొకేషన్‌నే షిఫ్ట్ చేస్తారా? వేచి చూడాలి. వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. భారతీయుడు మళ్లీ వెతుకుతున్నాడు చైనాలో బయటపడ్డ కరోనా వైరస్ చెన్నైలో రెడీ అవుతున్న ‘ఇండియన్ 2’ను ఇబ్బందుల్లో పడేసింది. శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇండియన్ 2’. 1995లో వచ్చిన ‘ఇండియన్’కి సీక్వెల్ ఇది. ఈ సినిమాలో ఓ భారీ షెడ్యూల్‌ను చైనాలో పలు లొకేషన్లలో ప్లాన్ చేశారు శంకర్. దీనికి సంబంధించిన లొకేషన్లను కూడా గత ఏడాది సందర్శించి ఫిక్స్ చేసుకున్నారు. ప్రస్తుతం చైనాలో ఉన్న పరిస్థితుల్లో షూటింగ్ చేయడం రిస్క్. దీంతో లొకేషన్‌ను మార్చాలనే ప్లాన్‌లో ఉందట చిత్రబృందం. దీనికోసం మళ్లీ లొకేషన్లు వెతకడం నుంచి ప్రారంభించాలి. దీనివల్ల షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంది. ఏజెంట్ ప్లాన్ ఇంపాజిబుల్ ఏజెంట్ ఈతన్ హంట్ తన సరికొత్త మిషన్ కోసం ఇటలీ ప్రయాణించాల్సిన పని. అందుకు తగ్గ ప్లాన్‌ని సిద్ధం చేసుకున్నారు కూడా. కానీ అనుకోకుండా కరోనా అతని ప్రయాణానికి బ్రేక్ వేసింది. టామ్ క్రూజ్ ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ సిరీస్ ‘మిషన్ ఇంపాజిబుల్’. ఈ సిరీస్‌లో వస్తున్న ఏడో సినిమా ఇది. ఈ సినిమాలో పలు యాక్షన్ సన్నివేశాలను ఇటలీలో షూట్ చేయాలనుకున్నారు. ఇటలీలోనూ కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో షూటింగ్‌ను వాయిదా వేశారు. నో వే టు డూ ప్రపంచాన్ని చుట్టేయగల యాక్షన్ హీరో జేమ్స్‌బాండ్ . ప్రస్తుతం ఈ సిరీస్‌లో వస్తున్న తాజా చిత్రం ‘నో టైమ్ టు డై’. బాండ్ ఫ్రాంచైజీలో వస్తున్న 25వ చిత్రమిది. ఐదోసారి బాండ్ పాత్రలో డేనియల్ క్రెగ్ నటిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదల కానుంది. అయితే చైనాలో ఓ ప్రమోషనల్ టూర్‌తో పాటు స్పెషల్ ప్రీమియర్స్‌ను ప్లాన్ చేసింది ‘నో టైమ్ టు డై’ టీమ్. అయితే నో వే టు డూ అనే పరిస్థితి. కరోనా కారణంగా చైనాలో థియేటర్స్ అన్నీ కొన్ని రోజులుగా మూతబడి ఉన్నాయి. కరోనా కారణంగా ప్రమోషనల్ టూర్‌ని క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. చైనా మార్కెట్లో బాండ్ సినిమా విడుదల కాకపోతే సుమారు సుమారు 70 నుంచి 100 మిలియన్ డాలర్ల బిజినెస్ కోల్పోయినట్టే. ఇలా అనూహ్యంగా వచ్చిన ఈ వైరస్ వల్ల మరికొన్ని హాలీవుడ్ సినిమాలు కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నాయి. మరి ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ఎంతో సమయం, డబ్బు వృథా కాక మానదు. పరిస్థితులన్నీ చక్కబడి షూటింVŠ లు, రిలీజ్లు ఎప్పటిలానే చకచకా అయిపోవాలని కోరుకుందాం. -
హాలీవుడ్ మూవీపై కరోనా ఎఫెక్ట్
హాలీవుడ్ యాక్షన్ మూవీస్‌ని ఫాలో అయ్యేవారికి ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్ గురించి తెలిసే ఉంటుంది. ‘మిషన్ అసాధ్యం’ అనేది టైటిల్ అర్థం. నిజమే.. ఇందులో హీరోకి ఏదీ అసాధ్యం కాదు. ఇప్పటివరకూ ఆరు భాగాలు వచ్చాయి. ఏడో భాగం సెట్స్ మీద ఉంది. అన్ని భాగాల్లోనూ హీరోగా నటిస్తూ వస్తున్న టామ్ క్రూజ్ ఏడో భాగంలోనూ హీరోగా నటిస్తున్నారు. ఇప్పుడు ఈ అమెరికన్ యాక్షన్ స్పై ఫిల్మ్‌పై కరోనా ఎఫెక్ట్ పడింది. ఇటలీలో మూడు వారాల షెడ్యూల్‌ని ప్లాన్ చేశారు. అయితే అక్కడ కరోనా వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉండటంతో చిత్రనిర్మాణ సంస్థ పారామౌంట్ పిక్చర్స్ ఈ షెడ్యూల్‌ని వాయిదా వేసింది. ఈ సినిమాలో హీరోకి ఏదీ ఇంపాజిబుల్ కాదు.. అన్నీ సాధ్యం చేసేస్తాడు. కానీ కరోనా వైరస్ వల్ల ‘మిషన్ ఇంపాజిబుల్’ షూటింగ్ ఇటలీలో ఇంపాజిబుల్. వచ్చే ఏడాది జూలై 23న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
మిషన్ ఇంపాజిబుల్కు కశ్మీర్ కట్స్
ప్రపంచవ్యాప్తంగా జులై 27న విడుదలై బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్న టామ్ క్రూయిజ్ మిషన్ ఇంపాజిబుల్ ఫాలవుట్లో కొన్ని సన్నివేశాలపై భారత్‌లో కత్తెర పడింది. ఈ సినిమా క్లైమాక్స్ అంతా కశ్మీర్ బ్యాక్ డ్రాప్లో నడుస్తుంది. అందులో కశ్మీర్ ప్రస్తావన వచ్చినప్పుడు చూపించిన మ్యాప్‌లు, మరికొన్ని ఇతర అంశాలపై సెన్సార్ బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మ్యాప్‌లో కశ్మీర్ సరిహద్దుల్ని తప్పుగా గుర్తించడమే కాదు, భారత్ ఆధీనంలో కశ్మీర్ అంటూ ఉదహరించారు. వినోదం కోసం దేశ సమగ్రతకు సంబంధించిన అంశాలపై రాజీపడే ప్రసక్తే లేదని ఆ చిత్ర నిర్మాతలకు స్పష్టం చేసినట్టు సెన్సార్ బోర్డు చైర్మన్ ప్రసూన్ జోషి వెల్లడించారు. కశ్మీర్ మ్యాప్‌ను సరిగా చూపించాలని, లేదంటే ఆ సన్నివేశాన్ని తొలగించాలని, కశ్మీర్‌ను భారత రాష్ట్రంలా చూపించాలంటూ ఆదేశించారు. మొత్తం నాలుగు కట్స్, కొన్ని సవరణల్ని చెప్పారు. అంతే కాదు తమ చిత్రం ఏ మతం, వర్గం , ప్రాంతం, , దేశం వారి మనోభావాలను దెబ్బ తీయడానికి ఉద్దేశించినది కాదంటూ సినిమా మొదలవడానికి ముందు వెయ్యాలని కూడా ఆదేశించారు. భారత్‌లో విడుదలైన చిత్రానికి సంబంధించినంత వరకు వీటన్నింటినీ అమలు చేశారు. అయితే లడఖ్ ప్రాంతంలోని సియాచిన్ గ్లాసియర్, నూబ్రా లోయలకు సంబంధించిన ప్రస్తావనను అలాగే ఉంచేశారు. ఈ చిత్రాన్ని తొలుత భారత్‌లోనే షూట్ చేద్దామని భావించారు చిత్ర దర్శకుడు క్రిస్టోఫర్ మెక్వెరీ. చాలాసార్లు కశ్మీర్ అంతా తిరిగి కథకి అవసరమైన లొకేషన్ కోసం వెతికారు. ఒక హెలికాప్టర్ ఛేజింగ్ సన్నివేశం చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ శాంతి భద్రతల సమస్యతో న్యూజిలాండ్‌లో కశ్మీర్‌ను తలపించే సెట్ వేసి షూటింగ్ పూర్తి చేశారు. భారత్‌లో కనిపించే వైవిధ్యం తనకెంతో ఇష్టమని, అదంతా సినిమా క్లైమాక్స్‌లో వచ్చేలా చూసుకున్నామంటూ చిత్ర ప్రోమోషన్ సమయంలో క్రిస్టోఫర్ వివరించారు. మొదటి వీకెండ్‌కే ఈ సినిమా భారత్‌లో 56 కోట్లను కొల్లగొట్టి బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని హిట్‌గా నిలిచింది. హాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ పుల్ సిరీస్ మిషన్ ఇంపాజిబుల్.. ఇందులో ఆరో భాగంగా ఈ ఫాలవుట్ వచ్చింది. ఇందులో హీరో టామ్ క్రూయిజ్ ఇంపాజిబుల్ అనుకునే మిషన్‌ను చేపడతాడు. ఆ క్రమంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ ప్రేక్షకుల్ని మరో లోకంలోకి తీసుకువెళతాయి. హీరో టామ్ క్రూయిజ్ చేసే విన్యాసాలు ఈ సినిమాలకు అదనపు ఆకర్షణ. టెర్రరిస్టుల చేతుల్లో ప్లుటోనియం బాంబులు పడడం, వాటిని హీరో తిరిగి చేజిక్కించుకోవడం అనే కథాంశంతో ఫాలవుట్ని తీశారు. -
విమానానికి వేలాడుతూ... ఏడు టేక్‌లు
‘‘విమానం టేకాఫ్ అవుతూ ఉంటే దాని తలుపు పట్టుకుని వేలాడాలి. ఈ చిత్రానికి ఇది కీలకమైన ఘట్టం. చేసేటప్పుడు ఏ మాత్రం తేడా జరిగినా ప్రాణాలు గాల్లోకే. కానీ, వేరే మార్గం లేదు. చేస్తేనే బాగుంటుంది’’ అని హీరో టామ్ క్రూజ్‌తో అన్నారు దర్శకుడు క్రిస్టఫర్ మెక్వైర్. ‘మిషన్ ఇంపాజిబుల్ సిరీస్’లోని అయిదో భాగం ‘రోగ్ నేషన్ ’కి ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. టామ్ క్రూజ్ హీరో. దర్శకుడు చెప్పిన రిస్కీ సీన్‌కు ‘ఊహూ’ అనకుండా టామ్ క్రూజ్ ‘ఓకే’ అనేశారు. ఎలాగైనా సరే, ఒకే టేక్‌లోనే పూర్తి చేస్తే చాలనుకున్నారు చిత్ర బృందం. దర్శకుడు క్రిస్టఫర్ ‘యాక్షన్’ అనగానే విమానం టేకాఫ్ అయింది. గాల్లో ఎగురుతోంది. మానిటర్లో ఇదంతా చూస్తున్న దర్శకుడు సంతృప్తి చెంది, షాట్ ఓకే అనుకుని ‘కట్’ చెప్పారు. విమానం ల్యాండ్ అయ్యాక సీన్ చూసుకున్న టామ్ క్రూజ్ ఏ మాత్రం కన్విన్స్ కాలేదు. ‘ఇంకోసారి చేస్తా’ అన్నారు. ఈసారి కూడా ఆయనకు సంతృప్తి కలగలేదు. అలా మొత్తం ఏడు టేక్‌లు తీసుకున్నారు. సీన్ ఓకే అయింది. యూనిట్ మొత్తం హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. ‘‘విమానం ఎగిరే కొద్దీ గాలి నన్ను బాగా వెనక్కు తన్నింది. గాలి శక్తేంటో ఇప్పుడు తెలిసింది. విమానం నేల మీద ల్యాండ్ అయ్యేంత వరకూ నేను దాన్ని పట్టుకుని వేలాడాల్సిందే’’ అని ఆ సీన్ గురించి టామ్ వివరించారు. ఈ సిరీస్‌లో గత భాగం ‘ఘోస్ట్ ప్రొటోకాల్’లో కూడా దుబాయ్‌లోని ప్రపంచంలో ఎత్తయిన బిల్డింగ్ బూర్జ్ ఖలీఫా టవర్ పై రిస్కీ స్టంట్స్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు టామ్.